icon icon icon
icon icon icon

సీఎం బహిరంగ క్షమాపణ చెప్పాలి

పేదలకు రిజర్వేషన్లు తీసేస్తారని, హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మారుస్తారని తప్పుడు ప్రచారం చేస్తూ కాంగ్రెస్‌, భారాసలు తలాతోకా లేకుండా వ్యవహరిస్తున్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు.

Updated : 30 Apr 2024 22:22 IST

రిజర్వేషన్లపై రేవంత్‌రెడ్డి తప్పుడు ప్రచారం
భాజపాను ఓడించేందుకు కాంగ్రెస్‌, భారాస, ఎంఐఎం కుట్రలు
కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు
కమలం గూటికి ఎంపీ వెంకటేశ్‌ నేత, పెద్దిరెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: పేదలకు రిజర్వేషన్లు తీసేస్తారని, హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మారుస్తారని తప్పుడు ప్రచారం చేస్తూ కాంగ్రెస్‌, భారాసలు తలాతోకా లేకుండా వ్యవహరిస్తున్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. భాజపాను ఓడించడం, ప్రధాని మోదీని అడ్డుకోవడమే లక్ష్యంగా ఆ రెండు పార్టీలతో పాటు ఎంఐఎం కుట్ర చేస్తున్నాయన్నారు. రిజర్వేషన్లపై సీఎం రేవంత్‌రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఆయనకు నైతికత ఉంటే చేసిన ఆరోపణల్ని వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. సోమవారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి, మరో కేంద్ర మంత్రి ఎల్‌.మురుగన్‌ సమక్షంలో పెద్దపల్లి సిటింగ్‌ ఎంపీ వెంకటేశ్‌నేత, మాజీ మంత్రి ఇ.పెద్దిరెడ్డి, మంథని, భూపాలపల్లి నియోజకవర్గాలకు చెందిన భారాస, కాంగ్రెస్‌ నేతలు భాజపాలో చేరారు. అనంతరం కిషన్‌రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

మరింత సమర్థంగా రిజర్వేషన్ల అమలు

‘‘కేంద్ర మంత్రి అమిత్‌షా వ్యాఖ్యల్ని మార్ఫింగ్‌ చేయడం సాధారణ అంశం కాదు. కాంగ్రెస్‌ అధికారిక సోషల్‌ మీడియా విభాగం ద్వారా ఈ అంశాన్ని పోస్టు చేయడం అంటే ఆ పార్టీ ఎంత దిగజారిందో తెలుస్తోంది. దీనిపై న్యాయస్థానానికి వెళ్లేందుకూ వెనుకాడేది లేదు. భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌లపై సీఎం చేసిన వ్యాఖ్యలు పూర్తి నిరాధారం. ఆ వ్యాఖ్యలను ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ ఖండించారు. రిజర్వేషన్లు పోతాయంటూ బడుగుబలహీన వర్గాల్లో ఆందోళన కలిగించి, శాంతిభద్రతలకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. పేదలకు మరింత సమర్థంగా వీటి అమలుకు భాజపా కృషి చేస్తుంది. హామీల అమలులో విఫలమై రేవంత్‌రెడ్డి ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కూడా ఆయనను నమ్మడం లేదు. అబద్ధాలతో బయటపడాలని ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. తెలంగాణకు 299 టీఎంసీల కృష్ణా జలాలు చాలని సంతకం పెట్టిన మాజీ సీఎం కేసీఆర్‌ ఇప్పుడు కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కేంద్రంలో హంగ్‌ వస్తుందంటూ, చక్రం తిప్పుతానంటూ పగటికలలు కంటున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్‌, భారాస డూప్‌ ఫైటింగ్‌ చేసుకుంటూ డ్రామా ఆడుతున్నాయి’’ అని కిషన్‌రెడ్డి విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img