icon icon icon
icon icon icon

దేవుళ్ల సాక్షిగా సీఎం మోసం

దేవుళ్ల సాక్షిగా ఒట్లు పెట్టి ప్రజలను మోసం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ ధ్వజమెత్తారు.

Published : 28 Apr 2024 04:15 IST

ఆయన మాట నిలుపుకొన్న చరిత్ర లేదు
కచ్చితంగా రేవంత్‌ భాజపాలో చేరతారు
పార్టీకి ద్రోహం చేసిన నాయకులను ఓడిస్తాం
మీడియాతో ఇష్టాగోష్ఠిలో కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: దేవుళ్ల సాక్షిగా ఒట్లు పెట్టి ప్రజలను మోసం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ ధ్వజమెత్తారు. మాట నిలుపుకొన్న చరిత్ర రేవంత్‌కు లేదని ఆరోపించారు. భారాస ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా శనివారం తెలంగాణ భవన్‌లో తెలంగాణ తల్లి విగ్రహానికి ఆయన పూలమాల వేసి అంజలి ఘటించారు. పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఇష్టాగోష్ఠిలో పలు అంశాలపై మాట్లాడారు. ‘‘రేవంత్‌రెడ్డి గతంలో కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాతా మాట తప్పారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలిచేందుకు ఇప్పుడు ఆపద మొక్కులు మొక్కుతున్నారు. కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం వచ్చే అవకాశమే లేదు. అందుకే దేవుడిపై ఒట్లు పెడుతూ ప్రజలను మోసం చేసే పనిపెట్టుకున్నారు. రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్‌ పార్టీ.. భాజపాకు సహకరించేందుకే చాలా చోట్ల డమ్మీ అభ్యర్థులను పెట్టింది. ఆయన కచ్చితంగా భాజపాలో చేరతారు. ఇప్పటికి 20 సార్లు నేను ఈ మాట అన్నా.. అయినా ఆయన ఎందుకు స్పందించటం లేదు. దమ్ముంటే హరీశ్‌రావు సవాల్‌కు రేవంత్‌రెడ్డి స్పందించాలి’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

ఛోటే భాయ్‌.. బడే భాయ్‌లకు బుద్ధి చెప్పాలి

‘‘కాంగ్రెస్‌ ప్రభుత్వం చెప్పిన పథకాలకు సంబంధించి ఇప్పటివరకూ ఒక్క రూపాయి కూడా లబ్ధిదారుల ఖాతాలోకి చేరలేదు. పంటలపై రూ.500 బోనస్‌, రూ.4 వేల పింఛను, రైతు కూలీలకు రూ.12 వేలు, కౌలు రైతులకు రైతు భరోసా, విద్యార్థినులకు స్కూటీలు, నిరుద్యోగులకు భృతి.. వీటిలో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఈ ప్రభుత్వానికి మైనారిటీలను గౌరవించే సంస్కారం లేదు. కనీసం ఒక మంత్రి పదవి కూడా వాళ్లకు ఇవ్వలేదు. ప్రతి ఇంటికీ నీళ్లు, ప్రతి కుటుంబానికి ఇల్లు, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు, బుల్లెట్‌ రైళ్లు... అంటూ అనేక హామీలిచ్చిన మోదీ.. ఒక్కటి కూడా నెరవేర్చకుండా దేశ ప్రజలను మోసం చేశారు. తెలంగాణ పుట్టుకను మోదీ అవమానించారు. రాష్ట్ర పునర్విభజన హామీలను అమలు చేయకుండా తెలంగాణకు కావాలనే అన్యాయం చేశారు. ఛోటే భాయ్‌ బడా మోసం.. బడే భాయ్‌ బడా మోసం చూశాం. ఇద్దరికీ బుద్ధి చెప్పాల్సిన అవసరముంది. కాంగ్రెస్‌ వచ్చిన నాలుగు నెలల్లోనే తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కరెంటు కోతలు, తాగునీటి కష్టాలు లేని కేసీఆర్‌ పరిపాలనే మళ్లీ కావాలని అనుకుంటున్నారు.

కడియంది ద్రోహం.. మల్లారెడ్డి వ్యాఖ్యల్లో రాజకీయ వ్యూహం

కేసీఆర్‌కు కడియం శ్రీహరి చేసిన ద్రోహం మామూలుది కాదు. ఆయన చర్య వరంగల్‌ ప్రజల మనసులను కూడా బాధించింది. మల్కాజిగిరిలో ఈటల గెలుస్తారని మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వ్యూహంతో చేసినవే. పార్టీకి ద్రోహం చేసి వెళ్లిన నాయకులను ఓడించేందుకు ఎక్కువగా కష్టపడతాం. రేవంత్‌పై అనేక సామాజికవర్గాలు కోపంతో ఉన్నాయి. భాజపాను ఎదుర్కొనే శక్తి లేకనే.. రాహుల్‌గాంధీ ఉత్తర భారతదేశం నుంచి కేరళకు పారిపోయారు’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు. తమకున్న సమాచారం ప్రకారం ఏపీలో జగన్‌మోహన్‌రెడ్డి గెలవబోతున్నారని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img