icon icon icon
icon icon icon

గోదావరిని మోదీ ఎత్తుకుపోతానంటే రేవంత్‌ నోరు మెదపరేం?

తెలంగాణ గొంతు కోసి మన బతుకుదెరువైన గోదావరి నదిని ప్రధాన మంత్రి మోదీ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఎత్తుకుపోతానంటే చేతకాని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నోరుమెదపకపోవడంలో మతలబేంటని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రశ్నించారు.

Published : 29 Apr 2024 03:32 IST

కేసీఆర్‌ జైళ్లకు భయపడితే తెలంగాణ వచ్చేదా?
స్టేషన్‌ఘన్‌పూర్‌కు త్వరలో ఉప ఎన్నిక ఖాయం
హనుమకొండ రోడ్‌ షోలో మాజీ సీఎం కేసీఆర్‌

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలనలో రైతు బంధు పోయింది.. కరెంటు బందైంది.. వరికి బోనస్‌ బోగసే అయింది.. ఇన్ని మోసాలు చేసిన తర్వాత కాంగ్రెస్‌కుగానీ గోదావరి ఎత్తుకుపోతానన్న భాజపాకు గానీ ఓటేస్తే ఏమవుతుంది? ప్రజల తరఫున కొట్లాడే వారు ఎవరు? అది కేసీఆరే. యుద్ధం చేద్దాం, భారాస ప్రభుత్వంలో మాదిరి మళ్లీ రైతు బంధు రావాలన్నా ప్రజలు నాకు బలం ఇవ్వాలి. 

- భారాస అధినేత కేసీఆర్‌


గోదావరి, కృష్ణాలను కాపాడుకోవాలన్నా, రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు రావాలన్నా, మన ప్రాజెక్టులకు జాతీయ హోదా దక్కాలన్నా, నిరుద్యోగ సమస్య తీరి మన బతుకులు బాగుపడాలన్నా కచ్చితంగా రాష్ట్రంలో భారాస అభ్యర్థులే గెలవాలి.        

-కేసీఆర్‌

ఈనాడు, వరంగల్‌: తెలంగాణ గొంతు కోసి మన బతుకుదెరువైన గోదావరి నదిని ప్రధాన మంత్రి మోదీ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఎత్తుకుపోతానంటే చేతకాని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నోరుమెదపకపోవడంలో మతలబేంటని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రశ్నించారు. ఆదివారం వరంగల్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని హనుమకొండలో భారాస అభ్యర్థి డాక్టర్‌ మారపల్లి సుధీర్‌కుమార్‌ను గెలిపించాలని కోరుతూ రోడ్‌ షో చేపట్టారు. రాత్రి 8 గంటలకు అంబేడ్కర్‌ విగ్రహం నుంచి హనుమకొండ చౌరస్తా వరకు ఇది సాగింది. అనంతరం చౌరస్తాలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ‘‘మనకున్న ఒకే ఒక నది, మన బతుకుదెరువు గోదావరి. నేడైనా, రేపైనా అదే మనకు జీవనాధారం. మోదీ రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రజల గొంతుకోసి గోదావరి నదిని ఎత్తుకొనిపోతా, తమిళనాడుకిస్తా, కర్ణాటకకు ఇస్తా అని మాట్లాడుతున్నారు. ఓట్ల సమయంలో గోదావరి నదిని తీసుకొనిపోతా అని మోదీ రాష్ట్ర ప్రభుత్వానికి నోటిఫికేషన్‌ పంపించారు. ప్రాణం పోయినా ఇవ్వబోమని రాష్ట్ర ప్రభుత్వం పంచాయితీ పెట్టాలి. నేనున్నప్పుడు అదే చేశా. ఈ చేతకాని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నోరుమెదపకుండా ఉంది.

కేంద్రంలో హంగ్‌ వస్తే మనం కీలకమవుతాం

ఇంతకుముందే కాంగ్రెస్‌ వాళ్లు కృష్ణానదిని తీసుకుపోయి కేఆర్‌ఎంబీకి అప్పగించారు. ఈ నదులను ఎవరు కాపాడాలి? ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా భాజపాకు 200 సీట్లు దాటే పరిస్థితి లేదు. తెలంగాణలో ఎక్కువ లోక్‌సభ సీట్లను భారాస గెలిస్తే.. కేంద్రంలో హంగ్‌ వస్తే అప్పుడు మనం కీలకమవుతాం.

కడియంకు శాశ్వత రాజకీయ సమాధి

కడియం శ్రీహరికి టికెట్‌ ఇచ్చాం.. ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చాం. ఆయన ఎందుకు పార్టీ మారారు? రాజకీయ జీవితాన్ని ఆయనకు ఆయనే శాశ్వతంగా సమాధి చేసుకుంటున్నారు. మరో మూడు నెలల్లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రాక తప్పదు.. రాజయ్య ఎమ్మెల్యే కాకతప్పదు. ద్రోహులకు చెప్పే గుణపాఠం అదే.


కవితను భాజపా ప్రభుత్వం జైల్లో పెట్టినా భయపడలేదు

తెలంగాణ వచ్చాక మైనారిటీల కోసం పదేళ్లు ఎంతగా పాటుపడ్డామో మీ అందరికీ తెలుసు. గురుకుల పాఠశాలలు పెట్టి వారి సంక్షేమం కోసం రూ.12 వేల కోట్లు ఖర్చు చేశాం. దేశంలో మరెక్కడా మైనారిటీల కోసం ఇంతలా చేయలేదు. భారాస ఎప్పటికీ సెక్యులర్‌ పార్టీగానే ఉంటుంది. నా కుమార్తె కవితను భాజపా ప్రభుత్వం జైల్లో పెట్టింది. అయినా మేం భయపడలేదు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేసీఆర్‌ గుడ్లు పీకి గోలీలు ఆడతామని, పేగులు తీసి మెడలో వేసుకుంటామని మాట్లాడుతున్నారు. నేను పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా. ఇటువంటి మాట నా నోట ఎప్పుడైనా విన్నారా? కేసీఆర్‌.. నిన్ను తీసుకుపోయి చర్లపల్లి జైల్లో వేస్తా అంటున్నారు. నేనెప్పుడైనా జైళ్లకు భయపడతానా? కేసీఆర్‌ జైళ్లకు భయపడితే తెలంగాణ వచ్చేదా? ఎన్ని దెబ్బలు తిన్నాం? ఎన్ని నిరాహార దీక్షలు చేశాం? ఎన్నో సార్లు పదవులను ఎడమ కాలి చెప్పులతో సమానంగా భావించి త్యాగాలు చేశాం. తెలంగాణ ఉద్యమం అయిపోలేదు. ఇంకా రాష్ట్రాన్ని చాలా అభివృద్ధి చేయాలి. అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో వరంగల్‌లో కట్టిన 24 అంతస్తుల ఆసుపత్రే నిదర్శనం.


ముఖ్యమంత్రికి తెలంగాణ చరిత్ర తెలియదు

ముఖ్యమంత్రి చాలా చిత్రవిచిత్రమైన మాటలు మాట్లాడుతున్నారు. వరంగల్‌కు కాళేశ్వరం నీళ్లే రాలేదట. మరి మహబూబాబాద్‌, డోర్నకల్‌, పాలకుర్తి, నర్సంపేట, వర్ధన్నపేట, పరకాలల్లో ఎక్కడి నుంచి నీళ్లు వచ్చాయి? అంతకుముందు కాంగ్రెస్‌ రాజ్యంలో శ్రీరామసాగర్‌ స్టేజ్‌-2 అని చెబితే దశాబ్దాలు గడచినా నీళ్లు రాలేదు. తెలంగాణ సాధించుకున్న తర్వాత కష్టపడి కాళేశ్వరం నిర్మించాక పసిడి పంటలు పండాయి. ఈ ముఖ్యమంత్రికి తెలంగాణ చరిత్ర తెలియదు. మొన్న ఎక్కడో మాట్లాడుతూ.. కృష్ణా నది కూడా తానే కట్టానని అన్నారు. ఎవరైనా నది కడతారా? దీనిపై సోషల్‌మీడియాలో ట్రోలింగ్‌ చేస్తున్నారు. వారి హామీలు చూసి మోసపోయి ఓట్లేస్తే కేవలం నాలుగైదు నెలలలోనే ఏమైంది? కరెంటు ఎటు పోయింది? సాగునీరు ఎటుపోయింది? పంటలు ఎందుకు ఎండుతున్నాయ్‌? గత పదేళ్లలో ఇలాంటి దారుణ పరిస్థితులు ఉన్నాయా? ఒక్కటంటే ఒక్క హామీ అమలు చేయలేదు. రైతు బంధు వచ్చిందా? ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఇస్తామన్నారు వచ్చాయా? మనం రెండు దఫాలుగా రూ.30 వేల కోట్లతో రైతు రుణమాఫీ చేశాం. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోంది?


భవన నిర్మాణాలకు అనుమతుల బండారం బయటపెడతాం

నాడు తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో భూముల ధరలు బ్రహ్మాండంగా పెరిగాయి. ఈ రంగంపై ఆధారపడ్డ వేల మంది ఇప్పుడు రోడ్లపై పడ్డారు. భవన నిర్మాణాలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం లేదు. ఎందుకంటే ఇతర రాష్ట్రాల బిల్డర్లు భవనాలు కడితే కాంగ్రెస్‌కు లంచాలు ఇవ్వాలట.. ఈ బండారమంతా త్వరలో బయటపెడతాం. ఇక ప్రజల్ని మోసం చేసే మరో పార్టీ భాజపా. ఆ పార్టీ ఎజెండాలో ఎక్కడా ప్రజల కష్ట సుఖాలు ఉండవు. అందుకోసం యువత ఆవేశపడకుండా ఆలోచించి ఓటేయాలి’ అని కేసీఆర్‌ అన్నారు. రోడ్‌ షోలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు వినయ్‌భాస్కర్‌, రాజయ్య, చల్లా ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య కేసీఆర్‌ రోడ్‌ షోలో పాల్గొనలేదు. ఇటీవల ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరతారన్న ప్రచారం నేపథ్యంలో ఈ తాజా పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img