icon icon icon
icon icon icon

2 దశాబ్దాల తర్వాత పోటీకి దూరంగా కేసీఆర్‌ కుటుంబం

రెండు దశాబ్దాల తర్వాత మొదటిసారిగా కేసీఆర్‌ కుటుంబం లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంది.

Updated : 26 Apr 2024 08:20 IST

పార్టీ ఆవిర్భావం తర్వాత లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగకపోవడం ఇదే తొలిసారి

ఈనాడు, హైదరాబాద్‌: రెండు దశాబ్దాల తర్వాత మొదటిసారిగా కేసీఆర్‌ కుటుంబం లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంది. 2001లో భారాస (అప్పటి తెరాస) ఆవిర్భావం తర్వాత తొలిసారిగా కేసీఆర్‌ కుటుంబం నుంచి ఎవరూ లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగడం లేదు. పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో (2004లో) కేసీఆర్‌ సిద్దిపేట అసెంబ్లీ, కరీంనగర్‌ లోక్‌సభ స్థానాలకు పోటీచేసి.. రెండుచోట్లా విజయం సాధించారు. అనంతరం సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో అక్కడి నుంచి హరీశ్‌రావు గెలుపొందారు. కేంద్రంలో అప్పటి యూపీఏ ప్రభుత్వంలో నాటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ మంత్రివర్గంలో కేసీఆర్‌ మంత్రిగా కొనసాగారు. తదనంతర పరిణామాలు.. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో గులాబీ సారథి 2006, 2008 సంవత్సరాల్లో రెండుసార్లు రాజీనామా చేసి కరీంనగర్‌ నుంచి విజయం సాధించారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్‌ మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి గెలుపొందారు. ఇక్కడ ఆయన ఎంపీగా ఉన్నప్పుడే 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాకారమైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం జరిగిన ఎన్నికల్లో (2014లో) గజ్వేల్‌ నుంచి అసెంబ్లీకి, మెదక్‌ నుంచి పార్లమెంటుకు కేసీఆర్‌ పోటీచేసి రెండింటా గెలుపు సొంతం చేసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత మెదక్‌ ఎంపీ పదవికి భారాస అధినేత రాజీనామా చేయడంతో.. ఆ స్థానం నుంచి కొత్త ప్రభాకర్‌రెడ్డి ఎంపీగా గెలుపొందారు. ఇవే ఎన్నికల్లో కేసీఆర్‌ కుమార్తె కవిత కూడా నిజామాబాద్‌ ఎంపీగా విజయం సాధించారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్‌ ఎంపీగా పోటీ చేయకపోయినా.. కవిత మాత్రం నిజామాబాద్‌ స్థానం నుంచి బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. 2022లో తెరాసను భారాసగా మార్చిన కేసీఆర్‌.. జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో భారాస ఓటమి పాలై, ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. దీంతో 2024 లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్‌ కుటుంబం నుంచి ఎవరు పోటీలో నిలుస్తారనే ఆసక్తి తొలినాళ్లలో నెలకొంది. నిజామాబాద్‌ నుంచి తిరిగి కవితను పోటీ చేయించడం లేదనే సంకేతాలను పార్టీ ముందునుంచే ఇస్తూ వచ్చింది. మెదక్‌ నుంచి కేసీఆర్‌ ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం జరిగినా.. ఈసారి అక్కడి నుంచి వెంకట్రామిరెడ్డికి టికెట్‌ ఖరారు చేశారు. ఒక దశలో మల్కాజిగిరి నుంచి కేటీఆర్‌ను ఎంపీ అభ్యర్థిగా పోటీలో నిలపాలని పార్టీ చర్చించినట్లు ప్రచారం జరిగింది. అయితే ఎంపీగా పోటీ చేయడానికి కేటీఆర్‌ అంతగా ఆసక్తి చూపకపోవడంతో మరో అభ్యర్థి వైపు దృష్టి సారించిన అధిష్ఠానం చివరకు ఇక్కడ్నించి రాగిడి లక్ష్మారెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. మొత్తంగా పార్టీ ఆవిర్భవించిన 23 ఏళ్ల తర్వాత కేసీఆర్‌ కుటుంబం లోక్‌సభ ఎన్నికల్లో మొదటిసారిగా పోటీకి దూరంగా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img