icon icon icon
icon icon icon

ప్రధాన పార్టీల నుంచి మహిళా అభ్యర్థులు ఆరుగురే...

లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి మహిళా అభ్యర్థుల సంఖ్య నామమాత్రంగానే ఉంటోంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, భాజపా, భారాసలు రాష్ట్రంలోని మొత్తం 17 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.

Published : 27 Apr 2024 04:43 IST

కాంగ్రెస్‌ నుంచి ముగ్గురు, భాజపా నుంచి ఇద్దరు, భారాస నుంచి ఒకరు
2014, 2019లలో లోక్‌సభలో అడుగుపెట్టింది ఒక్కొక్కరే

ఈనాడు, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి మహిళా అభ్యర్థుల సంఖ్య నామమాత్రంగానే ఉంటోంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, భాజపా, భారాసలు రాష్ట్రంలోని మొత్తం 17 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. మూడు పార్టీల నుంచి 51 మంది అభ్యర్థులు బరిలో ఉంటే.. వీరిలో టికెట్లు పొందిన మహిళలు ఆరుగురు. అంటే సుమారు 12 శాతమే. ఈ ఆరుగురిలో.. కాంగ్రెస్‌ పార్టీ ముగ్గురు మహిళలకు టికెట్లు ఇవ్వగా, భాజపా ఇద్దరికి, భారాస ఒకరికి అవకాశం కల్పించాయి. కాంగ్రెస్‌ నుంచి- మల్కాజిగిరిలో పట్నం సునీత మహేందర్‌రెడ్డి, వరంగల్‌లో కడియం కావ్య, ఆదిలాబాద్‌లో ఆత్రం సుగుణ; భాజపా నుంచి- మహబూబ్‌నగర్‌లో డీకే అరుణ, హైదరాబాద్‌లో కొంపెల్ల మాధవీలత; భారాస నుంచి- మహబూబాబాద్‌లో మాలోత్‌ కవిత లోక్‌సభ ఎన్నికల బరిలో ఉన్నారు. ఆయా స్థానాల్లో ఇతర ప్రధాన పార్టీల నుంచి పురుషులు పోటీ చేస్తున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో, ఆ తర్వాత 2019లో తెలంగాణ నుంచి ఒక్కో మహిళ మాత్రమే ఎంపీగా విజయం సాధించారు. అంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి లోక్‌సభ గడప తొక్కింది ఇద్దరే. 2014లో నిజామాబాద్‌ నుంచి కల్వకుంట్ల కవిత (భారాస) విజయం సాధించారు. 2019లో అదే స్థానం నుంచి బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో గెలిచిన ఏకైక మహిళా ఎంపీ మాలోత్‌ కవిత. మహబూబాబాద్‌ నుంచి భారాస అభ్యర్థిగా ఆమె గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ఆమె అదే స్థానం నుంచి పోటీలో ఉన్నారు.

2014లో 12 మంది.. 2019లో 25 మంది

2014 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి చూస్తే.. కల్వకుంట్ల కవిత మాత్రమే పోటీచేశారు. మొత్తం మహిళా అభ్యర్థులు 12 మంది ఉన్నప్పటికీ, మిగిలిన వాళ్లు బీఎస్పీ, ఇండిపెండెంట్‌ అభ్యర్థులు 2019కి వచ్చేసరికి ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసిన మహిళా అభ్యర్థుల సంఖ్య కొద్దిగా పెరిగింది. భారాస నుంచి- కల్వకుంట్ల కవిత (నిజామాబాద్‌), మాలోత్‌ కవిత (మహబూబాబాద్‌), కాంగ్రెస్‌ నుంచి- రేణుకాచౌదరి (ఖమ్మం), భాజపా నుంచి- డీకే అరుణ (మహబూబ్‌నగర్‌), బంగారు శ్రుతి (నాగర్‌కర్నూల్‌) పోటీ చేశారు. ఇతర పార్టీల వారిని, ఇండిపెండెంట్లను కూడా పరిగణనలోకి తీసుకుంటే పోటీచేసిన మొత్తం మహిళల సంఖ్య 25.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img