icon icon icon
icon icon icon

తెలంగాణ అభివృద్ధి బాధ్యత మోదీదే

ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రధాని అవుతారని.. తెలంగాణ రాష్ట్ర సంక్షేమానికి పాటుపడతారని, ఇక్కడి అభివృద్ధికి ఆయన బాధ్యత తీసుకుంటారని గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్‌ పటేల్‌ అన్నారు.

Updated : 26 Apr 2024 05:17 IST

కరీంనగర్‌లో సంజయ్‌ విజయం ఖాయం
గుజరాత్‌ సీఎం భూపేంద్రభాయ్‌ పటేల్‌
కాంగ్రెస్‌, భారాసలు ప్రజల్ని పట్టించుకోలేదు: కిషన్‌రెడ్డి

కరీంనగర్‌, ఈనాడు - తెలంగాణ చౌక్‌, న్యూస్‌టుడే: ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రధాని అవుతారని.. తెలంగాణ రాష్ట్ర సంక్షేమానికి పాటుపడతారని, ఇక్కడి అభివృద్ధికి ఆయన బాధ్యత తీసుకుంటారని గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్‌ పటేల్‌ అన్నారు. మోదీ నేతృత్వంలో భాజపా దేశంలో 400 సీట్లను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్‌లో ఎంపీ అభ్యర్థిగా భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ నామినేషన్‌ కార్యక్రమానికి గురువారం భూపేంద్రభాయ్‌ పటేల్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీకి తరలివచ్చిన పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. పదేళ్ల పాలనలో ప్రధాని మోదీ ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ఖ్యాతిని పెంచారన్నారు. కరీంనగర్‌లో కమలం జోష్‌ బాగుందని, మరోసారి బండి సంజయ్‌ మంచి మెజారిటీతో విజయం సాధిస్తారన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మాట్లాడుతూ కరీంనగర్‌ గడ్డ మీద మరోసారి కాషాయ జెండా రెపరెపలాడుతుందన్నారు. భారాస, కాంగ్రెస్‌లకు ఎందుకు ఓటెయ్యాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారని.. కరీంనగర్‌లో ప్రత్యర్థుల తీరుని బట్టి సంజయ్‌ భారీ ఆధిక్యంతో గెలుస్తారన్నారు. ఇక్కడ గెలుపు ఖాయమైందని, అందుకే రాష్ట్రవ్యాప్తంగా సంజయ్‌ ఇతర నియోజకవర్గాల్లో భాజపా అభ్యర్థుల కోసం ప్రచారం సాగించాలని కోరారు. తెలంగాణ ప్రజల సమస్యల కోసం కొట్లాడి జైలుకు వెళ్లిన నాయకుడు సంజయ్‌ అని కొనియాడారు.

కాంగ్రెస్‌, భారాసలు నాణేనికి బొమ్మాబొరుసుల్లాంటివని, ఆ రెండు పార్టీలు ఎప్పుడూ ప్రజల్ని పట్టించుకోలేదని విమర్శించారు. బండి సంజయ్‌ మాట్లాడుతూ.. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు కోట్లకు వారసులని, తాను మాత్రం ప్రజల అభిమానమనే ఆస్తిని సంపాదించానన్నారు. గరీబోళ్ల బిడ్డనైన తాను పక్కా లోకల్‌ నాయకుడిగా స్థానికంగా అందరికీ అందుబాటులో ఉన్నానన్నారు. కాంగ్రెస్‌, భారాస అభ్యర్థులు నాన్‌ లోకల్‌ అని, వారిద్దరు జనం కోసం ఏ పోరాటాన్నీ సాగించలేదని, అన్నివర్గాల ప్రజల కోసం తాను చాలాసార్లు జైలుకు వెళ్లానని.. లాఠీ దెబ్బలు తిన్నానని.. చాలా కేసులు పెట్టారని.. ఏది ఏమైనా ప్రజల పక్షాన నిలబడటమే తనకిష్టమన్నారు. ఇండియన్‌ పొలిటికల్‌ లీగ్‌ (ఐపీఎల్‌) టీమ్‌ కెప్టెన్‌ మోదీ అని, తామంతా ఆయన జట్టులోని సభ్యులమన్నారు. మరి కాంగ్రెస్‌ జట్టుకు కెప్టెన్‌ ఎవరనేది ఇంతవరకు తెలియదన్నారు. అంతకుముందు కరీంనగర్‌ కలెక్టరేట్‌కు వెళ్లిన బండి సంజయ్‌ రిటర్నింగ్‌ అధికారిణి, కలెక్టర్‌ పమేల సత్పతికి నామినేషన్‌ పత్రాలను అందించారు. ఆయన వెంట భూపేంద్రభాయ్‌ పటేల్‌, కిషన్‌రెడ్డి, భాజపా మహిళా నాయకురాలు నళిని, పార్టీ లీగల్‌సెల్‌ అడ్వైజర్‌ కిరణ్‌ సింగ్‌ ఉన్నారు. అనంతరం పార్టీ శ్రేణులు నగరంలోని ఎస్సారార్‌ కళాశాల నుంచి భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img