icon icon icon
icon icon icon

భాజపా ప్రతిష్ఠ దిగజారుతోందనే విద్వేష ప్రసంగాలు

మొదటి దశ లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రధాని నరేంద్రమోదీ ప్రకటనలతో యావత్తు దేశం అవమానపడుతోందని.. పదవికి కూడా ఆయన గౌరవం లేకుండా చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్‌ విమర్శించారు.

Published : 27 Apr 2024 03:49 IST

ప్రధాని పదవికి మోదీ గౌరవం లేకుండా చేస్తున్నారు.: మంత్రి పొన్నం

హైదరాబాద్‌, చిగురుమామిడి, న్యూస్‌టుడే: మొదటి దశ లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రధాని నరేంద్రమోదీ ప్రకటనలతో యావత్తు దేశం అవమానపడుతోందని.. పదవికి కూడా ఆయన గౌరవం లేకుండా చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్‌ విమర్శించారు. భాజపా ప్రతిష్ఠ దిగజారిపోతోందని విద్వేష ప్రసంగాలతో ప్రజల్లో అయోమయం, అలజడి సృష్టిస్తున్నారన్నారు. మంగళసూత్రాలు గుంజుకునే పరిస్థితి ఈ దేశంలో ఉందా? అని నిలదీశారు. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి, పార్టీ ఫిషర్‌మెన్‌ కమిటీ ఛైర్మన్‌ మెట్టు సాయికుమార్‌, అధికార ప్రతినిధి లింగం యాదవ్‌లతో కలిసి పొన్నం శుక్రవారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే సంపద ముస్లింలకు పంచుతుంది.. బంగారం గుంజుకుంటుంది.. హనుమాన్‌ చాలీసా చదవనివ్వదు అని మోదీ అంటున్నారు. హిందువులకు కాంగ్రెస్‌ పాలనలో రక్షణ ఉందా? భాజపా పాలనలోనా? గతంలో హనుమాన్‌ చాలీసా చదవలేదా? ఇప్పుడు చదవడం లేదా? గోమాంసం ఎగుమతి మా హయాంలో ఎంత, మీ హయాంలో ఎంతనేది దేశ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. పార్లమెంటులో తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించి మోదీ అమరులను అవమానిస్తే.. విభజన బిల్లుకు సుష్మాస్వరాజ్‌ మద్దతు తెలిపారని రాష్ట్రానికి చెందిన భాజపా ఎంపీలు ఒక్కరు కూడా చెప్పలేకపోయారు. విభజన హామీలు ఎందుకు అమలు చేయలేదని అడగలేకపోతున్నారు.. ఏ ముఖం పెట్టుకొని ఇప్పుడు ఓట్లు అడుగుతారు? కులగణన నిర్వహించి రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్‌ చెబితే.. భయపడి విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారు. మా హయాంలో నిర్మితమైన గుళ్లు ఎన్ని, ఈ పదేళ్లలో మీరెన్ని నిర్మించారు? దేవాలయాలకు ఏమైనా ప్రత్యేక నిధులు కేటాయించారా?’ అని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రధాని, భాజపా నేతలను ప్రశ్నించారు.

 నేతన్నల ఆత్మహత్యలు గత ప్రభుత్వ పాపమే

సిరిసిల్ల నేతన్నల ఆత్మహత్యలకు గత ప్రభుత్వమే కారణమని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆరోపించారు. కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావుకు మద్దతుగా కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో మానకొండూర్‌ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నేతన్నలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం అండగా ఉండి వారి సమస్యలు పరిష్కరిస్తుందని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img