icon icon icon
icon icon icon

13 లోక్‌సభ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అధికం

రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల్లో మహిళా ఓటర్లదే ఆధిక్యం. మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాలకుగాను 13 చోట్ల మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉండటం విశేషం.

Published : 29 Apr 2024 03:19 IST

పురుషుల కన్నా 1,72,826 మంది ఎక్కువ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల్లో మహిళా ఓటర్లదే ఆధిక్యం. మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాలకుగాను 13 చోట్ల మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉండటం విశేషం. రాష్ట్రంలో వచ్చే నెల 13న పోలింగ్‌ జరగనున్న సంగతి తెలిసిందే. ఏటా జనవరిలో తుది ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటిస్తుంది. ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను చేపట్టింది. తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 3,32,32,318 ఓటర్లు నమోదయ్యారు. వారిలో పురుషులు 1,65,13,014; మహిళలు 1,67,00,574 మంది ఉన్నారు. ట్రాన్స్‌జెండర్‌ ఓటర్లు 2,760 మంది నమోదయ్యారు. అలాగే 15,970 మంది సర్వీసు ఓటర్లు ఉండగా వారిలో 15,352 మంది పురుషులు, 618 మంది మహిళలు ఉన్నారు. మొత్తంగా ఓటర్లలో పురుషుల కన్నా మహిళలు 1,72,826 మంది ఎక్కువగా ఉన్నారు. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే తాజా ఎన్నికల్లో రాష్ట్రంలో 35,35,039 మంది ఓటర్లు పెరిగారు.

  • రాష్ట్రంలో అత్యధికంగా మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలో 37,80,453 మంది ఓటర్లు ఉన్నారు. అతి తక్కువగా మహబూబాబాద్‌లో 15,33,858 మంది నమోదయ్యారు. నిష్పత్తి పరంగా.. 1,000 మంది పురుష ఓటర్లుంటే 1,010 మంది మహిళా ఓటర్లున్నారు.
  • గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని నియోజకవర్గాల్లో (హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, మల్కాజిగిరి, చేవెళ్ల) మాత్రమే మహిళల కంటే పురుష ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. మిగిలిన అన్ని స్థానాల్లోనూ మహిళా ఓటర్లదే ఆధిక్యం.
  • నిజామాబాద్‌ నియోజకవర్గంలో మహిళా ఓటర్ల ఆధిక్యం అత్యధికంగా ఉంది. ఇక్కడ పురుష ఓటర్లకంటే మహిళా ఓటర్లు 92,517 మంది ఎక్కువగా ఉన్నారు. అతి తక్కువ ఆధిక్యం ఉన్న నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గంలో పురుష ఓటర్ల కంటే మహిళలు 8,465మంది మాత్రమే ఎక్కువ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img