icon icon icon
icon icon icon

గ్యారంటీలు అమలు చేసినట్లు నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకొంటా

రుణమాఫీపై సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటూ ఆరు గ్యారంటీలపై చర్చ జరగకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకు భారాస, కాంగ్రెస్‌ నేతలు డ్రామాలాడుతున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ మండిపడ్డారు.

Published : 28 Apr 2024 04:00 IST

లేకపోతే కాంగ్రెస్‌ అభ్యర్థులు వైదొలుగుతారా?
భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌
రుణమాఫీపై భారాస, కాంగ్రెస్‌ నేతలు డ్రామాలాడుతున్నారని విమర్శ

తెలంగాణ చౌక్‌ (కరీంనగర్‌), బోయినపల్లి - న్యూస్‌టుడే: రుణమాఫీపై సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటూ ఆరు గ్యారంటీలపై చర్చ జరగకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకు భారాస, కాంగ్రెస్‌ నేతలు డ్రామాలాడుతున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల కోడ్‌ ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కరీంనగర్‌ ఎంపీ కార్యాలయంలో కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్‌ సోదరుడు కోడూరి మహేందర్‌ గౌడ్‌, పలువురు తెలంగాణ ఉద్యమకారులు తమ అనుచరులతో బండి సంజయ్‌ సమక్షంలో శనివారం భాజపాలో చేరారు. ఈ సందర్భంగా విలేకరులతోను, రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో శనివారం నిర్వహించిన పార్టీ సమావేశంలోనూ ఆయన మాట్లాడారు. ‘‘వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలుచేస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్‌ నేతలు మాట తప్పారు. అయినా వాటిని అమలు చేసినట్లు అబద్ధాలు చెబుతున్నారు. మహిళలకు నెలకు రూ.2,500, ఆసరా పింఛన్‌ రూ.4 వేలు, ఇల్లు లేని పేదలకు స్థలం, రూ.5 లక్షలు; రుణమాఫీ, రైతు భరోసా కింద రైతులకు, కౌలు రైతులకు రూ.15 వేలు తదితర హామీలు అమలు చేశారా? వాటిని అమలు చేసినట్లు నామినేషన్ల ఉపసంహరణ గడువులోపు ఆధారాలతో నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకొంటా.. అవసరమైతే కాంగ్రెస్‌ అభ్యర్థి పక్షాన ప్రచారం కూడా చేస్తా. నిరూపించకపోతే 17 మంది కాంగ్రెస్‌ అభ్యర్థులు ఎన్నికల బరి నుంచి తప్పుకోవడానికి సిద్ధమా? తేదీ, సమయం, వేదిక నిర్ణయిస్తే వచ్చేందుకు నేను సిద్ధం’’ అని పేర్కొన్నారు. దేశంలోని అన్ని మతాలు, వర్గాలను సమానంగా చూడాలన్నదే భాజపా విధానమని, కానీ భాజపా ఏది మాట్లాడినా మతతత్వమని ముద్ర వేయడం.. రాములవారి అక్షింతలు, ప్రసాదం పంచడాన్ని రాజకీయం చేయడం తగదని అన్నారు. రాముడి అక్షింతలను కేసీఆర్‌ అవహేళన చేశారని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల్లో 400 ఎంపీ సీట్లు సాధించి మోదీ మరోసారి ప్రధాని కాబోతున్నారని ఈ సందర్భంగా అన్నారు.

‘కేసీఆర్‌’ నాణేనికి భారాస, కాంగ్రెస్‌ అభ్యర్థులు బొమ్మాబొరుసు..

కేసీఆర్‌ అనే నాణేనికి భారాస, కాంగ్రెస్‌ అభ్యర్థులు బొమ్మాబొరుసుల్లాంటి వారని సంజయ్‌ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ పార్టీ రూ.వందల కోట్లు ఖర్చుపెడుతోందని ఆరోపించారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ తాను అనని మాటలను అన్నట్లు చిత్రీకరించి లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నారని.. మంత్రి దూషణలనూ దీవెనలుగా భావిస్తున్నట్లు చెప్పారు. కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానంటున్న పొన్నం ప్రభాకర్‌కు గత ఎన్నికల్లో డిపాజిట్‌ రాలేదన్నారు. భారాస అభ్యర్థి, మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ నియోజకవర్గ అభివృద్ధి కోసం కేంద్రానికి తాను లేఖలు రాశానని చెప్పుకొంటున్నారని.. నిర్వాసితుల సమస్యలు, ఆర్వోబీకి అనుమతి; వేములవాడ, కొండగట్టు ఆలయాలకు ప్రసాద్‌ పథకం కోసం, వడగళ్ల వానతో నష్టపోయిన రైతులకు రూ.10 వేలు పరిహారానికి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎందుకు లేఖలు రాయలేదని ప్రశ్నించారు. ఆర్వోబీకి సేతుబంధు పథకంలో రూ.154 కోట్లు తెచ్చినట్లు చెప్పారు. వందశాతం పోలింగ్‌ జరిగే విధంగా చూడాలని.. భాజపాకు మెజార్టీ ఓట్లు వస్తే పార్టీ పోలింగ్‌ బూత్‌ అధ్యక్షులను సన్మానిస్తామన్నారు. అనంతరం వివిధ గ్రామాలకు చెందిన పలువురు యువకులు పార్టీలో చేరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img