icon icon icon
icon icon icon

267 మంది నామినేషన్ల తిరస్కరణ

రాష్ట్రంలోని లోక్‌సభ నియోజకవర్గాలకు దాఖలైన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం పూర్తయింది.

Published : 27 Apr 2024 05:06 IST

అత్యధికంగా మల్కాజిగిరిలో 77..
మంద జగన్నాథం, బాబూమోహన్‌లకు ఖేదం
నామినేషన్ల పరిశీలన పూర్తి.. 626 మందివి ఆమోదం

ఈనాడు, హైదరాబాద్‌- ఈటీవీ, ఆదిలాబాద్‌, వరంగల్‌ కలెక్టరేట్‌, నాగర్‌కర్నూల్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని లోక్‌సభ నియోజకవర్గాలకు దాఖలైన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. మొత్తం 17 స్థానాలకు 893 మంది నామినేషన్లు వేయగా 267 మంది అభ్యర్థుల పత్రాలను తిరస్కరించిన అధికారులు 626 మందివి నిబంధనల మేరకు ఉన్నట్లు ప్రకటించారు. నామినేషన్ల దాఖలు గడువు గురువారంతో ముగిసిన విషయం తెలిసిందే. అభ్యర్థులు, వారి ప్రతినిధుల సమక్షంలో అధికారులు చేపట్టిన పరిశీలన కొన్ని నియోజకవర్గాల్లో పొద్దుపోయేంత వరకు సాగింది. నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ప్రస్తుత ఎంపీ రాములు నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. ఈ ఎన్నికల్లో ఆయన కుమారుడికి భాజపా టికెట్‌ ఇవ్వడంతో రాములు డమ్మీ అభ్యర్థిగా వేశారు. బీఫాం లేకపోవడంతో తిరస్కరించారు. అదే నియోజకవర్గంలో మాజీ ఎంపీ మందా జగన్నాథం నామినేషన్‌ సైతం తిరస్కరణకు గురైంది. ఆయన బీఎస్పీ నుంచి వేసినా బీఫాం సమర్పించకపోవడంతో తిరస్కరించారు. అక్కడ మరో అభ్యర్థి బీఎస్పీ బీఫాంను సమర్పించారు. వరంగల్‌ స్థానానికి మాజీ మంత్రి, సినీనటుడు బాబూమోహన్‌ స్వతంత్ర అభ్యర్థిగా దాఖలు చేసిన పత్రాలను తిరస్కరించారు. 10 మంది ప్రతిపాదకుల పేర్లు ప్రస్తావించినప్పటికీ అందులో ఎవరూ సంతకాలు చేయకపోవడం.. అఫిడవిట్‌లో నిర్దిష్ట ఖాళీలు ఉన్నాయని ఆర్వో ప్రావీణ్య తెలిపారు.

ఆదిలాబాద్‌ భాజపా అభ్యర్థి అఫిడవిట్‌పై అభ్యంతరాలు

ఆదిలాబాద్‌ నుంచి భాజపా అభ్యర్థిగా బరిలో నిలిచిన గోడం నగేష్‌ దాఖలు చేసిన అఫిడవిట్‌పై పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆయన నామినేషన్‌ పత్రాల్లోని కొన్ని అంశాలను ఖాళీగా వదిలేశారని, ఆ కారణంగా తిరస్కరించాలని కాంగ్రెస్‌, బహుజన్‌ సమాజ్‌పార్టీ, భారాస నేతలు డిమాండ్‌ చేయటంతోపాటు ఫిర్యాదులు ఇచ్చేందుకు ప్రయత్నించారు. అధికారులు ఫిర్యాదు స్వీకరించేందుకు అనుమతించలేదు. నగేష్‌ నామినేషన్‌ను ఆమోదించినట్లు ఆర్వో ప్రకటించారు. ఆర్‌వో వ్యవహారశైలిపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని, నగేష్‌ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని బీఎస్పీ ఎంపీ అభ్యర్థి జంగుబాపుతోపాటు కాంగ్రెస్‌, భారాస నేతలు డిమాండ్‌ చేశారు. పరిశీలన పూర్తి కావటంతో ఉపసంహరణకు సోమవారం వరకు గడువు ఉంది.

అత్యల్పంగా మెదక్‌లో..

తిరస్కరణకు గురైన వాటిలో అత్యధికంగా మల్కాజిగిరిలో 77 ఉన్నాయి. ఆ తర్వాత నల్గొండ 25, కరీంనగర్‌ 20, హైదరాబాద్‌ 19, చేవెళ్ల 17, పెద్దపల్లి, జహీరాబాద్‌లలో 14 చొప్పున, నాగర్‌కర్నూల్‌ 13, సికింద్రాబాద్‌ 11, నిజామాబాద్‌, భువనగిరి, వరంగల్‌, ఆదిలాబాద్‌లలో పది చొప్పున, మహబూబ్‌నగర్‌లో ఏడు, మహబూబాబాద్‌లో అయిదు, ఖమ్మంలో నలుగురు, మెదక్‌లో ఒకరి నామినేషన్‌ తిరస్కరించారు.

6,366 కేసులు నమోదు

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అతిక్రమించిన ఫిర్యాదులపై 6,366 కేసులు నమోదు చేసినట్లు తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అత్యధికంగా మద్యానికి సంబంధించినవి 5,967 ఉన్నాయని.. మాదక ద్రవ్యాలు, ఐపీసీ కింద, ప్రజాప్రాతినిధ్య చట్టం కింద మిగిలిన కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img