icon icon icon
icon icon icon

లోక్‌సభ బరి.. 28 మందికి తొలిసారి..!

శాసనసభ ఎన్నికల ఫలితాలతో రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులు అన్ని పార్టీలకు కొత్త సవాళ్లను తెచ్చిపెట్టాయి.

Published : 27 Apr 2024 03:50 IST

15 మంది ఏ చట్టసభకూ పోటీ చేయని వారే..
బరిలో 31 మంది తాజా, మాజీ ప్రజాప్రతినిధులు

ఈనాడు, హైదరాబాద్‌: శాసనసభ ఎన్నికల ఫలితాలతో రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులు అన్ని పార్టీలకు కొత్త సవాళ్లను తెచ్చిపెట్టాయి. లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటుకోవడం మూడు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, భారాస, భాజపాలకు అనివార్యంగా మారింది.  రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ స్థానాల్లో ముక్కోణపు పోటీలకు తెరలేచింది. గెలుపే లక్ష్యంగా పార్టీలు అనుసరించిన వ్యూహాల ఫలితంగా అత్యధికంగా తాజా, మాజీ ప్రజాప్రతినిధులే అభ్యర్థులుగా నిలిచారు.

కాంగ్రెస్‌, భారాస, భాజపా ప్రకటించిన మొత్తం 51 మంది అభ్యర్థుల్లో.. 31 మంది ఏదో ఒక చట్టసభకు ప్రాతినిధ్యం వహించిన, వహిస్తున్న వారే. వీరిలో తొమ్మిది మంది సిటింగ్‌ ఎంపీలు, ఎనిమిది మంది మాజీ ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, పది మంది మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే మొత్తంగా లోక్‌సభకు తొలిసారి పోటీ పడుతున్నవారు 28 మంది ఉన్నారు.

 తాజా, మాజీ ఎంపీలే మరోమారు..

  •  మహబూబాబాద్‌ స్థానంలో సిటింగ్‌ ఎంపీ మాలోత్‌ కవిత (భారాస)కు ప్రత్యర్థులుగా ఇద్దరు మాజీ ఎంపీలు పోరిక బలరాంనాయక్‌ (కాంగ్రెస్‌), సీతారాంనాయక్‌ (భాజపా) పోటీ పడుతున్నారు.
  • కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్‌ స్థానం మూడు ప్రధాన పార్టీలకు కీలకంగా మారింది. ఇక్కడ సిటింగ్‌ ఎంపీ కిషన్‌రెడ్డిపై ఇద్దరు ఎమ్మెల్యేలు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ తరఫున ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌, భారాస నుంచి సికింద్రాబాద్‌ ఎమ్మెల్యే పద్మారావుగౌడ్‌ బరిలో దిగారు.
  • నిజామాబాద్‌లో సిటింగ్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ (భాజపా)తో తలపడుతున్న కాంగ్రెస్‌, భారాస అభ్యర్థులు టి.జీవన్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్‌.. ఇద్దరూ మాజీ ఎమ్మెల్యేలే.
  • మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో 13 మంది ఇప్పుడు లోక్‌సభ గోదాలోనూ దిగారు.
  • మహబూబ్‌నగర్‌ బరిలో ఉన్న ముగ్గురూ పాత ప్రత్యర్థులే. 2019 లోక్‌సభ ఎన్నికల్లో భారాస, కాంగ్రెస్‌, భాజపాల తరఫున పోటీ చేసిన మన్నె శ్రీనివాస్‌రెడ్డి, వంశీచంద్‌రెడ్డి, డీకే అరుణ.. ఇప్పుడూ అవే పార్టీల అభ్యర్థులుగా తలపడుతున్నారు.

బరిలో నలుగురు వారసులు

బలమైన అభ్యర్థులను బరిలో దించే క్రమంలో కొత్త వారికి పరిమితంగానే అవకాశాలు దక్కాయి. మూడు ప్రధాన పార్టీలు ప్రకటించిన 51 మందిలో 15 మంది చట్టసభలకు పోటీ చేయడం ఇదే తొలిసారి. ఆత్రం సుగుణ, కడియం కావ్య, పట్నం సునీతా మహేందర్‌రెడ్డి, ఎం.సుధీర్‌కుమార్‌, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, భరత్‌ప్రసాద్‌, గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌, మాధవీలత, వంశీకృష్ణ, తాండ్ర వినోద్‌రావు, కె.రఘువీర్‌రెడ్డి, కంచర్ల కృష్ణారెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి, ఆర్‌.రఘురాంరెడ్డి, వలీవుల్లా సమీర్‌లు ఎన్నికల బరిలో అరంగేట్రం చేస్తున్నారు. వీరిలో నలుగురు అభ్యర్థులు.. ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న నాయకులకు వారసులు. పెద్దపల్లి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గడ్డం వంశీకృష్ణ.. చెన్నూరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జి.వివేక్‌ కుమారుడు. రాష్ట్ర కాంగ్రెస్‌ అగ్రనేత కె.జానారెడ్డి కుమారుడు రఘువీర్‌రెడ్డి నల్గొండ నుంచి పోటీ చేస్తున్నారు. సీనియర్‌ నాయకుడు, ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య వరంగల్‌ బరిలో నిలిచారు. నాగర్‌కర్నూల్‌ నుంచి సిటింగ్‌ ఎంపీ రాములు కుమారుడు భరత్‌ భాజపా తరఫున పోటీలో ఉన్నారు. ఇటీవల వరకు ఉపాధ్యాయురాలిగా ఉన్న ఆదిలాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఆత్రం సుగుణ ఉపాధ్యాయ సంఘం నేత, మానవహక్కుల ఉద్యమ నాయకురాలు కూడా.


అక్కడ గెలిచేదెవరైనా పార్లమెంటుకు కొత్తే..

ఐదు లోక్‌సభ నియోజకవర్గాల్లో సిటింగ్‌, మాజీ ఎంపీలెవరూ బరిలో లేరు. వరంగల్‌, నల్గొండ, మల్కాజిగిరి, మెదక్‌, పెద్దపల్లి స్థానాల్లో పోటీ పడుతున్న ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ఎవరు గెలిచినా.. తొలిసారి లోక్‌సభలో అడుగుపెడతారు. అలాగే తాజా, మాజీ ఎంపీలు మినహా మిగిలిన 34 మంది అభ్యర్థుల్లో ఎవరు గెలిచినా వారు లోక్‌సభకు కొత్తే.

  •  ఇద్దరు ఎమ్మెల్సీల్లో టి.జీవన్‌రెడ్డి నిజామాబాద్‌ నుంచి కాంగ్రెస్‌ తరఫున బరిలో ఉండగా.. వెంకట్రామిరెడ్డి భారాస అభ్యర్థిగా మెదక్‌లో పోటీచేస్తున్నారు.
  • ఈసారి కాంగ్రెస్‌ తరఫున రాష్ట్ర అగ్రనేతలెవరూ లోక్‌సభ బరిలో లేకపోగా, భాజపా ముఖ్యనేతలంతా పోటీ చేస్తున్నారు. భాజపా సిటింగ్‌ ఎంపీలైన కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, డి.అర్వింద్‌లతో పాటు సీనియర్‌ నేతలు డి.కె.అరుణ, ఈటల రాజేందర్‌, రఘునందన్‌రావు తదితరులు బరిలో నిలిచారు.
  • భారాసకు చెందిన తొమ్మిది మంది సిటింగ్‌ ఎంపీల్లో ప్రస్తుతం ముగ్గురు మాత్రమే ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. నామా నాగేశ్వరరావు (ఖమ్మం), మాలోత్‌ కవిత (మహబూబాబాద్‌), మన్నె శ్రీనివాస్‌రెడ్డి (మహబూబ్‌నగర్‌) మళ్లీ భారాస అభ్యర్థులుగానే బరిలో నిలిచారు. రంజిత్‌రెడ్డి (చేవెళ్ల) కాంగ్రెస్‌లో, బీబీ పాటిల్‌ (జహీరాబాద్‌) భాజపాలో చేరి.. అవే స్థానాల్లో పోటీ చేస్తున్నారు. నాగర్‌కర్నూల్‌ సిటింగ్‌ ఎంపీ రాములు భాజపాలో చేరి.. ఆ పార్టీ తరఫున తన కుమారుడు భరత్‌ప్రసాద్‌ను బరిలో దింపారు. మరో ఇద్దరు సిటింగ్‌ ఎంపీలు పసునూరి దయాకర్‌ (వరంగల్‌), వెంకటేష్‌ నేత (పెద్దపల్లి) కాంగ్రెస్‌లో చేరినా, ప్రస్తుతం పోటీలో లేరు. మెదక్‌ సిటింగ్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img