icon icon icon
icon icon icon

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలపై భాజపా సర్జికల్‌ స్ట్రైక్స్‌

రిజర్వేషన్లను తొలగించడంతోపాటు దేశాన్ని రాజ్యాంగరహితం చేసేందుకు భాజపా కుట్ర పన్నుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

Published : 28 Apr 2024 04:03 IST

2025 నాటికి రిజర్వేషన్‌ రహిత దేశంగా మార్చేందుకు కుట్ర
ఆర్‌ఎస్‌ఎస్‌ ఎజెండా అమలుకు మోదీ, అమిత్‌షా యత్నాలు
రిజర్వేషన్ల వ్యవహారంపై భారాస వైఖరేంటో వెల్లడించాలి
పెద్దమ్మ సాక్షిగా ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: రిజర్వేషన్లను తొలగించడంతోపాటు దేశాన్ని రాజ్యాంగరహితం చేసేందుకు భాజపా కుట్ర పన్నుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఎజెండా అమలు కోసం 2025 నాటికల్లా రిజర్వేషన్లను సమూలంగా రద్దు చేసేందుకు మోదీ-అమిత్‌షా ద్వయం ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంపై భారాస వైఖరేంటో కేసీఆర్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఉండాలనుకుంటే కాంగ్రెస్‌ను గెలిపించాలని.. రద్దు కావాలనుకుంటే భాజపాకు ఓటేయాలని ప్రజలకు సూచించారు. జూబ్లీహిల్స్‌ పెద్దమ్మతల్లి సాక్షిగా ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఆ విషయంలో తమ లెక్కలు తమకున్నాయన్నారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘‘ప్రస్తుత ఎన్నికల్లో ఏదోరకంగా 400 సీట్లు సాధించి రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలపైనే దాడి చేయాలని మోదీ, అమిత్‌షా దేశం నలుమూలలా తిరుగుతున్నారు. 1925లో ఆర్‌ఎస్‌ఎస్‌ను ప్రారంభించినప్పుడు భారత్‌ను రిజర్వేషన్లు లేని హిందూ దేశంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ వందేళ్ల లక్ష్యసాధనలో భాగంగానే 2025లో రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలని, సంఘ్‌ భావజాలం ప్రకారం సవరించాలనే మోదీ, అమిత్‌షాలు ఆలోచిస్తున్నారు. వారికి అదానీ, అంబానీ తోడయ్యారు. రాజ్యాంగాన్ని మార్చాలంటే మూడింట రెండొంతుల మెజారిటీ ఉండాలన్న ఉద్దేశంతోనే ‘అబ్‌కీ బార్‌ 400 పార్‌’ అంటున్నారు. రిజర్వేషన్‌ రహితంగా మార్చేందుకు దేశ మూలవాసులైన దళితులు, గిరిజనులు, ఓబీసీలపై సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేస్తున్నారు. కులాలు, ఉపకులాలుంటే మొత్తాన్ని హిందూ సమాజంగా చూపడం ఇబ్బందవుతుందని ఆర్‌ఎస్‌ఎస్‌ ఈ ప్రణాళికను సిద్ధం చేసింది. ట్రిపుల్‌ తలాక్‌, ఆర్టికల్‌ 370 రద్దు, యూనిఫాం సివిల్‌ కోడ్‌, సీఏఏ.. ఇలాంటి ఆర్‌ఎస్‌ఎస్‌ విధానాలనే భాజపా పదేళ్లుగా అమలు చేస్తోంది. రిజర్వేషన్లను రద్దు చేసి దళితులు, గిరిజనులు, బీసీలను కార్పొరేట్‌ కంపెనీల ఎదుట కట్టుబానిసలుగా నిలబెట్టే కుట్ర చేస్తున్నారు. బీసీ జనగణన చారిత్రక అవసరం. బీసీల జనాభాను లెక్కించినప్పుడు మాత్రమే రిజర్వేషన్లను 27% నుంచి పెంచడానికి అవకాశముంటుంది. దాన్ని దృష్టిలో ఉంచుకునే కుల గణనకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తుంటే.. దీనివల్ల తమ రిజర్వేషన్లరద్దు విధానానికి విఘాతం కలుగుతుందని భాజపా కుట్ర పన్నుతోంది. ఈ విషయంలో కిషన్‌రెడ్డి, సంజయ్‌, ఈటల ఎందుకు మాట్లాడటం లేదు? రిజర్వేషన్లు రద్దు చేయబోమని మోదీ, అమిత్‌షాతో చెప్పిస్తామని ఎందుకు అనడం లేదు? నిన్నగాక మొన్న సిద్దిపేటకు వచ్చిన అమిత్‌షాలతో ఎందుకు చెప్పించలేకపోయారు?

భాజపాపై భారాస పోరాట కార్యాచరణ ఏమిటి?

కేసీఆర్‌ అమలాపురం నుంచి అమెరికా దాకా.. చంద్రమండలం నుంచి చింతమడక వరకు మాట్లాడుతున్నారు. భాజపా కుట్ర గురించి మాత్రం మాట్లాడటం లేదు. ఆ పార్టీ విధానాల్ని ప్రశ్నించడం లేదు. గతంలో రాజ్యాంగాన్ని మార్చి కొత్తది రాసుకోవాలని కేసీఆర్‌ అన్నది ఆర్‌ఎస్‌ఎస్‌ విధానమే కదా! జైలులో ఉన్న బిడ్డకు బెయిల్‌ కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీల ప్రయోజనాలను తాకట్టు పెట్టి భాజపాకు సహకరిస్తున్నారా.. లేదా అనేది స్పష్టం చేయాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేయాలంటున్న భాజపా విధానాలపై భారాస వైఖరేంటో కేసీఆర్‌ చెప్పాలి. రిజర్వేషన్ల రద్దు గురించి సిద్దిపేటలోనే అమిత్‌షా మాట్లాడినా కేసీఆర్‌ స్పందించకపోవడాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. ఒకవేళ రద్దును వ్యతిరేకిస్తే భాజపాపై భారాస పోరాట కార్యాచరణ ఏంటో వెల్లడించాలి. అధికారంలోకి వచ్చి వంద రోజులు దాటిన మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని కార్యాచరణ ప్రకటించి కేసీఆర్‌ బస్సు యాత్ర చేస్తున్నారు. పదేళ్లు ప్రజల్ని పీల్చి పిప్పిచేసి రాజ్యాంగాన్నే దెబ్బతీయాలని చూస్తున్న భాజపాపై ఎలాంటి పోరాటం చేస్తారో ఆయన చెప్పాలి. కేంద్రంలో 30 లక్షల ఉద్యోగ ఖాళీలున్నా భర్తీ చేయకపోవడాన్ని ఆయన ఎందుకు ప్రశ్నించడం లేదు? బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎల్‌ఐసీ, రైల్వేలు, పోర్టులు, విమానాశ్రయాలు, జాతీయ రహదారులను కాంగ్రెస్‌ ఏర్పాటు చేస్తే.. మోదీ, అమిత్‌షా తెగనమ్ముకుంటున్నారు. మోదీ ప్రధాని అయినప్పుడు రూ.55 లక్షల కోట్లు ఉన్న అప్పు ఈ రోజు రూ.168 లక్షల కోట్లు అయింది. 67 ఏళ్లలో 13 మంది ప్రధానులు చేసిన అప్పు కంటే రెండింతల్ని మోదీ ఒక్కరే పదేళ్లలో చేశారు. దీని గురించి కేసీఆర్‌ ఒక్కసారైనా మాట్లాడలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు రూ.69 వేల కోట్ల అప్పు ఉంటే.. దాన్ని కేసీఆర్‌ రూ.7 లక్షల కోట్లకు పెంచారు.

భాజపాతో చీకటి ఒప్పందం లేకుంటే మల్లారెడ్డిపై చర్యలేవీ?

మల్కాజిగిరిలో భాజపాను గెలిపిస్తామని మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి చెప్పారు. ఒకవేళ భాజపాతో భారాసకు వైరముంటే మల్లారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలి. ఎలాంటి చర్యలు తీసుకోకపోగా కేటీఆర్‌ సమర్థించడం దేనికి సూచన? ఐదు లోక్‌సభ నియోజకవర్గాలను భాజపాకు భారాస తాకట్టు పెట్టిందని మొదటి నుంచీ చెబుతున్నా. మల్కాజిగిరిలో నేను ఎంపీగా పోటీ చేసినప్పుడు కేటీఆర్‌ 31 సమావేశాలు పెట్టారు. ఇప్పుడు ఒకే ఒక్క సమావేశం పెట్టారు. పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి ఒక్క రూపాయీ ఇచ్చేది లేదని చెప్పారు. అక్కడ ఈటల రాజేందర్‌ను గెలిపించాలన్నదే మీ ఉద్దేశమా? ఈ ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత ఈటలకు వ్యతిరేకంగా కేటీఆర్‌ ఒక్కసారైనా విమర్శలు చేశారా? కేసీఆర్‌ను వ్యతిరేకిస్తూ ఈటల ఎక్కడైనా మాట్లాడారా? భూములు అమ్మకుండా రుణమాఫీ చేయాలని ఈటల అంటున్నారు. కేసీఆర్‌ వేల ఎకరాలను అమ్మినప్పుడు, ఆక్రమించుకున్నప్పుడు రాజేందర్‌ ఏనాడైనా మాట్లాడారా? ప్రజలకు మంచి చేసేందుకు ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తామని మేం చెబుతోంటే.. మమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు. రాజేందర్‌ దేవుడి భూములు ఆక్రమించుకున్నారని విచారణ జరిపించిన కేసీఆర్‌ ఏమీ తేల్చలేకపోయారు. ధరణి ద్వారా భూముల్ని కేసీఆర్‌ దోచుకున్నారని ఆరోపించిన రాజేందర్‌ కేంద్రానికి ఫిర్యాదు చేయలేదు. భాజపాతో చీకటి ఒప్పందం లేకపోతే ఎమ్మెల్యే మల్లారెడ్డిపై తక్షణమే చర్యలు తీసుకోండి. షోకాజ్‌ నోటీస్‌ అయినా ఇవ్వకుండా.. కనీసం వివరణ కూడా అడగకుండా పైకి మాత్రం భాజపాను ఓడిస్తామంటున్నారు.

రుణమాఫీపై నా ప్రణాళిక నాకుంది..

మహబూబ్‌నగర్‌లో భోజనం చేస్తుండగా రెండుసార్లు కరెంటు పోయిందని కేసీఆర్‌ అన్నారు. సూర్యాపేట పార్టీ కార్యాలయంలోనూ కరెంటు పోయిందని అత్యుత్సాహంతో చెప్పారు. నేను విచారణకు ఆదేశిస్తే.. అక్కడ జనరేటర్‌పై సభ ఏర్పాటు చేశారని అధికారులు చెప్పారు. పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి.. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్‌కు ఇంత అసహనం, ఇన్ని అబద్ధాలెందుకు? అధికారం లేకుంటే ఊపిరి ఆగిపోతుందా? అసెంబ్లీలో ప్రజాసమస్యలపై చర్చిద్దామంటే పారిపోయారు. కేటీఆర్‌ మాటలను సీరియస్‌గా తీసుకోను. కేసీఆర్‌ మాట్లాడితే తప్పకుండా స్పందిస్తా. రుణమాఫీపై నా ప్రణాళిక నాకుంది. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ.. భారాసలా దోపిడీ చేయకుండా ఉంటే చాలు సాధ్యమవుతుంది.

దక్షిణాదిలో భాజపాకు 15 సీట్లలోపే..

దక్షిణాదిలో 130 లోక్‌సభ సీట్లున్నాయి. కేరళ, తమిళనాడుల్లో భాజపాకు ఒక్క సీటు కూడా రాదు. ఆంధ్రాలో ఒకటి రావొచ్చు. కర్ణాటకలో 10-12 రావొచ్చు. తెలంగాణలో 2-3 వస్తాయో రావో తెలియదు. దక్షిణాది మొత్తమ్మీద 10-15 సీట్లు మాత్రమే వస్తాయి. ఇండియా కూటమికి 100 కంటే ఎక్కువ సీట్లు వస్తాయి. దేశంలో భాజపాకు 400 సీట్లు వస్తాయని మోదీ అంటున్నారు. ఎక్కడ ఆగుతుందో చూద్దాం.

నివేదిక అందాకే ఫోన్‌ ట్యాపింగ్‌పై మాట్లాడతా..

ఫోన్‌ ట్యాపింగ్‌పై అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. బాధ్యత గల ముఖ్యమంత్రిగా విచారణ పూర్తవకుండా ఎవరిపైనో ఆరోపణలు చేయలేను. అధికారుల నివేదిక అందిన తర్వాతే బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా అన్ని వివరాలు వెల్లడిస్తా’’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img