icon icon icon
icon icon icon

సీఎం రేవంత్‌రెడ్డిని అరెస్టు చేయాలి

‘అబద్ధపు ప్రచారం కేసులో దిల్లీ పోలీసులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సోమవారం నోటీసులు జారీ చేశారు. ఇలాంటి కేసులో గతంలో అస్సాంకు చెందిన ఒకరిని అరెస్టు చేశారు. ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డిని కూడా అరెస్టు చేయాలి.

Updated : 30 Apr 2024 22:47 IST

అబద్ధపు ప్రచారం కేసులో దిల్లీ పోలీసుల నోటీసులు
మాజీ మంత్రి హరీశ్‌రావు

సంగారెడ్డి టౌన్‌, సదాశివపేట, న్యూస్‌టుడే: ‘అబద్ధపు ప్రచారం కేసులో దిల్లీ పోలీసులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సోమవారం నోటీసులు జారీ చేశారు. ఇలాంటి కేసులో గతంలో అస్సాంకు చెందిన ఒకరిని అరెస్టు చేశారు. ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డిని కూడా అరెస్టు చేయాలి. లేదంటే ప్రధాని మోదీ, రేవంత్‌రెడ్డి ఇద్దరూ కలిసిపోయినట్టే’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో సోమవారం మెదక్‌ లోక్‌సభ భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా నిర్వహించిన రోడ్‌షోలో హరీశ్‌ మాట్లాడారు. ‘అసెంబ్లీ ఎన్నికల్లో ప్రామిసరీ నోట్లు.. ఇప్పుడు గాడ్‌ ప్రామిస్‌ల’తో ఓట్లు అడుగుతున్న కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ‘పొద్దున లేచి టీవీ ఆన్‌ చేస్తే అయితే తిట్లు.. లేకపోతే ఒట్లు’.. ఇదీ కాంగ్రెస్‌ పాలన తీరు అని దుయ్యబట్టారు. 100 రోజుల్లో హామీలను అమలు చేస్తామని బాండ్‌ పేపరు రాసిచ్చి.. అధికారంలోకి వచ్చి 140 రోజులు గడచినా ఒక్క హామీనీ అమలు చేయకుండా మోసగించిన కాంగ్రెస్‌ను ఏం చేయాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ధరలు ఆకాశాన్ని అంటాయని, ఆ పార్టీకి మరోసారి ఓటు వేస్తే వారి అబద్ధాలను ఆమోదించినట్టేనని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ మీద కోపంతో భాజపాకు ఓటు వేస్తే పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టేనని ఎద్దేవా చేశారు. భాజపా నేతలు దేవుడి పేరుతో ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. అందరూ దేవుడిని మొక్కుతారని, తాను కూడా నిత్యం ఉదయం హనుమాన్‌ చాలీసా పారాయణ చేశాకే ఇంటి నుంచి బయటకు వస్తానని పేర్కొన్నారు. పదేళ్ల పాలనలో సామాన్య ప్రజలకు భాజపా చేసింది శూన్యమన్నారు. కార్యక్రమంలో అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img