icon icon icon
icon icon icon

ఓటమి భయంతోనే ‘రిజర్వేషన్ల రద్దు’ ఆరోపణలు

కేంద్రంలో మళ్లీ భాజపా అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ సీఎం రేవంత్‌రెడ్డి, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌లు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఎంపీ, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ మండిపడ్డారు.

Updated : 30 Apr 2024 22:22 IST

రేవంత్‌రెడ్డి, కేటీఆర్‌లపై బండి సంజయ్‌ ధ్వజం

తెలంగాణచౌక్‌ (కరీంనగర్‌), న్యూస్‌టుడే: కేంద్రంలో మళ్లీ భాజపా అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ సీఎం రేవంత్‌రెడ్డి, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌లు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఎంపీ, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ మండిపడ్డారు. ఆ ఆరోపణలను ఆయన ఖండించారు. ఓడిపోతామనే భయంతోనే కాంగ్రెస్‌, భారాసలు కుమ్మక్కై ఒకే స్వరాన్ని వినిపిస్తూ ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయని ధ్వజమెత్తారు. కరీంనగర్‌ ఎంపీ కార్యాలయంలో సంజయ్‌ సోమవారం విలేకరులతో మాట్లాడారు. ‘‘అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగానికి అనుగుణంగా రిజర్వేషన్లను కేంద్రంలోని భాజపా సర్కారు యథావిధిగా కొనసాగిస్తుంది. ఈ మాటకు మేము కట్టుబడి ఉన్నాం. ఇదే విషయంపై భాజపా తరఫున ప్రమాణం చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నా. మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని కూడా ఒప్పించి తీసుకొస్తా. తేదీ, సమయం, వేదిక మీరే నిర్ణయించండి. రాజ్యాంగస్ఫూర్తికి వ్యతిరేకమైన ముస్లిం రిజర్వేషన్లను మాత్రం రద్దు చేస్తాం. మీరు చేయగలరా? ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, మాజీ మంత్రి కేటీఆర్‌కు సవాల్‌ విసురుతున్నా.

అవినీతిపరుడినైతే ఆధారాలు ఎందుకు చూపలేదు?

నేను అవినీతిపరుడినని కేటీఆర్‌, మంత్రి పొన్నం ప్రభాకర్‌ అంటున్నారు. ఇన్నాళ్లూ అధికారంలో ఉన్నది మీరే కదా? ఎందుకు ఆధారాలు చూపలేదు. అధికారంలో ఉండి ఏంచేశారు? అవినీతి, ఆస్తులపై దేవుడి ముందు ప్రమాణం చేసేందుకు సిద్ధమా? తెలంగాణలో భారాస ఓటమిపాలు కావడానికి కారణం కేటీఆర్‌. జనం తిరస్కరించినా ఆయన అహంకారం తగ్గలేదు. అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్‌ చేసిన అవినీతి, అక్రమాల చిట్టా బయటకు తెస్తా. నేను కిందిస్థాయి నుంచి కష్టపడి రాజకీయాల్లో పైకి వచ్చా. గాలి మాటలు చెప్పి రూ.వేల కోట్లు దోచుకోవడం, లిక్కర్‌ దందాలు చేయడం నాకు తెలియదు. ప్రజా సమస్యలపై పోరాటం చేసి లాఠీ దెబ్బలు తిన్నా.. వందల కేసులు పెట్టినా భయపడకుండా పోరాటం చేశా’’ అని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img