icon icon icon
icon icon icon

నేడు మెదక్‌ జిల్లాలో ప్రధాని మోదీ సభ

భాజపా మెదక్‌, జహీరాబాద్‌ లోక్‌సభ అభ్యర్థులు రఘునందన్‌రావు, బీబీ పాటిల్‌లకు మద్దతుగా మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. మెదక్‌ జిల్లా అందోలు నియోజకవర్గం అల్లాదుర్గం మండలం చిల్వర గ్రామ శివారు ఐబీ చౌరస్తాలో మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు జరగనున్న ఈ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Updated : 30 Apr 2024 22:39 IST

ఈనాడు, హైదరాబాద్‌; అల్లాదుర్గం, జోగిపేట, న్యూస్‌టుడే: భాజపా మెదక్‌, జహీరాబాద్‌ లోక్‌సభ అభ్యర్థులు రఘునందన్‌రావు, బీబీ పాటిల్‌లకు మద్దతుగా మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. మెదక్‌ జిల్లా అందోలు నియోజకవర్గం అల్లాదుర్గం మండలం చిల్వర గ్రామ శివారు ఐబీ చౌరస్తాలో మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు జరగనున్న ఈ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మెదక్‌, జహీరాబాద్‌ లోక్‌సభ స్థానాలకు సంబంధించి 14 అసెంబ్లీ నియోజకవర్గాలు.. మెదక్‌, నర్సాపూర్‌, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్‌, సంగారెడ్డి, పటాన్‌చెరు, జహీరాబాద్‌, నారాయణఖేడ్‌, అందోలు, జుక్కల్‌, ఎల్లారెడ్డి, బాన్సువాడ, కామారెడ్డికి చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు సభకు హాజరు కానున్నారని భాజపా నాయకులు తెలిపారు. 30 ఎకరాల్లో సభ నిర్వహిస్తున్నామని వివరించారు. 1,400 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. 3 హెలిప్యాడ్‌లు నిర్మించారు. ప్రధాని ప్రత్యేక హెలికాప్టర్‌లో మహారాష్ట్రలోని లాతూర్‌ నుంచి మధ్యాహ్నం 3.20గంటలకు బయల్దేరి సాయంత్రం 4.20కి సభాస్థలికి చేరుకుంటారు. 4.30 గంటల నుంచి 5.25గంటల వరకు బహిరంగసభలో పాల్గొంటారు. అనంతరం హెలికాప్టర్‌లో 5.55 గంటలకు దుండిగల్‌ విమానాశ్రయం చేరుకుని అక్కడినుంచి దిల్లీకి వెళ్తారు.

8న వేములవాడకు...

తెలంగాణచౌక్‌(కరీంనగర్‌), న్యూస్‌టుడే: మోదీ మే 8న కరీంనగర్‌ నియోజకవర్గంలోని వేములవాడకు వస్తున్నారని ఎంపీ, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ తెలిపారు. సోమవారం ఎంపీ కార్యాలయంలో ఆయన కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ శక్తి కేంద్ర ఇన్‌ఛార్జులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడుతూ.. ప్రధాని పాల్గొనే సభాస్థలిని ఎంపిక చేసేందుకు మంగళవారం మధ్యాహ్నం వేములవాడకు వెళ్లనున్నట్లు చెప్పారు.

1, 5 తేదీల్లో అమిత్‌షా ప్రచారం

భాజపా అగ్రనేత, కేంద్రం హోం మంత్రి అమిత్‌షా మే 1, 5 తేదీల్లో రెండు విడతలుగా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని భాజపా రాష్ట్ర ప్రధానకార్యదర్శి జి.ప్రేమేందర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో, 5వ తేదీ నిజామాబాద్‌, సికింద్రాబాద్‌, మల్కాజిగిరి లోక్‌సభ స్థానాల్లో ప్రచారంలో అమిత్‌ షాపాల్గొంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img