icon icon icon
icon icon icon

మంత్రులకు సవాల్‌!

లోక్‌సభ ఎన్నికలు మంత్రులకు సవాలుగా మారాయి. పలు లోక్‌సభ నియోజకవర్గాలకు మంత్రులను ఇన్‌ఛార్జిగా నియమించిన కాంగ్రెస్‌.. ఆయా నియోజకవర్గాల్లో నాయకులను సమన్వయపరచడం, కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీలను సమర్థంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు గెలుపు బాధ్యతలను అప్పగించింది.

Updated : 28 Apr 2024 06:03 IST

ఒక్కో లోక్‌సభ స్థానానికి ఒక్కొక్కరు ఇన్‌ఛార్జి
సమన్వయం నుంచి విజయం వరకు వారిదే బాధ్యత
త్రిముఖ పోరులో గరిష్ఠ ఫలితాల కోసం కాంగ్రెస్‌ వ్యూహరచన

ఈనాడు, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికలు మంత్రులకు సవాలుగా మారాయి. పలు లోక్‌సభ నియోజకవర్గాలకు మంత్రులను ఇన్‌ఛార్జిగా నియమించిన కాంగ్రెస్‌.. ఆయా నియోజకవర్గాల్లో నాయకులను సమన్వయపరచడం, కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీలను సమర్థంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు గెలుపు బాధ్యతలను అప్పగించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తదితరులు రాష్ట్రవ్యాప్తంగా దృష్టి సారించినా, మంత్రులకు ప్రత్యేకంగా నియోజకవర్గాల బాధ్యతలను పార్టీ అప్పగించింది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రతిరోజు సభలు, రోడ్‌షోల్లో పాల్గొంటున్నారు. మంత్రులు కూడా తమకు అప్పగించిన నియోజకవర్గాలపై పూర్తిగా దృష్టి సారించారు. సగానికి పైగా స్థానాల్లో త్రిముఖపోటీ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించుకోవడంపై వ్యూహరచన చేస్తున్నారు. కొన్నాళ్ల క్రితం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ రాష్ట్రంలో పర్యటించినపుడు ఇదే విషయమై దిశానిర్దేశం చేశారు. ఆ సమయంలోనే ఎంపీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత మంత్రులపై ఉందని స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

పట్టు నిలబెట్టుకునేలా..

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్ని లోక్‌సభ స్థానాల్లో విజయానికి పార్టీ వ్యూహరచనను అమలు చేస్తున్నారు. ప్రత్యేకించి ఆయన మహబూబ్‌నగర్‌, చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్‌ తదితర స్థానాలపై ఎక్కువగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో సమాచారం తెలుసుకొంటూ మంత్రులు, ఎమ్మెల్యేలను అప్రమత్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ అభ్యర్థిని గెలిపించుకోవడంతోపాటు, అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ వచ్చిన నియోజకవర్గాల్లో ఆ పట్టు నిలుపుకొనేలా చూడటం కూడా కొందరు మంత్రులకు పరీక్షగా మారింది. మంత్రివర్గ విస్తరణలో పదవి కోసం ఎదురు చూస్తున్నవారు కూడా లోక్‌సభ ఎన్నికల్లో తమ సత్తా చాటుకొనే ప్రయత్నాల్లో ఉన్నారు. 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో కొందరు మంత్రులకు వారు ప్రాతినిధ్యం వహించేవి, మరికొందరికి ఇతర నియోజకర్గాల బాధ్యతలు అప్పగించారు. ఒకే లోక్‌సభ స్థానం పరిధిలో ఇద్దరు మంత్రులుంటే వారిలో ఒకరికి ఇతర నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు.

మహిళా మంత్రుల సమన్వయం

మహబూబాబాద్‌ స్థానం పరిధిలోని ములుగు నుంచి గెలిచిన మంత్రి సీతక్కకు ఆదిలాబాద్‌ లోక్‌సభ బాధ్యత అప్పగించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు సెగ్మెంట్లలో కలిపి అతి తక్కువ ఓట్లు వచ్చిన వాటిలో ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానం ఒకటి. భారాసకు 4.64 లక్షల ఓట్లు, భాజపాకు 4.47 లక్షల ఓట్లు రాగా.. కాంగ్రెస్‌కు 2.51 లక్షలు మాత్రమే దక్కాయి. ఏడింటిలో ఒక స్థానం నుంచి మాత్రమే కాంగ్రెస్‌ ఎమ్మెల్యే గెలిచారు. అవసరమైనప్పుడల్లా తన సొంత లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో పర్యటిస్తూనే మంత్రి సీతక్క ఇన్‌ఛార్జిగా ఆదిలాబాద్‌పై పూర్తిగా దృష్టి కేంద్రీకరించారు. తెలంగాణ ఉద్యమం, హక్కుల ఉద్యమాల్లో మమేకమై నిత్యం ప్రజలతో ఉండే ఆత్రం సుగుణను అభ్యర్థిగా ఎంపిక చేయించారు. ఏకైక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుతో కలిసి సీతక్క విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వరంగల్‌కు చెందిన మంత్రి కొండా సురేఖకు పార్టీ మెదక్‌ లోక్‌సభ సీటు బాధ్యతలు అప్పగించింది. ఈ నియోజకవర్గ పరిధిలో కూడా ఒక్క మెదక్‌ సెగ్మెంటులో మాత్రమే కాంగ్రెస్‌ గెలిచింది. మిగిలిన ఆరు చోట్ల భారాస అభ్యర్థులే విజయం సాధించారు. భారాసకు 6.68 లక్షల ఓట్లు, కాంగ్రెస్‌కు 4.2 లక్షలు, భాజపాకు 2.2 లక్షల ఓట్లు వచ్చాయి. పైగా భారాసకు అత్యధిక మెజార్టీ వచ్చే సిద్దిపేట, గజ్వేల్‌ అసెంబ్లీ స్థానాలు ఈ లోక్‌సభ పరిధిలోనివే. ఈ క్రమంలో కొండా సురేఖ విజయం కోసం శ్రమిస్తున్నారు.

ఖమ్మం సీటుకు ముగ్గురు మంత్రుల బలం

చివరి నిమిషంలో ఖరారైన ఖమ్మం లోక్‌సభ అభ్యర్థి రఘురాంరెడ్డి నామినేషన్‌ కార్యక్రమానికి మంత్రులు తుమ్మల, పొంగులేటి హాజరయ్యారు. ముందే నిర్ణయించుకున్న కార్యక్రమాల కారణంగా ఉప ముఖ్యమంత్రి భట్టి హాజరు కాలేదని తెలిసింది. ఖమ్మం అభ్యర్థి విషయంలో భట్టి, పొంగులేటి మధ్య చివరి వరకు పోటీ నెలకొనగా.. పొంగులేటి సూచించిన ఆయన వియ్యంకుడు రఘురాంరెడ్డికే టికెట్‌ దక్కింది. ఈ నేపథ్యంలో ఖమ్మం లోక్‌సభ పరిధిలో మంత్రులంతా కలిసి చేసే ప్రచారానికి ప్రాధాన్యం ఉంది. రాష్ట్రంలో ఒక లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉప ముఖ్యమంత్రి, కీలక శాఖలు చూస్తున్న ఇద్దరు మంత్రులు ఉన్నది ఖమ్మం జిల్లాలోనే కావడం బలం చేకూర్చే అంశం. మొన్నటి ఎన్నికల్లో ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ హస్తానికే ఆధిక్యం వచ్చింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఎన్నికల హామీల్లో కొన్నింటిని అమలు చేసింది. వీటిని సానుకూలంగా మలుచుకునేలా ప్రచారం, ఇతర పార్టీల నాయకుల చేరికలతో కాంగ్రెస్‌ను బలోపేతం చేస్తున్న నాయకులు.. ఈ ఎన్నికల్లో ఎన్ని సీట్లు సాధిస్తారో చూడాల్సి ఉంది.


ఇంటా.. బయటా గెలిచేందుకు..

ఇతర నియోజకవర్గాల బాధ్యతలు నిర్వర్తిస్తున్న మంత్రులు తమ సొంత నియోజకవర్గాలనూ విస్మరించకుండా రెండింటిపైనా దృష్టి కేంద్రీకరించారు. కొందరు మంత్రులు రాష్ట్రంలో పర్యటనలు కూడా చేస్తున్నారు. జహీరాబాద్‌ లోక్‌సభ స్థానానికి ఇన్‌ఛార్జిగా ఉన్న దామోదర్‌ రాజనరసింహ మెదక్‌ లోక్‌సభ స్థానంలోనూ సమన్వయం చేస్తున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో జహీరాబాద్‌ పరిధిలో రెండో స్థానంలో నిలిచిన భారాస కంటే కాంగ్రెస్‌కు 19 వేల ఓట్లు ఎక్కువ వచ్చాయి. మిగిలిన మంత్రులు కూడా తమకు అప్పగించినవాటితో పాటు.. తాము తోడ్పాటు అందించగలిగిన నియోజకవర్గాలపైనా దృష్టి పెట్టారు. మిగిలిన మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (నల్గొండ), పొంగులేటి శ్రీనివాసరెడ్డి (ఖమ్మం), శ్రీధర్‌బాబు (పెద్దపల్లి), తుమ్మల నాగేశ్వరరావు (మహబూబాబాద్‌), కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (సికింద్రాబాద్‌), జూపల్లి కృష్ణారావు (నాగర్‌ కర్నూల్‌), పొన్నం ప్రభాకర్‌ (కరీంనగర్‌) ఇన్‌ఛార్జిలుగా ఉన్నారు. మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి (నిజామాబాద్‌), ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి (వరంగల్‌), కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (భువనగిరి) ఉన్నారు. ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి (చేవెళ్ల), మాజీ ఎమ్మెల్యేలు సంపత్‌కుమార్‌ (మహబూబ్‌నగర్‌), మైనంపల్లి హనుమంతరావు (మల్కాజిగిరి) ఆయా నియోజకవర్గాల బాధ్యతలు చూస్తున్నారు. హైదరాబాద్‌ లోక్‌సభ స్థానానికి ఒబేదుల్లా కొత్వాల్‌ను ఇన్‌ఛార్జిగా నియమించారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img