icon icon icon
icon icon icon

యుద్ధానికి సిద్ధం కావాలి..

‘నాడు అంత కష్టపడి.. ప్రాణాలకు తెగించి తెలంగాణ తెచ్చాను. పదేళ్లలో రాష్ట్రాన్ని పురోగతిలో నడిపించాం. అలాంటి తెలంగాణ నా కళ్ల ముందు నాశనమైపోతుంటే చూస్తూ ఊరుకోవాలా? కొట్లాడదాం.. ఎలాంటి పోరాటానికైనా ప్రజలు సిద్ధంగా ఉండాలి.

Updated : 27 Apr 2024 06:15 IST

తెలంగాణ నాశనమవుతుంటే చూస్తూ ఊరుకోవాలా..?
నా ప్రాణం ఉన్నంతవరకు పోరాడతా
రేవంత్‌ ఛోటే భాయ్‌.. మోదీ బడే భాయ్‌..
భారాసను అణగదొక్కేందుకు కాంగ్రెస్‌, భాజపాల కుట్ర
మహబూబ్‌నగర్‌ పోరుబాటలో కేసీఆర్‌

ఈనాడు, మహబూబ్‌నగర్‌: ‘నాడు అంత కష్టపడి.. ప్రాణాలకు తెగించి తెలంగాణ తెచ్చాను. పదేళ్లలో రాష్ట్రాన్ని పురోగతిలో నడిపించాం. అలాంటి తెలంగాణ నా కళ్ల ముందు నాశనమైపోతుంటే చూస్తూ ఊరుకోవాలా? కొట్లాడదాం.. ఎలాంటి పోరాటానికైనా ప్రజలు సిద్ధంగా ఉండాలి. కేసీఆర్‌ ప్రాణం ఉన్నంత వరకు యుద్ధం చేస్తాడు.. తప్ప నిద్రపోడు’ అని మాజీ ముఖ్యమంత్రి, భారాస అధినేత కేసీఆర్‌ అన్నారు. ఆయన చేపట్టిన ‘పోరుబాట.. బస్సుయాత్ర’ శుక్రవారం మహబూబ్‌నగర్‌లో సాగింది. పట్టణంలోని మెట్టుగడ్డ చౌరస్తా నుంచి క్లాక్‌ టవర్‌ వరకు రోడ్‌ షో నిర్వహించారు. అనంతరం అక్కడ కూడలి సమావేశంలో కేసీఆర్‌ ప్రసంగించారు. భాజపా, కాంగ్రెస్‌ పార్టీలు రాష్ట్రానికి, దేశానికి చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. రెండూ ఏకమై ప్రాంతీయ పార్టీలను దెబ్బకొట్టి తమ ప్రాబల్యాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించారు. భారాసను అణగదొక్కేందుకు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు.

వాళ్లకి ఓటేస్తే మీటర్లు పెడతారు

‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఛోటే భాయ్‌.. నరేంద్ర మోదీ బడే భాయ్‌. ఇద్దరూ ఒక్కటే. ఇక్కడ ఛోటే భాయ్‌కి ఓటేస్తే.. పెద్దన్న మోదీ చెప్పారని వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతారు. భాజపాకు ఓటేసినా అదే పరిస్థితి. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. నా ప్రాణం పోయినా మీటర్లు పెట్టనని మోదీకి చెప్పాను. రైతు వ్యతిరేక చట్టాలు తెస్తే దిల్లీలో అన్నదాతలు ధర్నా చేశారు. దాదాపు 750మంది  రైతులు చనిపోయారు. నేను తెలంగాణ తరఫున పంజాబ్‌, చండీగఢ్‌ వెళ్లి.. చనిపోయిన రైతుల కుటుంబాలకు సాయం అందించాను. భాజపా దేవుడి పేరు చెప్పి జనం ముందుకొస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎక్కడికి వెళ్లినా.. దేవుళ్ల పేరు చెప్పి ఓట్ల రాజకీయాలు చేస్తున్నారు. ఈ ఓట్ల రాజకీయాలు ఎవరూ నమ్మరు.

రైతుబంధును ఉంచుతారో.. ఊడగొడతారో..?

కేసీఆర్‌.. నీ గుడ్లు పీకి గోలీలాడుకుంటా.. నీ పేగులు పీకి మెడలో వేసుకుంటా? నిన్ను చర్లపల్లి జైల్లో వేస్తా. ఇవేనా ఒక ముఖ్యమంత్రి అనాల్సిన మాటలు? తెలంగాణ కోసం పోరాడిన నన్ను అలా మాట్లాడడం మర్యాదేనా? గత పదేళ్ల పాలన ఎలా ఉండేది? కరెంట్‌ ఎప్పుడైనా పోయిందా.. ఇప్పుడు వస్తోందా? ఉద్యమ సమయంలో 25 ఎకరాలు ఉన్న రైతులు కూడా మహబూబ్‌నగర్‌కు వచ్చి ఆటోలు నడిపేవారు. అలాంటి వాళ్లని కూడా ఆదుకోవాలని రైతుబంధు పెట్టాను. కాంగ్రెస్‌ ప్రభుత్వం మాత్రం మూడు ఎకరాలు, ఐదు ఎకరాలున్న రైతులకే సాయం చేస్తామని అంటోంది. 6, 7 ఎకరాలు ఉన్నవారు ఎక్కడికి పోవాలి. వాళ్లేమైనా కోటీశ్వరులా? రైతుబంధును ఉంచుతారో.. ఊడగొడతారో నమ్మకం లేదు. రైతుబీమా కూడా ఉంటుందో లేదో చెప్పలేం. మా ప్రభుత్వంలో అంబేడ్కర్‌ ఓవర్‌సీస్‌ ద్వారా రూ.20 లక్షల చొప్పున స్కాలర్‌షిప్‌లు ఇచ్చాం. ఈ ప్రభుత్వంలో అంతా మోసం. అందుకే రైతులు, యువత అందరూ ఏకమై ఈ ప్రభుత్వం మెడలు వంచాలి. భారాసకు బలం కావాలి. అది మీరే ఇవ్వాలి. ఇక్కడ మన్నె శ్రీనివాస్‌రెడ్డి గెలిస్తే భారాసకు బలం వస్తుంది.

భాజపా.. అక్కరకు రాని చుట్టం

భాజపా ఈ దేశాన్ని పదేళ్లుగా పరిపాలిస్తోంది. పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కావాలని 100 ఉత్తరాలు రాశాం. ఇచ్చారా? అందుకోసం భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్న డీకే అరుణ కృషి చేశారా? మరి ఆమె ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతున్నారు? కేంద్ర చట్టం ప్రకారం.. ప్రతి జిల్లాకు నవోదయ పాఠశాల ఇవ్వాల్సి ఉండగా.. మనకి ఒక్కటైనా ఇచ్చారా? దేశంలో మోదీ 157 వైద్య కళాశాలలు పెట్టారు. మాకు నాలుగు ఇవ్వాలని దరఖాస్తు పెడితే.. ఒక్కటీ ఇవ్వలేదు. మోదీ ఏడు మండలాలను గుంజి ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చారు. 400 మెగావాట్ల సీలేరు పవర్‌ ప్లాంటును ఏపీకి ఇచ్చారు. భాజపా అంటే మనకు అక్కరకు రాని చుట్టం.

భారాస సెక్యులర్‌ పార్టీ..

మైనార్టీ మిత్రులారా.. మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్‌ మూడో స్థానంలో ఉంది. ఇక్కడ భారాస, భాజపా మధ్యనే పోటీ ఉంది. మీరు కాంగ్రెస్‌కు ఓటేస్తే భాజపాకు వేసినట్లే. రంజాన్‌ పండుగకు మా ప్రభుత్వం ముస్లిం కుటుంబాలకు కానుకలు ఇచ్చేది. ఈసారి ఎందుకివ్వలేదు? మేం దేశంలోనే తొలిసారిగా ఇమాంలకు జీతాలు ఇచ్చాం. దశాబ్దాలపాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌ మైనార్టీలకు ఏమైనా చేసిందా? మీ పిల్లల కోసం రెసిడెన్షియల్‌ పాఠశాలలు కట్టించాను. మీరు పొరపాటున కాంగ్రెస్‌కు ఓటేస్తే భాజపా గెలుస్తుంది. భారాస సెక్యులర్‌ పార్టీ. అందుకే కారు గుర్తుకే ఓటు వేయండి’ అని కేసీఆర్‌ కోరారు. కేసీఆర్‌ పర్యటనలో మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ నాయకులు శ్రీనివాస్‌గౌడ్‌, డా.లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి,  రామ్మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.


భారాస ఆవిర్భావ దినోత్సవ వేళ కేసీఆర్‌ శుభాకాంక్షలు

ఈనాడు, హైదరాబాద్‌: భారత రాష్ట్ర సమితి (అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి) ఆవిర్భావ దినోత్సవం (ఏప్రిల్‌ 27) సందర్భంగా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, రాష్ట్ర ప్రజానీకానికి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. దశాబ్దాలపాటు సాగిన స్వరాష్ట్ర సాధన పోరాటాలను తమ పార్టీ గమ్యానికి చేర్చిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. త్యాగాల పునాదులపై పుట్టిన పార్టీ.. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడంతోపాటు పదేళ్ల పాలనలో ప్రజలకు అద్భుతమైన ప్రగతి ఫలాలు అందించిందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img