icon icon icon
icon icon icon

రిజర్వేషన్ల రద్దు కాంగ్రెస్‌ విష ప్రచారమే!

భాజపా రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ కాంగ్రెస్‌ విష ప్రచారం చేస్తోందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ ఆరోపించారు.

Published : 29 Apr 2024 03:23 IST

భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి: బండి సంజయ్‌

హుజూరాబాద్‌ గ్రామీణం, పట్టణం - న్యూస్‌టుడే: భాజపా రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ కాంగ్రెస్‌ విష ప్రచారం చేస్తోందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ ఆరోపించారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ గాంధీనగర్‌లో ‘ఇంటింటా భాజపా’ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఇంటింటా తిరుగుతూ నియోజకవర్గ అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ.. భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్‌ పార్టీ ప్రచారం చేస్తోందని.. ఎస్సీ, ఎస్టీల్లో భయాందోళనలు సృష్టిస్తోందని ధ్వజమెత్తారు. భాజపాను ఎదుర్కొనే దమ్ము లేకనే ఇలా చేస్తోందని విమర్శించారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ గ్యారంటీలను అమలు చేయకపోవడంతో ఆ పార్టీపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు. భారత రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పాటించేది భాజపానే అని అన్నారు. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను కొనసాగిస్తామన్నారు. మతపరమైన రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరించి ముస్లింలకు రిజర్వేషన్లను అమలు చేస్తున్న పార్టీ కాంగ్రెస్‌ అని అన్నారు. భాజపా అధికారంలోకి వస్తే మతపరమైన రిజర్వేషన్లను రద్దుచేసి.. వాటిని ఎస్సీ, ఎస్టీ, బీసీ, అగ్రవర్ణ నిరుపేదలకు పంచుతామన్నారు. గతంలో రాజ్యాంగం మారుస్తామని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటిస్తే అప్పుడు కాంగ్రెస్‌ నేతలు నోరు మెదపలేదన్నారు. ప్రతిభా ఉపకారవేతనాల కింద ఒక్క ఏడాదిలోనే రూ.59 వేల కోట్లను కేటాయించిన ఘనత భాజపాకే దక్కుతుందన్నారు. ఇవి స్వదేశీ భాజపా - విదేశీ కాంగ్రెస్‌ల మధ్య జరుగుతున్న ఎన్నికలని వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img