icon icon icon
icon icon icon

రాజ్యాంగాన్ని మార్చేందుకు భాజపా కుట్ర

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తేవడమనేది క్రికెట్‌ సెమీఫైనల్‌లో బంగ్లాదేశ్‌ లాంటి కేసీఆర్‌ను ఓడించడం లాంటిది. ఇప్పుడు మేం పాకిస్థాన్‌ టీం లాంటి మోదీతో ఫైనల్‌ ఆడుతున్నాం.

Published : 27 Apr 2024 03:55 IST

కార్పొరేట్‌ సంస్థలకు మోదీ దాసోహం
జహీరాబాద్‌లో భాజపా అభ్యర్థికి కేసీఆర్‌ సహకారం
పెద్దశంకరంపేట జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
పాకిస్థాన్‌ టీం లాంటి మోదీతో ఫైనల్‌ ఆడుతున్నాం

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తేవడమనేది క్రికెట్‌ సెమీఫైనల్‌లో బంగ్లాదేశ్‌ లాంటి కేసీఆర్‌ను ఓడించడం లాంటిది. ఇప్పుడు మేం పాకిస్థాన్‌ టీం లాంటి మోదీతో ఫైనల్‌ ఆడుతున్నాం. కాంగ్రెస్‌పై మోదీ, అమిత్‌షా, నడ్డా, భాజపా ఇతర జాతీయ నాయకులు ముప్పేట దాడి చేస్తున్నారు. రిజర్వేషన్లకు మతం రంగు పులుముతున్నారు. ఈ అంశాలను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా విభాగంపైనే ఉంది.      

సీఎం రేవంత్‌రెడ్డి


ఈనాడు-కామారెడ్డి, పెద్దశంకరంపేట-న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల్లో 400 ఎంపీ స్థానాలు సాధించి రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేందుకు భాజపా కుట్ర చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మెదక్‌ జిల్లా పెద్దశంకరంపేటలో శుక్రవారం సాయంత్రం జరిగిన కాంగ్రెస్‌ జనజాతర బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ‘‘భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇదివరకే రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చిందన్న విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలి. రైతుల పోరాటానికి మోదీ ప్రభుత్వం దిగివచ్చి వాటిని రద్దు చేసింది. కర్షకులకు ప్రధాని మోదీ క్షమాపణలు కూడా చెప్పారు. మోదీ, అమిత్‌షాలకు అదానీ, అంబానీ తోడయ్యారు. రిజర్వేషన్లు ఉంటే తమ పాచికలు పారవని ఈ నలుగురూ నిర్ణయించుకున్నారు. రాజ్యాంగాన్ని మార్చి.. వాటిని రద్దు చేయాలని చూస్తున్నారు. కార్పొరేట్‌ సంస్థలకు దాసోహం అంటున్న మోదీ.. దేశాన్ని అప్పులపాలు చేశారు.

భాజపాతో కేసీఆర్‌ కుమ్మక్కు

భారాస అధినేత కేసీఆర్‌ భాజపాతో కుమ్మక్కై కాంగ్రెస్‌ను ఓడించేందుకు ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్‌కు చెప్పాకే బీబీ పాటిల్‌ భాజపాలో చేరారు. ఈ నేపథ్యంలోనే మెదక్‌ ఎంపీ టికెట్‌ అడిగిన గాలి అనిల్‌కుమార్‌కు జహీరాబాద్‌ టికెట్‌ ఇచ్చారు. ఆయనకు జహీరాబాద్‌పై ఎటువంటి అవగాహన లేదు. బలహీన అభ్యర్థిని నిలబెట్టి పరోక్షంగా భాజపా అభ్యర్థి విజయానికి కేసీఆర్‌ సహకరిస్తున్నారు.

భారాస హయాంలో కేసీఆర్‌ కుటుంబికులకే ఉద్యోగాలు

భారాస ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు. కేసీఆర్‌ కుటుంబికులకు మాత్రం రాజకీయ ఉద్యోగాలు వచ్చాయి. కేసీఆర్‌ కుమారుడికి, అల్లుడికి మంత్రి పదవులు, కుమార్తెకు ఎంపీ పదవి ఇచ్చారు. కుమార్తె ఎంపీగా పోటీచేసి ఓడిపోతే.. ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. కేసీఆర్‌ బంధువులు వినోద్‌కుమార్‌, విద్యాసాగర్‌రావు, దయాకర్‌రావుకు పదవులు దక్కాయి. నిరుద్యోగుల గోస మాజీ సీఎం కేసీఆర్‌ తగిలింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించిన రోజు నాకు కంటినిండా నిద్ర పట్టింది.

ఇందిరమ్మ రాజ్యంలో.. ప్రజాపాలన

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడింది. ఆ రాజ్యంలోనే ప్రస్తుతం ప్రజాపాలన సాగుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఆరు గ్యారంటీల్లోని హామీల్లో అయిదింటిని అమలు చేశాం. మిగిలిన వాటి అమలుకు కట్టుబడి ఉన్నాం. నిరుపేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే రూ.22,500 కోట్ల వ్యయంతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశాం. భారాస ప్రభుత్వంలో నిరుపేదలకు రెండు పడకగదుల ఇళ్లు నిర్మిస్తామంటూ కేసీఆర్‌ మాయమాటలు చెప్పారు. సమైక్య రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇచ్చింది. వాటిని ఇవేం ఇళ్లంటూ ఎద్దేవా చేసిన కేసీఆర్‌.. నిరుపేదలకు రెండు పడకగదుల ఇళ్లు నిర్మిస్తామనే హామీని తుంగలో తొక్కారు’’ అని రేవంత్‌రెడ్డి విమర్శించారు. కార్యక్రమంలో వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ, ఎమ్మెల్యేలు సంజీవరెడ్డి, మదన్‌మోహన్‌రావు, లక్ష్మీకాంతారావు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ, మాజీ మంత్రులు మండవ వెంకటేశ్వరరావు, చంద్రశేఖర్‌, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌ చౌధరి, ఎంపీ అభ్యర్థి సురేష్‌ షెట్కార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img