icon icon icon
icon icon icon

సీఎం రేవంత్‌కు నోటీసులు

రిజర్వేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, ఫేక్‌ వీడియోను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారనే అభియోగంతో తెలంగాణ సీఎం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు మరో నలుగురు కాంగ్రెస్‌ నేతలకు దిల్లీ పోలీసులు సోమవారం నోటీసులు అందజేశారు.

Updated : 30 Apr 2024 07:24 IST

రేపు విచారణకు హాజరు కావాలన్న దిల్లీ పోలీసులు
మరో నలుగురు కాంగ్రెస్‌ నేతలకు కూడా..
రిజర్వేషన్లపై అమిత్‌షా వ్యాఖ్యలను వక్రీకరించారంటూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, భాజపా ఫిర్యాదు.. కేసు నమోదు

ఈనాడు, హైదరాబాద్‌: రిజర్వేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, ఫేక్‌ వీడియోను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారనే అభియోగంతో తెలంగాణ సీఎం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు మరో నలుగురు కాంగ్రెస్‌ నేతలకు దిల్లీ పోలీసులు సోమవారం నోటీసులు అందజేశారు. మే 1న ఉదయం 10.30 గంటలకు దిల్లీ ద్వారకా సెక్టార్‌లోని పోలీస్‌ ప్రత్యేక విభాగంలో విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా విభాగం ఛైర్మన్‌ మన్నె సతీశ్‌, కోఆర్డినేటర్‌ నవీన్‌, పీసీసీ కార్యదర్శి శివకుమార్‌, అధికార ప్రతినిధి ఆస్మా తస్లీంలకు దిల్లీ పోలీస్‌ ప్రత్యేక విభాగం ఇన్‌స్పెక్టర్‌ నీరజ్‌ చౌధరీ పేరుతో ఈ నోటీసులు జారీ చేశారు. సోమవారం గాంధీభవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్‌ లీగల్‌ సెల్‌ ఇన్‌ఛార్జి రామచంద్రారెడ్డికి వీటిని నీరజ్‌ చౌధరీ అందజేశారు. నోటీసులు అందుకున్నవారు మే 1న విచారణకు హాజరు కాకపోతే సీఆర్‌పీసీ 91/160 కింద క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ ప్రకారం చర్యలు తీసుకుంటామని వాటిలో పేర్కొన్నారు. దిల్లీ పోలీస్‌ ప్రత్యేక విభాగం ఈ నెల 28న ఐటీ చట్టంతో పాటు ఐపీసీ 153, 153ఏ, 465, 469, 171జీ సెక్షన్ల కింద నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం నోటీసులు ఇస్తున్నట్లు తెలిపారు. అమిత్‌షాపై సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసిన వీడియోను, పోస్ట్‌ చేసేందుకు వినియోగించిన ల్యాప్‌టాప్‌/మొబైల్‌/ట్యాబ్లెట్‌ను, ఈ వీడియోను ఎక్కడి నుంచి తీసుకున్నారో దానికి సంబంధించిన ఎలక్ట్రానిక్‌ పరికరాన్ని విచారణకు వచ్చే సమయంలో వెంట తీసుకురావాలని సూచించారు.

ఇదీ నేపథ్యం..

రాష్ట్రంలో ఇటీవల ఓ సభలో అమిత్‌షా ప్రసంగిస్తూ ‘‘భాజపా అధికారంలోకి వస్తే రాజ్యాంగవిరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తాం. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు చెందిన ఆ హక్కులను వారికే ఇచ్చేస్తాం’’ అని చెప్పారు. దీన్ని కొంతమంది వక్రీకరించి.. రిజర్వేషన్లు అన్నింటినీ పూర్తిగా రద్దు చేస్తామని ఆయన అన్నట్లుగా వీడియోను ఎడిట్‌ చేశారని భాజపా పేర్కొంటోంది. ఎన్నికల్లో భాజపా గెలిస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ ప్రచార సభల్లో రేవంత్‌రెడ్డి సైతం ఆరోపించారు. రిజర్వేషన్లను రద్దు చేస్తామని తాను అనలేదని అమిత్‌షా వివరణ ఇచ్చారు. ఆయన వీడియోను వక్రీకరించి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేశారని దిల్లీ పోలీసులకు భాజపాతో పాటు కేంద్ర హోంమంత్రిత్వశాఖ(ఎంహెచ్‌వో) అధీనంలోని ఇండియన్‌ సైబర్‌ క్రైం కోఆర్డినేషన్‌ సెంటర్‌(ఐ4సీ) ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

అమిత్‌ షా ‘వీడియో సోర్స్‌’పై పోలీసుల దృష్టి..

అమిత్‌ షా వీడియో మూలాల(సోర్స్‌)ను తెలుసుకునేందుకు ‘ఎక్స్‌’తోపాటు ఇతర సోషల్‌ మీడియా సంస్థలకు దిల్లీ పోలీసులు లేఖ రాసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వీడియోను ఎవరు వ్యాప్తి చేశారు, మూలం ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాన్ని తెలుసుకునేందుకు స్పెషల్‌ సెల్‌కు చెందిన ఇంటెలిజెన్స్‌ ఫ్యూజన్‌ అండర్‌ స్ట్రాటజిక్‌ ఆపరేషన్స్‌ విభాగం.. సామాజిక మాధ్యమ సంస్థల నుంచి సమాచారం కోరింది. కేసుకు సంబంధించి అస్సాంలో ఒకర్ని అరెస్ట్‌ చేసినట్లు ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వశర్మ వెల్లడించారు. మరోవైపు, అమిత్‌షాకు సంబంధించి డీప్‌ ఫేక్‌, మార్ఫింగ్‌ వీడియోను ప్రచారం చేస్తున్నారని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి భాజపా ఫిర్యాదు చేసింది. తాము అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను ఎత్తివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చెబుతున్నట్టుగా ఉన్న ఫేక్‌ వీడియోను వైరల్‌ చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీపై చర్యలు తీసుకోవాలంటూ భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఫిర్యాదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img