icon icon icon
icon icon icon

శాసించేది పోలింగ్‌ శాతమే!

లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో నమోదయ్యే పోలింగ్‌ శాతం పార్టీ అభ్యర్థుల గెలుపోటములను నిర్దేశించడంతోపాటు ఆయా పార్టీలకు వచ్చే సీట్ల సంఖ్యనూ ప్రభావితం చేస్తోంది.

Published : 29 Apr 2024 03:25 IST

కొద్ది శాతం అంతరంతో సీట్లలో భారీ తేడా
నేతలకు దడ పుట్టిస్తున్న గత ఎన్నికల గణాంకాలు
ఓట్లు పెంచుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు  

ఈనాడు, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో నమోదయ్యే పోలింగ్‌ శాతం పార్టీ అభ్యర్థుల గెలుపోటములను నిర్దేశించడంతోపాటు ఆయా పార్టీలకు వచ్చే సీట్ల సంఖ్యనూ ప్రభావితం చేస్తోంది. గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇదే జరిగింది. కొద్దిశాతం ఓట్ల అంతరంతోనే ప్రధాన పార్టీలు భారీగా సీట్లు కోల్పోయాయి. ఈ విషయాన్ని గుర్తించిన పార్టీలు ఈసారి ఆ పరిస్థితి తలెత్తకుండా జాగ్రత్తపడుతున్నాయి. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ మే 13న జరగనుంది. ఇంకా గడువు పక్షం రోజులే ఉంది. ఈసారి రాష్ట్రంలో దాదాపు అన్ని స్థానాల్లో త్రిముఖ పోరు నెలకొన్న నేపథ్యంలో ప్రతిఓటూ కీలకం కానుంది. ఈ నేపథ్యంలో ప్రచారాన్ని ఉద్ధృతం చేయడంతోపాటు ఓట్ల శాతాన్ని పెంచుకోవడంపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. గత లోక్‌సభ ఎన్నికలు, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గాల వారీగా తమకు, ప్రత్యర్థులకు లభించిన ఓట్ల లెక్కల్ని బేరీజు వేసుకుంటున్నాయి. తక్కువ ఉన్న చోట్ల అంతరాన్ని పూడ్చుకోవడంపై దృష్టి సారించాలని అభ్యర్థులకు సూచిస్తున్నాయి. నియోజకవర్గాల వారీగా పరిస్థితిని సమీక్షించుకుంటూ..హోరాహోరీ పోటీ ఉన్న చోట ప్రత్యర్థి పార్టీల నుంచి బలమైన నాయకుల్ని చేర్చుకునేందుకు ప్రాధాన్యమిస్తున్నాయి. ఇటీవల ముగిసిన కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని భారీగా ఓట్లు చేర్పించేందుకు ప్రయత్నించడం ఇందులో భాగమేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఓట్లలో 2.05 శాతమే.. సీట్లలో భారీ తేడా..

ఆయా ఎన్నికల్లో ప్రధాన పార్టీలు సాధించిన ఫలితాల్ని విశ్లేషించగా.. కొద్ది శాతం ఓట్ల తేడాతో సాధించిన సీట్లలో భారీగా అంతరం కన్పించింది. ఉదాహరణకు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌    39.40 శాతం ఓట్లతో 64 సీట్లు సాధిస్తే, 37.35 శాతం ఓట్లు పొందిన భారాసకు వచ్చిన సీట్లు 39 మాత్రమే. అంటే 2.05 శాతం ఓట్ల తేడాతో భారాస 25 సీట్లు కోల్పోయింది.

2014 లోక్‌సభ ఎన్నికల్లో 34.94 శాతం ఓట్లతో భారాస 11 ఎంపీ సీట్లు సాధించింది.  2019 ఎన్నికల్లో ఓటింగ్‌ 41.71 శాతానికి పెంచుకున్నా సాధించిన సీట్ల సంఖ్య 9కే పరిమితమైంది. 2019లో 19.65 శాతం ఓట్లతోనే భాజపా నాలుగు సీట్లు గెలుచుకోగా, 29.79 శాతం ఓట్లు సాధించిన కాంగ్రెస్‌ మూడు సీట్లే సాధించడం గమనార్హం. ‘సాధారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం మెరుగ్గా ఉంటుంది. లోక్‌సభ ఎన్నికల్లో ఇందుకు భిన్నమైన పరిస్థితి ఉంటుంది. ఉదాహరణకు 2014తో పోలిస్తే 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం ఏకంగా   6.4 తగ్గింది. ఈసారి పోలింగ్‌ శాతం పెరుగుతుందా, తగ్గుతుందా? అన్నది ఒక అంశం అయితే.. నమోదయ్యే పోలింగ్‌ శాతం ప్రకారం ఏ పార్టీకి ఓట్లు పెరుగుతాయి, ఏ పార్టీకి తగ్గుతాయి అనేదీ కీలకమేనని ఓ ప్రధాన పార్టీ నేత వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img