icon icon icon
icon icon icon

సర్కారు గర్వం దించాలి

‘నాడు అందరి అండదండలతో 15 ఏళ్లు పోరాటం చేసి తెలంగాణ తెచ్చాం. చావుకు కూడా తెగించి దీక్ష చేసి రాష్ట్రాన్ని సాధించా. ముఖ్యమంత్రి సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు.

Published : 28 Apr 2024 04:02 IST

తెలంగాణ భగ్గుమంటోంది.. ధర్మాన్ని గెలిపించండి
బోర్లు ఎండుతున్నాయ్‌.. ట్యాంకర్లు వస్తున్నాయ్‌..
నాగర్‌కర్నూల్‌ సభలో భారాస అధినేత కేసీఆర్‌

ఈనాడు, మహబూబ్‌నగర్‌: ‘నాడు అందరి అండదండలతో 15 ఏళ్లు పోరాటం చేసి తెలంగాణ తెచ్చాం. చావుకు కూడా తెగించి దీక్ష చేసి రాష్ట్రాన్ని సాధించా. ముఖ్యమంత్రి సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు. తెలంగాణకు మంచినీళ్లు, కరెంటు, సాగునీటి కోసం తపించిన వ్యక్తిని. నన్ను పట్టుకుని ఇన్ని మాటలు అనొచ్చా. న్యాయం, ధర్మం చెప్పండి. ఎవరికి కర్రు కాల్చి వాతలు పెట్టాలో.. ఎవరిని అందలం ఎక్కించాలో నిర్ణయించేది మీరు. ధర్మాన్ని, భారాసను గెలిపించండి’ అని ఆ పార్టీ అధినేత, కేసీఆర్‌ ప్రజలను కోరారు. ‘పోరుబాట బస్సుయాత్ర’లో భాగంగా శనివారం నాగర్‌కర్నూల్‌లోని ఉయ్యాలవాడ నుంచి బస్టాండ్‌ వరకు రోడ్‌షో నిర్వహించారు. బస్టాండ్‌ వద్ద కూడలి సమావేశంలో కేసీఆర్‌ మాట్లాడారు. ‘నేను నమ్మకంగా చెబుతున్నా. మీకు అనుమానం అవసరం లేదు. తెలంగాణ భగ్గుమంటోంది. ఎక్కడికి వెళ్లినా నా బస్సును కదలనివ్వడంలేదు. ఊరూరా పూలు చల్లుతున్నారు. గుమ్మడికాయలు కొడుతున్నారు. గంట, అరగంట ఆలస్యంగా ప్రయాణం సాగుతోంది. ప్రజలు మారిపోయారు. భారాసకు మద్దతు ఇస్తున్నారు. వారికి అర్థమైపోయింది. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఒక చురక పెట్టాలి. వాళ్ల గర్వం దించాలి. మళ్లీ మన ప్రభుత్వం వస్తుంది. బ్రహ్మాండంగా పాలమూరు పథకం పూర్తి చేసుకుందాం’ అని అన్నారు.

పిడికెడు మందితో ప్రారంభమై..

‘ఈ రోజు చాలా గొప్పది. తెలంగాణ పోరాటానికి  శ్రీకారం చుట్టిన రోజు. తెలంగాణ సాధించాలని 23 ఏళ్ల క్రితం పిడికెడు మందితో, గుండె ధైర్యంతో.. ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణ బయటపడితే తప్ప బాగుపడదనే ఉద్దేశంతో, ఉక్కు సంకల్పంతో ఉద్యమం ప్రారంభించిన రోజు. అలా మొదలై.. మహాసముద్రం అయ్యాం. ఉప్పెనలాగా పెరిగాం. చాలాసార్లు నాగర్‌కర్నూల్‌ వచ్చాను. ఉద్యమం పూర్తయ్యే సమయంలో కేసీఆర్‌ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడోనని ఆమరణ దీక్ష చేపడితే, నన్ను ఖమ్మం జైల్లో వేశారు. మీరంతా ఉప్పెనలా విజృంభించారు. అది గుర్తు చేసుకుంటే బ్రహ్మాండమైన సన్నివేశం. చివరకు కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం. అలా పోరాడి సాధించిన తెలంగాణ నా గుండెల్లో  ఎప్పుడూ ఉంటుంది.

కేవలం 1.50 శాతం ఓట్లతోనే..

కాంగ్రెస్‌ అడ్డగోలు హామీలిచ్చి, దుష్ప్రచారాలు చేసి కేవలం 1.50 శాతం ఓట్ల తేడాతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఎన్ని మాటలు చెప్పారు.. ఒక్క హామీనైనా నెరవేర్చారా? ప్రజల మధ్య నిలుచుని.. ముఖ్యమంత్రికి ప్రజల మాటగా చెబుతున్నా. గ్యారంటీ పథకాలు అమలయ్యాయా? రైతులు పండించిన ధాన్యాన్ని కొనే దిక్కులేదు. వానలు వచ్చి ధాన్యం తడిసిపోతోంది. భారాస ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే 24 గంటల విద్యుత్తు ఇచ్చాం. రెప్పపాటు కాలం కూడా కరెంటు పోలేదు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌ రాజ్యంలో కరెంటు పోతోంది. రైతులు రాత్రి పూట బావుల వద్దకు వెళ్తున్నారు. మళ్లీ తేళ్లు, పాములు కుడుతున్నాయి. ఇప్పటి వరకు 250 మంది రైతులు చనిపోయారు. కొందరు ఆత్మహత్య చేసుకున్నారు. కొందరు విద్యుదాఘాతానికి బలయ్యారు. ఈ బాధ ఎందుకు వచ్చింది? ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. కేసీఆర్‌ పెట్టిందే కదా.. ఉన్నదే కదా.. కొత్తగా గడ్డపార పెట్టి తవ్విందే లేదు. నేను ఇచ్చిన కరెంటును వారు కూడా యథావిధిగా ఇవ్వొచ్చు కదా. సీఎం, మంత్రులు.. 24 గంటల కరెంటు ఇస్తున్నామని చెబుతున్నారు. కరెంటు చక్కగా వస్తుందా? రోజుకు 10 సార్లు పోతోంది. ఇదీ రాష్ట్రంలో పరిపాలన.

మిషన్‌ భగీరథ పెట్టి ప్రతి ఇంటికీ నల్లా ఇచ్చుకున్నాం. పట్టణాల్లో రూపాయికే కనెక్షన్‌ ఇచ్చి ఉచితంగా మంచినీటిని సరఫరా చేశాం. ఇప్పుడు అది అమలవుతోందా? మళ్లీ బోర్లు ఎండిపోతున్నాయి. నీళ్ల ట్యాంకర్లు వస్తున్నాయి. బిందెలు మోస్తున్నాం. ముఖ్యమంత్రి కొత్తగా ఇవ్వకపోయినా.. ఉన్న పథకాలైనా నడిపించొచ్చు కదా. తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్‌కు పంచాయితీ పడింది. జనం తరఫున కొట్లాడేది ఎవరు? కేసీఆరే కదా. యుద్ధం చేద్దామా? మీరు మద్దతు ఇవ్వండి’ అని విజ్ఞప్తి చేశారు. నాగర్‌కర్నూల్‌ భారాస అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ రాష్ట్రంలో గురుకులాల అభివృద్ధికి కృషి చేశారని కేసీఆర్‌ ప్రశంసించారు. ఆయన ఆధ్వర్యంలో ఎందరో పేద విద్యార్థులు ఎవరెస్టును, ఉద్యోగాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించారన్నారు. ప్రవీణ్‌కుమార్‌ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, నాగం జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కృష్ణమోహన్‌రెడ్డి, విజయుడు, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, హర్షవర్ధన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img