icon icon icon
icon icon icon

అబద్ధాలే కాంగ్రెస్‌ గ్యారంటీ

అబద్ధాలే కాంగ్రెస్‌ పార్టీ గ్యారంటీ అన్నట్లుగా రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పని చేస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు.

Published : 29 Apr 2024 03:27 IST

‘రిజర్వేషన్ల రద్దు’.. దశాబ్దంలోనే అతిపెద్ద అబద్ధం
హామీలు అమలు చేయలేకే రేవంత్‌ తప్పుడు ప్రచారం
ఆ పార్టీ ఎప్పుడో ఇటలీ కాంగ్రెస్‌గా మారింది
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ధ్వజం

ఈనాడు, హైదరాబాద్‌: అబద్ధాలే కాంగ్రెస్‌ పార్టీ గ్యారంటీ అన్నట్లుగా రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పని చేస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. భాజపా కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ సీఎం తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రిజర్వేషన్లను రద్దు చేస్తారనడం ఈ దశాబ్దంలోనే అతిపెద్ద అబద్ధమని ఎద్దేవా చేశారు. ఆయన పార్టీ ఎప్పుడో ఇటలీ కాంగ్రెస్‌గా మారిందన్నారు. భాజపా కార్యాలయంలో ఆయన ఆదివారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బంగారు శ్రుతి, కాసం వెంకటేశ్వర్లు, అధికార ప్రతినిధులు ఎన్‌.వి.సుభాష్‌, రాణిరుద్రమ తదితరులతో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ దిగజారి చౌకబారు ప్రకటనలు చేస్తోందని కిషన్‌రెడ్డి ఆరోపించారు. ప్రమాణాలు.. సవాళ్లు.. ప్రతి సవాళ్లతో ప్రజలకు న్యాయం జరగదని, సీఎం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌కు లోక్‌సభ ఎన్నికల్లో ప్రజాదరణ, స్పందన లేకపోవడంతో ఆ పార్టీ కొత్త నాటకాలకు తెరతీసిందన్నారు.  తెలంగాణలో అమలవుతున్న బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల రిజర్వేషన్లపై చర్చకు సిద్ధమా? అని కిషన్‌రెడ్డి సవాల్‌ చేశారు. ఏ ప్రాతిపదికన సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారో చర్చకు రావాలన్నారు.‘ఆరు గ్యారంటీలు అమలు చేయలేని రేవంత్‌రెడ్డికి ఏం చెప్పి ఓట్లు అడగాలో దిక్కు తోచడంలేదు. హామీలు అమలు చేయలేకుంటే ఆయన గద్దె దిగాలి. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఒకటి రెండు సీట్లకే పరిమితం కాబోతోంది. అత్యధిక స్థానాల్లో భాజపా గెలవబోతోంది. దీన్ని తట్టుకోలేకే రేవంత్‌ విష ప్రచారం చేస్తున్నారు. తప్పుడు హామీలు, రిజర్వేషన్ల రద్దు అంటూ ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్నారు. సిద్దిపేటలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రసంగాన్ని మార్ఫింగ్‌ చేసి కాంగ్రెస్‌ దుష్ప్రచారానికి తెరలేపింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం.  భాజపా ఒక కుటుంబం లేదా వ్యక్తుల కోసం పనిచేయదని ప్రజలకు తెలుసు. భాజపా రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ పదేపదే తప్పుడు ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారన్నది కాంగ్రెస్‌ కుయుక్తి. ఆ పార్టీ మతపరమైన రిజర్వేషన్లు ఇచ్చి.. బీసీ రిజర్వేషన్లలో కోత విధించింది. బీసీలకు విద్య, ఉద్యోగావకాశాల్లో గండికొట్టింది. బీసీ రిజర్వేషన్లపై భాజపాను విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదు. కేంద్ర మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అత్యధిక మంత్రి పదవులు ఇచ్చిన ఘనత భాజపాదే. అంబేడ్కర్‌ ఆశయ స్ఫూర్తితో భాజపా పని చేస్తోంది. తెలంగాణలో భాజపాతోనే బీసీలకు రిజర్వేషన్ల పరంగా న్యాయం జరుగుతోంది. ఎన్నికల్లో భాజపాను ఆదరించాలి’ అని కిషన్‌రెడ్డి కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img