icon icon icon
icon icon icon

ఇదిగో నా రాజీనామా..

‘‘శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ ఇచ్చిన రూ.2 లక్షల రైతు రుణమాఫీ, ఆరు గ్యారంటీల్లోని 13 హామీలు సీఎం రేవంత్‌రెడ్డి చెప్పినట్లు ఆగస్టు 15వ తేదీలోపు అమలు చేస్తే నేను నా శాసనసభా సభ్యత్వానికి అదే రోజు రాజీనామా చేసినట్లు పరిగణించి ఆమోదం తెలపండి’’ అని స్పీకర్‌కు రాసిన లేఖతో మాజీ మంత్రి హరీశ్‌రావు శుక్రవారం అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కు వద్దకు వచ్చారు.

Published : 27 Apr 2024 03:54 IST

రుణమాఫీ, గ్యారంటీలు ఆగస్టు 15లోపు అమలైతే ఆమోదించండి
మాజీ మంత్రి హరీశ్‌రావు లేఖ
గన్‌పార్కు వద్ద ఉద్యమకారులైన జర్నలిస్టులకు అందజేత
స్పీకర్‌ ఫార్మాట్‌లోనూ సిద్ధంగా ఉంది..
హామీలు నెరవేర్చకపోతే రేవంత్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా అని ప్రశ్న

ఈనాడు, హైదరాబాద్‌, నారాయణగూడ, న్యూస్‌టుడే: ‘‘శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ ఇచ్చిన రూ.2 లక్షల రైతు రుణమాఫీ, ఆరు గ్యారంటీల్లోని 13 హామీలు సీఎం రేవంత్‌రెడ్డి చెప్పినట్లు ఆగస్టు 15వ తేదీలోపు అమలు చేస్తే నేను నా శాసనసభా సభ్యత్వానికి అదే రోజు రాజీనామా చేసినట్లు పరిగణించి ఆమోదం తెలపండి’’ అని స్పీకర్‌కు రాసిన లేఖతో మాజీ మంత్రి హరీశ్‌రావు శుక్రవారం అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కు వద్దకు వచ్చారు. ‘నేను గురువారం నాడు చెప్పినట్లే రాజీనామా లేఖతో వచ్చా.. రాజీనామా పత్రాన్ని తెలంగాణ ఉద్యమకారులైన జర్నలిస్టుల చేతుల్లో పెడుతున్నా’ అని హరీశ్‌రావు చెప్పారు. స్పీకర్‌ ఫార్మాట్‌లోనూ రాజీనామా లేఖ సిద్ధంగా ఉందని కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీలన్నింటినీ ఆగస్టు 15లోగా అమలు చేస్తే సభాపతికి పంపిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఆపై ఉప ఎన్నికల్లోనూ పోటీ చేయనని పునరుద్ఘాటించారు. ఒకవేళ రుణమాఫీతోపాటు ఆరు గ్యారంటీలు అమలు చేయకపోతే మీ రాజీనామా పత్రం గవర్నర్‌కు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? అని సీఎం రేవంత్‌ను ప్రశ్నించారు. రాజీనామాకు తాను సిద్ధంగా ఉన్నా... మీరు ముందుకు రాలేదంటే మరోమారు ప్రజలను మోసం చేస్తున్నట్లుగా అనుమానించాల్సి వస్తోందని రేవంత్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. సీఎం బిజీగా ఉంటే వ్యక్తిగత సహాయకుల ద్వారా పంపించినా సరిపోయేదన్నారు. రైతు రుణమాఫీ అమలుపై రేవంత్‌రెడ్డి విసిరిన సవాల్‌ను స్వీకరించిన హరీశ్‌రావు రాజీనామా పత్రంతో గన్‌పార్కు వద్దకు రాగా పెద్దఎత్తున భారాస కార్యకర్తలు తరలివచ్చారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఎన్నికల నిబంధనల దృష్ట్యా హరీశ్‌రావుతోపాటు మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్‌, వివేకానంద్‌, బండారి లక్ష్మారెడ్డిలను మాత్రమే గన్‌పార్కులోకి అనుమతించారు. అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.

నా పదవి కంటే ప్రజల మేలు ముఖ్యం

‘‘కాంగ్రెస్‌  ఆరు గ్యారంటీలు, రుణమాఫీ వంటి హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. సీఎం  దేవుళ్లను కూడా వదిలిపెట్టకుండా ప్రమాణాలు చేసి రాష్ట్ర ప్రజల్ని మరోమారు మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అవ్వాతాతలకు రూ.4 వేల పింఛను, వడ్లు, మొక్కజొన్నకు రూ.500 బోనస్‌, రైతుబంధు రూ.15 వేలు, రూ.4 వేల నిరుద్యోగ భృతి, మహిళలకు రూ.2500.. ఇలా హామీలన్నీ అమలుచేయాలి. ఇవన్నీ కాంగ్రెస్‌ నేతలే స్వయంగా బాండు పేపర్ల మీద రాసిచ్చినవి. వంద రోజుల్లోగా వీటికి చట్టబద్ధత కల్పిస్తామన్నారు. 100 రోజుల్లో అమలు చేయించే బాధ్యత మాది అని సోనియాగాంధీ రాష్ట్ర ప్రజలకు లేఖ కూడా రాశారు. డిసెంబరు 9న రుణమాఫీపై తొలి సంతకం చేస్తామని మాట తప్పినందుకు సీఎం ప్రజలకు ముందుగా క్షమాపణ చెప్పాలి. నా ఎమ్మెల్యే పదవి కంటే.. ఈ హామీల అమలు,  ప్రజలకు మేలు జరగడం ముఖ్యం’’ అని హరీశ్‌రావు అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img