icon icon icon
icon icon icon

భాజపాకు ఓటేస్తే.. పదవులు, పరిశ్రమలన్నీ గుజరాత్‌కే

‘‘పదేళ్లుగా మాయమాటలతో ప్రజలను మోసం చేస్తున్న ప్రధాని మోదీకి, భాజపాకు ఓటేస్తే.. పదవులు, పరిశ్రమలన్నీ గుజరాత్‌కు తీసుకెళ్తారు.

Published : 29 Apr 2024 03:29 IST

మోదీని ఓడించే సమయం వచ్చింది
మతాన్ని అడ్డుపెట్టుకుని అధికారంలోకి వచ్చే యత్నం
వనస్థలిపురం, మల్కాజిగిరి కౌకూర్‌ రోడ్‌షోల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

ఈనాడు-హైదరాబాద్‌, నాగోలు, ఆర్‌కేపురం, సఫిల్‌గూడ, బొల్లారం-న్యూస్‌టుడే: ‘‘పదేళ్లుగా మాయమాటలతో ప్రజలను మోసం చేస్తున్న ప్రధాని మోదీకి, భాజపాకు ఓటేస్తే.. పదవులు, పరిశ్రమలన్నీ గుజరాత్‌కు తీసుకెళ్తారు. తెలంగాణ ఏర్పాటును తప్పుబట్టిన మోదీకి ఓటెందుకు వేయాలి? పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు? ఐటీఐఆర్‌ను ఎందుకు రద్దు చేశారు? వైద్య కళాశాలలను ఎందుకు మంజూరు చేయలేదు? ఈ ప్రశ్నలకు ఈ నెల 30న రాష్ట్రానికి వస్తున్న ప్రధాని జవాబు చెప్పాలి’’ అని పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి సునీతా మహేందర్‌రెడ్డికి మద్దతుగా హైదరాబాద్‌ వనస్థలిపురం, కౌకూర్‌ చౌరస్తాలలో ఆదివారం నిర్వహించిన రోడ్‌షోల్లో ఆయన ప్రసంగించారు. ‘‘మతాన్ని అడ్డుపెట్టుకుని అధికారంలోకి రావాలని భాజపా నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. మత విద్వేషాలు రెచ్చగొడుతున్న భాజపాను, మోదీని ఓడించే సమయం వచ్చింది. సికింద్రాబాద్‌, మల్కాజిగిరి ప్రాంతాల్లో నివసిస్తున్న రైల్వే అధికారులు, ఉద్యోగులు కాంగ్రెస్‌కు ఓటేస్తేనే ఉద్యోగ భద్రత ఉంటుంది. మోదీ మరోసారి అధికారంలోకి వస్తే రైల్వేను అదానీ, అంబానీలకు అప్పజెబుతారు.

భారాస, భాజపా చీకటి ఒప్పందం తేటతెల్లం

లోక్‌సభ ఎన్నికల్లో భారాస-భాజపాల మధ్య చీకటి ఒప్పందం ఉందని మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి మాటల ద్వారా తేటతెల్లమైంది. ఒప్పందం కుదరకపోతే ఈటల తప్పకుండా గెలుస్తారని మల్లారెడ్డి ఎలా అంటారు. కేసీఆర్‌కు తెలియకుండానే మల్లారెడ్డి ఆ మాటన్నారా? నిజంగా భాజపాతో ఒప్పందం లేకపోతే మేడ్చల్‌ ఎమ్మెల్యేకు భారాస షోకాజ్‌ నోటీస్‌ ఎందుకు ఇవ్వలేదు? తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో ఉండి.. ఇప్పుడు ఉద్యోగం ఊడిపోయిన కేసీఆర్‌కు తత్వం బోధపడింది. ఓట్ల కోసం కొంగజపం చేస్తున్నారు. కారు చెడిపోయిందని బస్సులో బయలుదేరారు. తొమ్మిదిన్నరేళ్లలో చేసిందేమీ లేకపోగా.. మరోసారి మోసం చేసేందుకు పర్యటిస్తున్నారు. కారును రిపేరు కోసం షెడ్డుకు పంపించామని కేటీఆర్‌ అంటున్నారు. రిపేరు కాదు.. మొత్తం ఖరాబైంది. ఆర్టీసీని వారు దివాలా తీయించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మేం లాభాలబాట పట్టించాం. జీరో టికెట్లకు నెలకు రూ.349 కోట్ల చొప్పున ఇప్పటివరకు రూ.1,359 కోట్లు చెల్లించాం. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో మహిళలు గుళ్లు, గోపురాలకు వెళ్తున్నారు. అక్కచెల్లెళ్లను గౌరవించే ఉద్దేశంతోనే పీసీసీ అధ్యక్షుడిగా ముగ్గురు మహిళలకు ఎంపీ అభ్యర్థులుగా టికెట్లు ఇచ్చాను. మల్కాజిగిరి ఎంపీగా సునీతా మహేందర్‌రెడ్డిని గెలిపిస్తే హయత్‌నగర్‌ వరకూ మెట్రోను విస్తరిస్తాం. మూసీని ప్రక్షాళన చేస్తాం. ముంపు ప్రాంతాల్లో మాస్టర్‌ ప్లాన్‌ అందుబాటులోకి తెస్తాం. జూబ్లీ బస్‌స్టేషన్‌ నుంచి మేడ్చల్‌ వరకూ మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్టును చేపట్టే అవకాశాలున్నాయి’’ అని రేవంత్‌రెడ్డి వివరించారు. కార్యక్రమాల్లో మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి సునీతా మహేందర్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, నాయకులు మైనంపల్లి హనుమంతరావు, మధుయాస్కీ, మల్‌రెడ్డి రాంరెడ్డి, ఎం.రామ్మోహన్‌గౌడ్‌, జక్కిడి ప్రభాకర్‌రెడ్డి, హరివర్ధన్‌రెడ్డి, తోటకూర వజ్రేశ్‌యాదవ్‌, నక్కా ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.


బండి రాలేదు కానీ..

‘ఎల్బీనగర్‌లో మూడేళ్ల క్రితం వరదల కారణంగా మనుషులు, కార్లు కొట్టుకుపోతే.. అప్పటి భాజపా అధ్యక్షుడు, నాయకులు ఆర్భాటంగా హామీలిచ్చారు. బండి పోతే బండి.. సైకిల్‌ పోతే సైకిల్‌ ఇస్తామని చెప్పారు. బండి రాలేదు గాని.. ఇప్పుడు ఓట్లడిగేందుకు ఈటల వస్తున్నారు. తొమ్మిదేళ్లు రాష్ట్ర మంత్రిగా, ఏడాది పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన ఈటల రాజేందర్‌ ఎల్బీనగర్‌కు ఎప్పుడైనా వచ్చారా? గతంలో భారాసలో మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్‌తో పంపకాల్లో తేడా రావడంతోనే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఇక్కడ ఇల్లు కట్టుకున్నా ఎవర్నీ ఆయన పలకరించబోరు. కొద్దినెలల క్రితం కురిసిన వర్షాలకు ఓ బాలిక నాలాలో పడి చనిపోతే కనీసం పరామర్శకు కూడా వెళ్లలేదు. నిజంగా ప్రజలకు సేవ చేసి ఉంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్‌లో ఎందుకు ఓడిపోయారు?  ఎల్బీనగర్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధిలో 11 డివిజన్లలో భాజపా కార్పొరేటర్లున్నారు. వారెప్పుడైనా ప్రజల వద్దకు వచ్చారా? మేలు చేయనివారు ఎలా ఓట్లడుగుతారు?’ అని రేవంత్‌ ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img