icon icon icon
icon icon icon

భారాసకు ఒక్క సీటూ రాదు

లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో భారాస ఒక్క ఎంపీ సీటును కూడా గెలవలేదని పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.

Updated : 28 Apr 2024 04:23 IST

రెండుచోట్ల రెండో స్థానం.. మిగిలిన వాటిల్లో మూడో స్థానమే
ఎంఐఎంతో భాజపా అవగాహన.. అందుకే హైదరాబాద్‌లో హిందూ అభ్యర్థి
మే మొదటి వారంలో రాహుల్‌ సహా అగ్రనేతల పర్యటన
ఎన్‌డీఎస్‌ఏ నివేదిక ఆధారంగానే కాళేశ్వరం పనులు
మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో భారాస ఒక్క ఎంపీ సీటును కూడా గెలవలేదని పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ‘‘తాజా సర్వేల్లో మెదక్‌లోనూ మూడో స్థానంలో ఉంది. సికింద్రాబాద్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి కచ్చితంగా గెలుస్తారు. 2004 ఫలితాలే పునరావృతమవుతాయి. ఖమ్మం, నల్గొండలలో మాత్రమే భారాస రెండో స్థానంలో ఉంది. మిగిలిన అన్నిచోట్ల మూడో స్థానానికే పరిమితమవుతుంది. రాష్ట్రంలో భారాసకు 100కి పైగా ఎమ్మెల్యే సీట్లు వస్తాయని గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ పదే పదే చెప్పారు. ఫలితం ఏమైందో చూశారు. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లోనూ అలాగే చెప్పుకొంటున్నారు. ఫలితాలెలా ఉంటాయో మీరే చూస్తారు. అమేఠీ నుంచి రాహుల్‌ గాంధీ పోటీ చేస్తారు. ప్రియాంక పోటీపై ఇంకా స్పష్టత రాలేదు. వచ్చే నెల మొదటి వారంలో రాహుల్‌, ప్రియాంక, ఖర్గే వంటి అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటిస్తారు. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని అధిష్ఠానం నిర్ణయిస్తే వెళ్తాను’’ అని రేవంత్‌రెడ్డి చెప్పారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో శనివారం మీడియాతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.

మతాన్ని నమ్ముకొని భాజపా రాజకీయం

‘‘భాజపా ముందు నుంచీ మతాన్ని నమ్ముకుని రాజకీయం చేస్తోంది. ఇప్పుడు పతాకస్థాయికి చేరుకుంది. మూలాలపైనే దాడి చేస్తోంది. హైదరాబాద్‌ టికెట్‌ను కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడికి ఇచ్చాం. భాజపాకు ఎంఐఎంతో అవగాహన లేకపోతే.. హైదరాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా హిందూ అభ్యర్థిని ఎలా నిలబెట్టింది? ‘ఒక్క ముస్లిం కూడా మాకు ఓటేయొద్దు.. మొత్తం ముస్లిం ఓట్లన్నీ అసదుద్దీన్‌ ఒవైసీకే వేయాలి’ అన్న ఉద్దేశంతోనే హిందూ అభ్యర్థిని పెట్టారు. నిజంగానే ఎంఐఎంను ఓడించాలనుకుంటే.. అక్కడ ముస్లిం అభ్యర్థిని భాజపా నిలబెట్టాలి. హిందూ ఓట్లన్నీ ఒకవేళ భాజపాకే పడతాయని అనుకున్నా.. ముస్లిం ఓట్లలో విభజన జరిగి.. ఆ ఓట్లు, ఈ ఓట్లు తోడైతే.. అసదుద్దీన్‌ ఓడిపోవడానికి అవకాశాలుండేవి. ఎంఐఎం అభ్యర్థిని ఓడించాలన్న వ్యూహమే భాజపాకు లేదు.

అసభ్య భాషకు ఆద్యుడు కేసీఆరే

భారత్‌ సమాఖ్య దేశం. ముఖ్యమంత్రులందరికీ ప్రధాని పెద్దన్న లాంటివారే. నేను మోదీని బడే భాయ్‌ అన్నది కాంగ్రెస్‌ పార్టీ వేదికపై నుంచి కాదు. ప్రభుత్వ కార్యక్రమంలో అన్నాను. ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి ఉన్న సంబంధం నేపథ్యంలో అన్నాను. అసభ్య భాషకు ఆద్యుడే కేసీఆర్‌. నల్గొండ, సిరిసిల్ల సమావేశాల్లో ఆయన ఎలాంటి భాష మాట్లాడారో ప్రజలు వినలేదా? ఒకసారి ఆయన భాషను ఆయనకే వినిపించాలి. రైతు ఆత్మహత్యలపైనా భారాస రాజకీయం చేస్తోంది. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తోంది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే సుపరిపాలన అందించాం. ఇచ్చిన హామీలను అమలు చేశాం. నాలుగు నెలల్లో రూ.27 వేల కోట్లు అప్పులకు వడ్డీ కింద కట్టాం. ధనిక రాష్ట్రమంటూ అందర్నీ కేసీఆర్‌ మభ్యపెట్టారు. అందుకే మేము రాగానే విద్యుత్‌, నీరు, ఆర్థికంపై శ్వేతపత్రాలు విడుదల చేశాం. అసెంబ్లీలో చర్చించడానికి భారాసకు అవకాశమిచ్చాం. చెప్పడానికి ఏమీ లేక కేసీఆర్‌ అసెంబ్లీకి రాకుండా తప్పించుకున్నారు.

2021లోనే కాళేశ్వరంలో లోపాల గుర్తింపు

కాళేశ్వరంపై జాతీయ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ(ఎన్‌డీఎస్‌ఏ) అధ్యయనం చేస్తోంది. ఎన్‌డీఎస్‌ఏ ఇచ్చే నివేదిక ఆధారంగా ముందుకెళ్తాం. స్ట్రక్చరల్‌ ఇంజినీర్లు చేయాల్సిన పనిని కేసీఆర్‌ చేస్తే.. కాళేశ్వరం నడుము విరిగింది. ఆయన చేసింది కాకుండా.. మమ్మల్ని కూడా అలాగే చేయమంటున్నారు. 2021లోనే కాళేశ్వరంలో లోపాలు గుర్తించినట్లు అధికారికంగా సంబంధిత నిర్మాణ సంస్థకు అధికారులు లేఖ రాశారు. దాన్ని కేసీఆర్‌ బయటకు రానీయకుండా తొక్కిపెట్టారు. ఆ తర్వాత రెండున్నరేళ్లు కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో మరమ్మతులు చేసి ఉండొచ్చు కదా! అక్టోబరు 2023న లోపాలు బయటపడినప్పుడు.. డిసెంబరు 3 వరకూ ఆయనే సీఎంగా ఉన్నారు కదా! అప్పుడెందుకు పనులు చేయలేదు? నీళ్లు మొత్తం ఎందుకు వదిలేశారు? ఏయే మరమ్మతులు చేయాలనేది ఎన్‌డీఎస్‌ఏ చెప్పాలి. తుమ్మిడిహెట్టి నిర్మాణంపై మహారాష్ట్రతో చర్చలు జరుగుతున్నాయి. భూసేకరణ తర్వాత ప్రారంభిస్తాం. గత ఏడాది ఇవే తేదీల్లో విద్యుత్‌, నీటి సరఫరా వివరాలు తీసుకోండి. ఇప్పటి వివరాలు తీసుకోండి. గత సంవత్సరం కంటే 50 శాతం అదనంగా విద్యుత్‌, నీటి సరఫరా అందిస్తున్నాం. అయినా సరిపోవడం లేదు. కారణం.. రిజర్వాయర్లలో నీళ్లు ఇంకిపోయాయి. భూగర్భ జలాలు అడుగంటాయి. వందల సంఖ్యలో బోర్లు ఎండిపోయాయి. నల్లా నీటిపైనే ఆధారపడాల్సి వస్తోంది. అందుబాటులో ఉన్న ప్రతి చుక్కను ఒడిసిపట్టి.. జాగ్రత్తగా వినియోగించుకుంటున్నాం. ఇది కేసీఆర్‌ తెచ్చిన కరవు’’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img