icon icon icon
icon icon icon

రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి

రాష్ట్రంలో భయంకరమైన రాజకీయ అనిశ్చితి నెలకొందని భారాస అధినేత కేసీఆర్‌ అన్నారు. గోదావరి జలాలు కర్ణాటక, తమిళనాడుకు మళ్లిస్తామంటున్నా.. సీఎం రేవంత్‌రెడ్డి, భాజపా ఎంపీలు నోరు మెదపటం లేదని విమర్శించారు.

Updated : 30 Apr 2024 22:23 IST

గోదావరి నీళ్లు తరలిస్తామంటున్న మోదీ..
సీఎం, భాజపా ఎంపీలు ఎందుకు స్పందించట్లేదు?
కేంద్రంలో సంకీర్ణమే.. నామా మంత్రి అవుతారు..
ఖమ్మంలో భారాస అధినేత కేసీఆర్‌

ఈటీవీ, ఖమ్మం: రాష్ట్రంలో భయంకరమైన రాజకీయ అనిశ్చితి నెలకొందని భారాస అధినేత కేసీఆర్‌ అన్నారు. గోదావరి జలాలు కర్ణాటక, తమిళనాడుకు మళ్లిస్తామంటున్నా.. సీఎం రేవంత్‌రెడ్డి, భాజపా ఎంపీలు నోరు మెదపటం లేదని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి భాజపాలోకి వెళ్తారన్న ప్రచారం జరుగుతోందని.. ఈ పరిస్థితుల్లో రాజకీయ అనిశ్చితి నెలకొందని వ్యాఖ్యానించారు. కేంద్రంలో భాజపాకు 370, 400 సీట్లు కాదు కదా.. 200 కూడా దాటే పరిస్థితి లేదని చెప్పారు. ఈసారి దేశంలో వచ్చేది ముమ్మాటికీ సంకీర్ణ ప్రభుత్వమేనన్నారు. ఆరు రోజులుగా రాష్ట్రంలో తాను చేస్తున్న రోడ్‌షోలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని.. భారాస 12 స్థానాలు గెలవటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం  ప్రజలు భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావును గెలిపిస్తే.. సంకీర్ణ ప్రభుత్వంలో  కేంద్రమంత్రి అవుతారని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రాత్రి ఖమ్మంలో నిర్వహించిన రోడ్‌షోలో కేసీఆర్‌ మాట్లాడారు.

భాజపా, కాంగ్రెస్‌లకు ఓట్లు, సీట్లే ముఖ్యం

‘భారాస హయాంలో పంజాబ్‌ను తలదన్నే స్థాయిలో తెలంగాణలో వడ్లు పండించాం. 3.5 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడులు సాధించాం. వడ్లు కొనబోమని కేంద్రం మొండికేసింది. నామా ఆధ్వర్యంలో భారాస ఎంపీలు వెళ్లి కలిస్తే.. తెలంగాణ ప్రజలు నూకలు తినండి అని కేంద్ర మంత్రి హేళన చేశారు. తెలంగాణ మంత్రివర్గం, ప్రజాప్రతినిధులు దిల్లీ వెళ్లి ధర్నా చేస్తే.. భాజపా, కాంగ్రెస్‌ ఎంపీలెవరూ నోరు తెరవలేదు. ఆ రెండు పార్టీలకు తెలంగాణ ఓట్లు, సీట్లు కావాలి. కానీ రైతుల సమస్య పట్టదు. గోదావరి నదిని ఎత్తుకుపోయి తమిళనాడు, కర్ణాటకకు నీళ్లిస్తామని మోదీ చెబుతున్నారు. అయినా ఒక్కరూ మాట్లాడటం లేదు. తెలంగాణకు ఉన్న ఒకే ఒక్క ఆశ గోదావరి. ఖమ్మం జిల్లాలో శాశ్వతంగా సాగునీటి సమస్యలు తీర్చాలని సీతారామ ప్రాజెక్టు చేపట్టాం. 37 టీఎంసీల ఈ ప్రాజెక్టు పూర్తయితే.. ఖమ్మం జిల్లాలోని సాగుభూమి అంతటికీ నీరు ఇవ్వొచ్చు. పైన ఇచ్చంపల్లి దగ్గర ప్రాజెక్టు కట్టి కర్ణాటక, తమిళనాడులకు నీరు తరలిస్తామంటుంటే.. రాష్ట్రంలోని భాజపా, కాంగ్రెస్‌ నేతలు ఎందుకు మాట్లాడటం లేదు? ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎందుకు నోరు మెదపట్లేదు? నేను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇదే ప్రతిపాదన నా దగ్గరికి వస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ రాష్ట్రానికి వచ్చే నీళ్ల లెక్క తేల్చి.. మా వాటా మాకు ఇచ్చేదాకా.. నా తల తెగిపడ్డా ఒప్పుకొనేది లేదని చెప్పాను. ఇదీ భారాస విధానం.

సంక్షేమానికి ఆద్యుడు ఎన్టీఆరే

దున్నేవానికి భూమి, తినేవానికి విస్తరాకు లాంటి ఎన్నో నినాదాలు ఇచ్చారు కాంగ్రెస్‌ నాయకులు. కానీ వీరెవరూ చేయని సంక్షేమాన్ని కేవలం ఆనాడు మహానుభావుడు ఎన్టీఆర్‌ చేసి చూపించారు. సంక్షేమం ఎన్టీఆర్‌ హయాం నుంచే మొదలైంది. పేదలకు బుక్కెడు బువ్వ దొరికింది పుణ్యాత్ముడు ఎన్టీఆర్‌ రూ.2 కిలో బియ్యం ఇచ్చాకే. రాష్ట్రంలో ఎవరు అవునన్నా కాదన్నా ఇది చరిత్ర. పక్కా గృహాలు, జనతా వస్త్రాలు, భూమిశిస్తు రద్దు వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఎన్టీఆర్‌ హయాం నుంచే మొదలయ్యాయి. కాంగ్రెస్‌ పార్టీ ఏమీ చేయలేదు. చరిత్ర తుడిచేస్తే పోయేది కాదు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఎన్టీఆర్‌ను మించిన సంక్షేమ పథకాలను భారాస ప్రభుత్వం అమలు చేసింది. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల విద్యుత్తు, పంటల కొనుగోళ్లు వంటి వెసులుబాట్లు రైతులకు కల్పించాం.

తులం బంగారం తుస్సు..

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అలవికాని హామీలిచ్చి.. వాటిని గాలికొదిలేసింది. తులం బంగారం తుస్సుమంది. ఇప్పుడు అడిగితే కాంగ్రెస్‌ కస్సుమంటుంది. కరెంటు ఎటోపోయింది. మొన్న మహబూబ్‌నగర్‌లో శ్రీనివాస్‌గౌడ్‌ ఇంట్లో నేను భోజనం చేస్తుండగా కరెంటు పోయిందని చెబితే.. అబద్ధాలు ఆడుతున్నానని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి నీళ్లిచ్చే దిక్కు లేదు. విద్యార్థులు రోడ్లపైకి పైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. నాడు భారాస హయాంలో వరి కోతలు ఉంటే.. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో నిత్యం కరెంటు కోతలు ఉంటున్నాయి. మోసపూరిత హామీలిచ్చి అమలు చేయకుండా, ఒట్లు పెట్టుకుంటూ తిరుగుతున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. రైతు రుణమాఫీ, ఆరు గ్యారంటీలను ఆగస్టు 15 లోగా అమలు చేస్తే రాజీనామా చేస్తానంటూ హరీశ్‌రావు సవాల్‌ విసిరితే సీఎం ఎందుకు వెళ్లలేదు? హామీలు అమలు చేసే వరకు పోరాడతాం. కాంగ్రెస్‌ మెడలు వంచాలంటే భారాసకు బలం ఇవ్వాలి’ అని ప్రజలకు కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు.


ఖమ్మం శ్రేణుల ఘనస్వాగతం

అంతకుముందు వరంగల్‌ జిల్లా నుంచి ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించిన కేసీఆర్‌కు భారాస శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. నగరం గులాబీమయంగా మారింది. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, ప్రజలకు కేసీఆర్‌ అభివాదం చేశారు. రోడ్‌షోలో ఖమ్మం లోక్‌సభ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, మాలోత్‌ కవిత, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌, నేతలు సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఇంట్లో కేసీఆర్‌ రాత్రి బస చేశారు. ఈ సందర్భంగా పార్టీ ముఖ్యనేతలతో తాజా రాజకీయ పరిస్థితులపై సమీక్షించారు. లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img