icon icon icon
icon icon icon

కాంగ్రెస్‌ది తప్పుడు ప్రచారం

భాజపా అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఉండవనే తప్పుడు ప్రచారంతో కాంగ్రెస్‌ పబ్బం గడుపుకోవాలని చూస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు.

Published : 27 Apr 2024 03:51 IST

రిజర్వేషన్లపై పబ్బం గడుపుకోవాలని ఆ పార్టీ చూస్తోంది
ఆరు గ్యారంటీలపై ఛార్జ్‌షీట్‌ విడుదల చేయాలి
పదవిపై సీఎం రేవంత్‌రెడ్డి ఆందోళన చెందుతున్నారు
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: భాజపా అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఉండవనే తప్పుడు ప్రచారంతో కాంగ్రెస్‌ పబ్బం గడుపుకోవాలని చూస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేశాకే సీఎం రేవంత్‌రెడ్డి రిజర్వేషన్లపై మాట్లాడాలన్నారు. భారతీయ జీవన శైలిపైనే కాంగ్రెస్‌ దాడి చేస్తోందని విమర్శించారు. ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ ఇప్పుడు ఇటలీ నేషనల్‌ కాంగ్రెస్‌గా మారిపోయిందని అన్నారు. దేశంలోని సమస్యలన్నింటికీ అదే కారణమన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా ముస్లింలకు నాలుగుశాతం రిజర్వేషన్లు కల్పించారని, వాటిని రద్దు చేసి తీరుతామని అన్నారు. శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘మాది దేశం కోసమే పుట్టిన పార్టీ. భాజపా అడ్డుకోకపోతే కాంగ్రెస్‌ పార్టీ సోనియాగాంధీని ఎప్పుడో దేశానికి ప్రధాన మంత్రిని చేసేది. దేశంలో ఎన్నికల వ్యవస్థ నిర్వీర్యం కావడానికి, అవినీతి, పేదరికం పెరగడానికి, మాఫియా రాజ్యాలు రావడానికి, కుటుంబ పాలనలో దేశంమగ్గిపోవడానికి కాంగ్రెస్‌దే బాధ్యత. ఆ పార్టీకి రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. లోక్‌సభ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే కుట్రపూరితమైన ఆలోచనతో అది భాజపాపై బురద చల్లడంపనిగా పెట్టుకుంది. అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్‌కు ఎలాంటి అవకాశం లేదు. ప్రజలు మోదీ పాలనను కోరుకుంటున్నారు. కాంగ్రెస్‌ అంబేడ్కర్‌ను విస్మరించింది.. పీవీని అవమానపరిచింది. రాష్ట్రంలో ఆ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల మాటేమిటి? మహిళలకు ఉచిత బస్సు పథకం తప్ప ఏవీ అమలవలేదు. గత ఏడాది డిసెంబరు 9న రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు ఆగస్టు 15 అంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీ భాజపాపై ఛార్జ్‌షీట్‌ విడుదల చేయడం కాదు... ఆ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలపై ఛార్జ్‌షీట్‌ విడుదల చేయాలి. అది ఇచ్చిన హామీలే దానికి భస్మాసుర హస్తంగా మారతాయి. లోక్‌సభ ఎన్నికల తర్వాత సీఎం కుర్చీ ఉంటుందో ఉండదో అని రేవంత్‌రెడ్డి ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలో జరిగిన అన్ని వైఫల్యాలకు మాజీ సీఎం కేసీఆర్‌ కారణం. రాష్ట్రంలో రూ.వేలకోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు ప్రధాని వస్తే కనీసం ఆ కార్యక్రమాల్లో ఆయన పాల్గొనలేదు’’ అని విమర్శించారు. నిజామాబాద్‌ మాజీ ఎంపీ రామ్‌గోపాల్‌రెడ్డి కుమారుడు ఎం.వెంకట శ్రీనివాస్‌రెడ్డి ఇతర నేతలకు కిషన్‌రెడ్డి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. విలేకరుల సమావేశంలో భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జి.ప్రేమేందర్‌రెడ్డి, బంగారు శ్రుతి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img