icon icon icon
icon icon icon

రిజర్వేషన్ల పరిరక్షణకు ప్రతి ఊళ్లో జేఏసీలు నెలకొల్పాలి

రిజర్వేషన్ల జోలికొస్తే మాడి మసైపోతారని మంత్రి పొన్నం ప్రభాకర్‌ భాజపా నేతలను హెచ్చరించారు. మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం, రిజర్వేషన్ల రద్దుకు కుట్ర చేస్తున్న ఆ పార్టీకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు లోక్‌సభ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కోరారు.

Updated : 30 Apr 2024 22:50 IST

మంత్రి పొన్నం ప్రభాకర్‌

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: రిజర్వేషన్ల జోలికొస్తే మాడి మసైపోతారని మంత్రి పొన్నం ప్రభాకర్‌ భాజపా నేతలను హెచ్చరించారు. మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం, రిజర్వేషన్ల రద్దుకు కుట్ర చేస్తున్న ఆ పార్టీకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు లోక్‌సభ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కోరారు. రిజర్వేషన్లను కాపాడుకోవడానికి ప్రతి ఊళ్లో జేఏసీలు ఏర్పాటు చేసుకొని పోరాడదామని పిలుపునిచ్చారు. సోమవారం గాంధీభవన్‌లో ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య ఆధ్వర్యంలో, పీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్‌ అధ్యక్షతన కురుమ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌ రాష్ట్ర మొట్టమొదటి కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు కొల్లూరు మల్లప్ప ఫొటోను ఆవిష్కరించారు. తమ సామాజిక వర్గానికి 2 ఎమ్మెల్సీలు, 1 రాజ్యసభ, 5 కార్పొరేషన్‌ పదవులు కేటాయించడంతోపాటు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని కురుమ నాయకులు కోరారు. ఈ సందర్భంగా ఆత్మీయ సమ్మేళనంలో, అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడారు. ‘ఇప్పటికే గొల్ల, కురుమ కార్పొరేషన్‌ నెలకొల్పాం. ప్రత్యేకంగా కురుమ కార్పొరేషన్‌ ఏర్పాటుపై సీఎంతో మాట్లాడగా సానుకూలంగా స్పందించారు. ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత ఏర్పాటు చేస్తాం. భాజపా బీసీలకు వ్యతిరేకం. ఒక బీసీ బిడ్డగా కోరుతున్నా.. ఆత్మగౌరవం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు రిజర్వేషన్ల కోసం పోరాడటానికి సిద్ధం కావాలి’ అని పొన్నం పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీలు మహేశ్‌కుమార్‌గౌడ్‌, బల్మూరి వెంకట్‌, ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాస్కీగౌడ్‌, పీసీసీ అధికార ప్రతినిధులు అద్దంకి దయాకర్‌, గద్వాల జడ్పీ ఛైర్‌పర్సన్‌ సరితా తిరుపతయ్య, కురుమ సంఘం కాంగ్రెస్‌ నేతలు తూంకుంట అరుణ్‌కుమార్‌, భూమన్న, గొరిగె మల్లేశ్‌, శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img