icon icon icon
icon icon icon

సూటిగా చెప్పండి.. గ్యారంటీలు, రుణమాఫీ అమలు చేస్తారా లేదా?

‘గన్‌పార్కులో అమరవీరుల స్తూపం వద్దకు రాకుండా ముఖ్యమంత్రి ముఖం చాటేశారు. నేను ఇచ్చిన మాట ప్రకారం వచ్చా.

Published : 28 Apr 2024 04:14 IST

రేవంత్‌ రాజీనామా పత్రం పంపితే నేనూ వెంటనే ఇస్తా
రిజర్వేషన్ల విషయంలో భారాసపై సీఎం తప్పుడు ఆరోపణలు
కొత్త జిల్లాలను తొలగిస్తే ప్రజలు ఊరుకుంటారా?
మాజీ మంత్రి హరీశ్‌రావు

ఈనాడు, కరీంనగర్‌- సిద్దిపేట, రాంపూర్‌, న్యూస్‌టుడే: ‘గన్‌పార్కులో అమరవీరుల స్తూపం వద్దకు రాకుండా ముఖ్యమంత్రి ముఖం చాటేశారు. నేను ఇచ్చిన మాట ప్రకారం వచ్చా. దేవుళ్ల మీద ఒట్లు పెట్టి రాజకీయం చేస్తూ ప్రజలను మోసం చేయొద్దు. డొంక తిరుగుడు మాటలూ వద్దు. ఆగస్టు 15లోపు ఆరు గ్యారంటీలు, రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేస్తారా.. చేయరా అనేది సూటిగా చెప్పాలి’ అని రేవంత్‌రెడ్డిని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. రిజర్వేషన్లు ఎత్తివేయడానికి భాజపాకు భారాస సహకరిస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. ఆయనది మతిమరుపా? లేక అతి తెలివి మాటలా? అని ధ్వజమెత్తారు. భారాస ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట శివారు పొన్నాల వద్ద జిల్లా కార్యాలయంలో శనివారం పార్టీ జెండాను ఆవిష్కరణ కార్యక్రమంలో, కరీంనగర్‌లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, లోక్‌సభ అభ్యర్థి వినోద్‌కుమార్‌తో కలిసి ప్రచారం నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘నాడు ఓటుకు నోటు.. నేడు ఓటుకు ఒట్టు నడుస్తోంది. నేను కొత్త డిమాండ్లు పెట్టడం లేదు. ఎన్నికల సమయంలో బాండ్ల మీద మీరు రాసిచ్చిన వాటినే అమలు చేయాలని కోరుతున్నా. రాజీనామా పత్రాన్ని స్పీకర్‌ ఫార్మాట్‌లో ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డికి రేవంత్‌రెడ్డి పంపిస్తే, నేనూ వెంటనే పంపించేందుకు సిద్ధం. భారాస ఎమ్మెల్యేలను రేవంత్‌రెడ్డి టచ్‌ చేయడం, పార్టీలోకి చేర్చుకోవడం మాని ఇచ్చిన ఆరు గ్యారంటీలు.. అందులోని 13 హామీలను టచ్‌ చేయాలి. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నన్ను తిట్టడం కాదు.. హామీలు అమలు చేయాలి. తెలంగాణ సాధించింది కేసీఆర్‌. ఆయన నాయకత్వంలో ప్రజల కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తాం. పార్లమెంట్‌కు ఒక జిల్లా అని రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారు. సిద్దిపేట జిల్లాను కూడా తీసేస్తారు. ప్రజలు ఊరుకుంటారా.. కొత్త జిల్లాలన్నీ దశాబ్దాల కల. కొత్త జిల్లాల ప్రజలు కాంగ్రెస్‌ అభ్యర్థులను చిత్తుగా ఓడించాలి’ అని అన్నారు.

కిషన్‌రెడ్డి వెన్నుచూపితే.. రేవంత్‌ జిరాక్సు కాగితంతో..

‘నాడు ఉద్యమ సమయంలో రాజీనామా చేయమంటే అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వెన్ను చూపి పారిపోయారు. రేవంత్‌రెడ్డి జిరాక్సు కాగితంతో తప్పించుకుని తిరిగారు. నేను మాత్రం తెలంగాణ కోసం రెండుమార్లు ఎమ్మెల్యే, మంత్రి పదవిని త్యజించా. రాష్ట్ర ప్రజలు కోరితే రాజీనామా చేసి ఆమోదించుకున్న చరిత్ర మాది. రేవంత్‌ పదవులు పట్టుకొని పాకులాడారు. ఆంధ్రా నాయకుల అడుగులకు మడుగులు ఒత్తి నిలబడ్డారు. 2001లో ఏప్రిల్‌ 27వ తేదీన హైదరాబాద్‌లోని జలదృశ్యంలో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం రాష్ట్రాన్ని సాధించి దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఈ ఘనత గులాబీ జెండా, కేసీఆర్‌దే. ఆకుపచ్చ, సంక్షేమ తెలంగాణగా మార్చాం. సీఎం రేవంత్‌రెడ్డి భాజపాతో కుమ్మక్కైన విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. రిజర్వేషన్లు పెంచడానికి రాజ్యంగ సవరణ చేయాలని మేము డిమాండ్‌ చేస్తుంటే ఆయన మా పార్టీపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదు. తమిళనాడు తరహాలో రిజర్వేషన్ల పెంపునకు రాష్ట్రాలకు అనుమతివ్వాలని శాసనసభలో తీర్మానం చేసింది భారాస ప్రభుత్వమనే విషయం గుర్తించాలి. కేసీఆర్‌ హయాంలోని మా ప్రభుత్వం అప్పట్లో కేంద్రంపై ఒత్తిడి చేసింది.. మా ఎంపీలు కూడా పార్లమెంటులో పోరాటం చేశారు’ అని హరీశ్‌ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img