icon icon icon
icon icon icon

భారాస మోసాలను కప్పిపుచ్చేందుకే రాజీనామా డ్రామాలు

భారాస మోసాలను కప్పిపుచ్చేందుకే రాజీనామా డ్రామాలు ఆడుతున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావుపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధ్వజమెత్తారు.

Published : 27 Apr 2024 03:48 IST

హరీశ్‌రావుపై మంత్రి కోమటిరెడ్డి ధ్వజం

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: భారాస మోసాలను కప్పిపుచ్చేందుకే రాజీనామా డ్రామాలు ఆడుతున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావుపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఎవరైనా రాజీనామా చేస్తే స్పీకర్‌ ఫార్మాట్‌లో ఒకే లైన్‌లో చేస్తారు గాని పేజీన్నర లేఖ రాస్తారా? అని ప్రశ్నించారు. ఆయన డ్రామాలు చిన్న పిల్లలకు కూడా తెలిసిపోయాయని.. వాటిని ఆపేసి అక్రమంగా సంపాదించిన సొమ్ముతో దుబాయ్‌కో, ఇంకెక్కడికైనా వెళ్లి బతికితే మంచిదని హితవు పలికారు. దమ్ముంటే ఎంపీ ఎన్నికల్లో మెదక్‌లో డిపాజిట్‌ తెచ్చుకోవాలని సవాల్‌ విసిరారు. మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మంత్రి శుక్రవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. దాంతోపాటు మొత్తం 13 హామీలు నెరవేర్చాలని, లేదంటే రాజీనామాకు సిద్ధం కావాలంటూ ఓ నకిలీ రాజీనామా లేఖ పట్టుకొని అమరవీరుల స్తూపం వద్ద హరీశ్‌రావు డ్రామా చేశారు. దళిత సీఎం, ఎస్సీలకు మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, ప్రతి ఎకరాకు ఉచిత యూరియా ఇస్తానని చెప్పి ఇవ్వకుండా కేసీఆర్‌ మోసం చేసినప్పుడు, నిరుద్యోగుల ఉసురు పోసుకున్నప్పుడు, ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇవ్వనప్పుడు.. హరీశ్‌రావు రాజీనామా లేఖతో అమరవీరుల స్తూపం దగ్గరకు వస్తే బాగుండేది. భారాసలో హరీశ్‌రావు ఒక సర్వెంట్‌. ఆయన ఎప్పటికీ సీఎం కాలేరు. నాడు ఆర్థికశాఖ మంత్రిగా ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలివ్వడం చేతకాలేదు. మేము ఒకటో తేదీనే జీతాలిస్తుంటే ఓర్వలేకపోతున్నారు. భారాస ప్రభుత్వం చేసిన రూ.లక్షల కోట్ల అప్పులకు ప్రతినెలా రూ.26 వేల కోట్ల వడ్డీలు కడుతున్నాం. ఇప్పుడు రైతులు ఇబ్బందులు పడటానికి ప్రధాన కారణం కేసీఆర్‌ చేసిన అప్పులే. మేము ఇచ్చిన ఆరు గ్యారంటీల్లోని హామీల్లో ఐదింటిని అమలు చేశాం. ఆరోది కూడా అమలు చేసి ప్రజల మన్ననలు పొందుతాం. 2019లో అధికారంలో ఉన్నప్పుడే భారాస 9 ఎంపీ సీట్లు గెలిచింది. ఇప్పుడు 12 సీట్లు గెలుస్తామని కేసీఆర్‌ చెబుతోంటే.. ఈవీఎంలను ఆయన ట్యాంపరింగ్‌ చేస్తారేమోనని అనుమానం కలుగుతోంది. ఎంపీ ఎన్నికల్లో భారాసకు డిపాజిట్లు కూడా రావు. జూన్‌ 4 తర్వాత భారాస మూతపడుతుంది’’ అని కోమటిరెడ్డి అన్నారు. యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. 2014 ఎన్నికల్లో భారాస ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేశారని, పదేళ్లలో హామీలు నెరవేర్చనప్పుడు అమరుల స్తూపం గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img