icon icon icon
icon icon icon

భాజపాను ఓడించేందుకు సీపీఎం, కాంగ్రెస్‌ కలిసి పనిచేస్తాయి

భాజపాను ఓడించడానికి రాష్ట్రంలో సీపీఎం, కాంగ్రెస్‌ అన్ని రకాలుగా కలిసి ముందుకెళ్లేందుకు నిర్ణయించామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.

Published : 28 Apr 2024 04:18 IST

సీఎం రేవంత్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: భాజపాను ఓడించడానికి రాష్ట్రంలో సీపీఎం, కాంగ్రెస్‌ అన్ని రకాలుగా కలిసి ముందుకెళ్లేందుకు నిర్ణయించామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. సీపీఎం రాష్ట్ర నేతలు తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, సీతారాములు, వీరయ్య శనివారం సీఎం నివాసానికి వచ్చి ఆయనతో చర్చించారు. మంత్రి కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావులు కూడా పాల్గొన్నారు. సమావేశానంతరం సీపీఎం నేతలతో కలిసి సీఎం రేవంత్‌ మీడియాతో మాట్లాడారు. ‘ఏఐసీసీ ఆదేశాల మేరకు రాష్ట్ర సీపీఎం నాయకులతో చర్చించాం. దేశంలో ఇండియా కూటమి గెలుపు చాలా అవసరం. ఇందులోని పార్టీలన్నీ కలిసి పనిచేయాలి. ఈ మేరకు తెలంగాణలో సమష్టిగా ముందుకెళ్లేందుకు కొన్ని ప్రతిపాదనలు సీపీఎం నేతల ముందు పెట్టాం. భువనగిరిలోనూ కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని కోరాం’ అని సీఎం తెలిపారు. తమ్మినేని మాట్లాడుతూ.. ‘మా పార్టీకి భువనగిరిలో మద్దతివ్వాలని సీఎంను కోరాం. కానీ అక్కడ కూడా కాంగ్రెస్‌కే మద్దతివ్వాలని ఆయన సూచించారు. దీనిపై సీపీఎం జాతీయ, రాష్ట్ర కమిటీలతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్‌ను గెలిపించడానికి మా కార్యకర్తలు కృషి చేస్తారు’ అని స్పష్టం చేశారు.

నేడు నిర్ణయం: కాగా భువనగిరిలో ఇరు పార్టీలు స్నేహపూర్వకంగా పోటీ పడదామని సీపీఎం నేతలు రేవంత్‌రెడ్డితో అన్నట్లు తెలుస్తోంది. అలా చేస్తే ఇరు పార్టీలకూ నష్టమని, భువనగిరి నుంచి సీపీఎం అభ్యర్థి నామినేషన్‌ ఉపసంహరించుకోవాలని సీఎం కోరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం సీపీఎం రాష్ట్రకార్యదర్శి వర్గం సమావేశమై చర్చించింది. భువనగిరి సీపీఎం అభ్యర్థిని ఉపసంహరించాలా? వద్దా? అన్న విషయంపై మాట్లాడారు. అయితే ఎంపీ సీటు కావడంతో పార్టీ జాతీయ నాయకత్వంతో మాట్లాడి తమ నిర్ణయాన్ని ఆదివారం ప్రకటించాలని నిర్ణయించారు. సమావేశంలో సీఎంను కలిసిన నాయకులతోపాటు బీవీ రాఘవులు, జ్యోతి, జాన్‌వెస్లీ, పోతినేని సుదర్శన్‌, డీజీ నర్సింగరావు, మల్లు లక్ష్మి, సాగర్‌ తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img