icon icon icon
icon icon icon

భువనగిరి బరిలో కొనసాగనున్న సీపీఎం

భువనగిరి లోక్‌సభ స్థానంలో పోటీలో కొనసాగాలని సీపీఎం నిర్ణయించింది. రాష్ట్రంలోని మిగిలిన 16 స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులకు మద్దతు ఇవ్వనుంది. ఈ మేరకు ఆదివారం నిర్ణయం తీసుకుంది.

Published : 29 Apr 2024 03:24 IST

మిగిలిన 16 స్థానాల్లో కాంగ్రెస్‌కు మద్దతు
రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశంలో నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: భువనగిరి లోక్‌సభ స్థానంలో పోటీలో కొనసాగాలని సీపీఎం నిర్ణయించింది. రాష్ట్రంలోని మిగిలిన 16 స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులకు మద్దతు ఇవ్వనుంది. ఈ మేరకు ఆదివారం నిర్ణయం తీసుకుంది. సీపీఎం నేతలతో సీఎం రేవంత్‌రెడ్డి శనివారం జరిపిన చర్చల్లో భువనగిరిలోనూ కాంగ్రెస్‌కే మద్దతివ్వాలని కోరిన విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదనను సీపీఎం రాష్ట్ర నేతలు జాతీయ నాయకత్వం దృష్టికి ఆదివారం ఉదయం తీసుకెళ్లారు. ఆ తర్వాత ముఖ్యనాయకులు చర్చించుకున్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం టి.జ్యోతి అధ్యక్షతన ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఎంబీ భవన్‌లో జరిగింది. పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో పాటు 15 మంది కార్యదర్శివర్గ సభ్యులు హాజరయ్యారు. భువనగిరిలో ప్రచారంలో ఉన్న నాయకులు ఆన్‌లైన్‌లో పాల్గొన్నారు. సీపీఎం విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ఒక్క నియోజకవర్గంలో అయినా పోటీలో ఉండాల్సిందేనని పార్టీ అభిప్రాయపడ్డట్లు సమాచారం. భువనగిరి స్థానానికి సీపీఎం తరఫున మహమ్మద్‌ జహంగీర్‌ నామినేషన్‌ వేసిన విషయం తెలిసిందే.


భాజపా అన్యాయాల్ని ఎండగడతాం

-తమ్మినేని

భువనగిరిలో సీపీఎం అభ్యర్థి మహమ్మద్‌ జహంగీర్‌ను బలపర్చాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మిగిలిన 16 స్థానాల్లో మతోన్మాద భాజపాను ఓడించేందుకు ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్‌ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. పార్టీ కార్యదర్శివర్గ సమావేశం అనంతరం ఆయన ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. దేశానికి, తెలంగాణ ప్రజలకు భాజపా చేసిన అన్యాయాలను ఎండగట్టేందుకు చేస్తున్న పోరాటాన్ని సీపీఎం మరింత ఉద్ధృతం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img