icon icon icon
icon icon icon

జైలు.. లేదంటే బెయిలు

దేశంలో అవినీతి నేతలంతా ఏకమై ఇండి కూటమి పేరుతో ముందుకు వెళ్తున్నారని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఆ కూటమిలోని నేతలు కొందరు జైలులో ఉండగా మిగిలిన వారంతా బెయిల్‌పై ఉన్నవారే అని ఎద్దేవా చేశారు.

Updated : 30 Apr 2024 22:26 IST

ఇండి కూటమి నేతల పరిస్థితి ఇదే
అవినీతిలో నాడు భారాస...నేడు కాంగ్రెస్‌
అభివృద్ధి సంకల్పం కమలం సొంతం
కొత్తగూడెం, మహబూబాబాద్‌, నిజాంపేట సభల్లో జేపీ నడ్డా

ఈనాడు, మహబూబాబాద్‌; ఈనాడు డిజిటల్‌, కొత్తగూడెం; నిజాంపేట, న్యూస్‌టుడే: దేశంలో అవినీతి నేతలంతా ఏకమై ఇండి కూటమి పేరుతో ముందుకు వెళ్తున్నారని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఆ కూటమిలోని నేతలు కొందరు జైలులో ఉండగా మిగిలిన వారంతా బెయిల్‌పై ఉన్నవారే అని ఎద్దేవా చేశారు. ఆ నేతలది అవినీతి బంధమని మండిపడ్డారు. వారంతా కుటుంబ పార్టీల వారసత్వాన్ని కాపాడుకునేందుకు జత కట్టారని అన్నారు. ఆ కూటమితో అవినీతి, సంఘ వ్యతిరేక శక్తులన్నీ ఏకమయ్యాయని విమర్శించారు. కాంగ్రెస్‌ పాలన అంతా అవినీతి, కుంభకోణాల మయమేనని అన్నారు. భాజపా ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కొత్తగూడెం, మహబూబాబాద్‌లలో నిర్వహించిన బహిరంగ సభల్లో నడ్డా ప్రసంగించారు. మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలోని నిజాంపేటలో జరిగిన రోడ్‌షో అనంతరం మాట్లాడారు. కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ బెయిల్‌పై ఉంటే ఆప్‌ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, ఝార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌సోరెన్‌, ఆప్‌ నేతలు సిసోదియా, సత్యేంద్రజైన్‌ జైలులో ఉన్నారని గుర్తుంచుకోవాలన్నారు. ‘‘కాంగ్రెస్‌, డీఎంకే, తృణమూల్‌, ఆర్జేడీ.. అన్నీ అవినీతి, కుంభకోణాల పార్టీలే. లాలూప్రసాద్‌ యాదవ్‌, కేజ్రీవాల్‌, కేసీఆర్‌, ఆయన కుమార్తె కవిత.. ఇలా ప్రతి ఒక్కరిదీ అవినీతి చరిత్రే. కవిత దిల్లీ మద్యం కుంభకోణంలో జైలులో ఉన్నారు. పదేళ్లుగా దేశం, రాష్ట్రాల అభివృద్ధి లక్ష్యంగా కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. అవినీతికి ముగింపు పలకడం ప్రధాని లక్ష్యం. అవినీతిని సహించేది లేదు...అవినీతిపరులను వదిలిపెట్టేదిలేదనేది ఆయన విధానం. తెలంగాణలో గతంలో భారాస ప్రభుత్వ అవినీతిని చూశాం. ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వ అవినీతిని, అసమర్థ పాలనను చూస్తున్నాం. మతపరమైన ముస్లిం రిజర్వేషన్లతో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను తగ్గించారు. సంపదపై పన్ను వేసే ఆలోచన  కాంగ్రెస్‌ చేయడం బాధాకరం. మూడోసారి కూడా కేంద్రంలో ప్రధాని మోదీ నేతృత్వంలో భాజపా ప్రభుత్వం రావడం ఖాయం. కర్ణాటకలో ఓబీసీల నుంచి రిజర్వేషన్లు తీసుకుని ముస్లింలకు 4 శాతం ఇవ్వగా.. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు లాక్కుని 4 శాతం కల్పించడం అన్యాయం. ఇలాంటి ప్రభుత్వాలను ఉండనీయొద్దు. మతం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించవద్దని అంబేడ్కర్‌ చెప్పారు. కులమతాలకు అతీతంగా.. పేదరికం ఆధారంగా సామాజిక న్యాయం జరగాలి.

రాష్ట్ర అభివృద్ధికి అన్ని విధాలా తోడ్పాటు

తెలంగాణలో పదేళ్లుగా భాజపాయేతర ప్రభుత్వాలు ఉన్నా కూడా కేంద్ర పన్నుల వాటా, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ నిధులు మూడు రెట్లు పెరిగాయి. రాష్ట్రానికి కేంద్రం అన్ని విధాలా తోడ్పాటును అందిస్తోంది. అభివృద్ధి సంకల్పం కమలం సొంతం. పదేళ్లుగా శక్తిమంతమైన భాజపా ప్రభుత్వం చెప్పింది చేసింది.  గతంలో భారత్‌పై తరచూ పాకిస్థాన్‌ దాడి చేసేది. అలాంటి వారి మీద ఒక్క తూటా పేలాలన్నా.. దిల్లీ నుంచి ఆదేశాల కోసం సైనికులు ఎదురుచూసేవారు. ఇప్పుడు తుపాకీ శబ్దం వినిపిస్తే ఆ ప్రాంతాన్ని గాలించి మరీ శత్రువులను తుదముట్టించే వరకూ నేరుగా సైనికులకు అధికారాలు ఇచ్చిన ఘనత మోదీది. బలహీనమైన కాంగ్రెస్‌ ప్రభుత్వం గతంలో ఉగ్రవాదులతో చర్చిస్తూ కాలం వెళ్లదీసింది.

మూడు కోట్ల ఇళ్లను నిర్మిస్తాం

ప్రపంచ దేశాలన్నీ కరోనా తర్వాత ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటే భారతదేశం మాత్రమే ఆర్థికాభివృద్ధిలో పరుగులు తీస్తోంది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ప్రపంచంలో 11వ స్థానం నుంచి ఐదో స్థానానికి చేరిన మనదేశం రెండేళ్లలో మూడో అతిపెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం దేశంలో పదేళ్లలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలుచేసింది. పేదలకు నాలుగు కోట్ల ఇళ్లను నిర్మించింది. ఈ సారి గెలిచి రానున్న ఐదేళ్లలో మరో మూడు కోట్ల ఇళ్లను నిర్మిస్తాం. నిజాంపేటలో మీ ఉత్సాహం చూస్తుంటే.. ఈటల రాజేందర్‌ను లోక్‌సభకు పంపాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. పార్లమెంటుకు రాజేందర్‌ను, కిషన్‌రెడ్డిని పంపడమే కాదు.. నరేంద్ర మోదీని మరోసారి ప్రధానమంత్రిని చేసి వికసిత్‌ భారత్‌ నిర్మాణంలో భాగస్వాములు కావాలి’’ అని నడ్డా కోరారు. సభల్లో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌, ఖమ్మం, మహబూబాబాద్‌ భాజపా అభ్యర్థులు టి.వినోద్‌రావు, అజ్మీరా సీతారాంనాయక్‌, భాజపా నేతలు గరికపాటి మోహన్‌రావు, ప్రేమేందర్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్‌లో జరిగిన రోడ్‌ షోలో పార్టీ ఫ్లోర్‌ లీడర్‌ మహేశ్వర్‌రెడ్డి, నాయకులు మాధవి, ఎస్‌.మల్లారెడ్డి, ఆకుల సతీష్‌ పాల్గొన్నారు.

భాజపాకే మెజారిటీ సీట్లు: కిషన్‌రెడ్డి

తెలంగాణలో మెజారిటీ సీట్లను భాజపా సొంతం చేసుకుంటుందని.. కాంగ్రెస్‌, భారాస పార్టీలకు డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానం భాజపా అభ్యర్థి, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. దేశమంతటా వీస్తున్న ప్రధాని మోదీ ప్రభంజనాన్ని చూసి రాష్ట్రంలోని ప్రధాన పార్టీల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు.

ముస్ల్లిం ఆడబిడ్డలకు భద్రత కల్పించింది మేమే: ఈటల

దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోలేని ట్రిపుల్‌ తలాక్‌ను రద్దు చేసి ముస్ల్లిం ఆడబిడ్డలకు భద్రత కల్పించింది భాజపాయేనని మల్కాజిగిరి అభ్యర్థి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. మూడోసారి కూడా మోదీ ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img