icon icon icon
icon icon icon

కాంగ్రెస్‌లో చేరిన గుత్తా అమిత్‌

శాసన మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి తనయుడు, భారాస నేత గుత్తా అమిత్‌ సోమవారం సీఎం నివాసానికి వచ్చి కాంగ్రెస్‌లో చేరారు. ఆయనకు సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Updated : 30 Apr 2024 22:52 IST

ఈనాడు, హైదరాబాద్‌: శాసన మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి తనయుడు, భారాస నేత గుత్తా అమిత్‌ సోమవారం సీఎం నివాసానికి వచ్చి కాంగ్రెస్‌లో చేరారు. ఆయనకు సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఖైరతాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రోహిన్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నికల్లో పార్టీ  తరపున ప్రచారం చేసి విజయానికి కృషి చేయాలని అమిత్‌కు సీఎం సూచించారు. గుత్తా సుఖేందర్‌రెడ్డి గతంలో కాంగ్రెస్‌ నుంచి భారాసకు వెళ్లారు. ఆయన ప్రస్తుత ఎన్నికల్లో భారాస తరపున ఎంపీ టికెట్‌, అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్‌ ఆశించారు. భారాసలో సరైన ప్రాధాన్యం దక్కట్లేదని కేసీఆర్‌ కుటుంబంపై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన తనయుడు కాంగ్రెస్‌లో చేరడం గమనార్హం.

భాజపా ఎన్నారై సంయుక్త కన్వీనర్‌ ఎన్‌.దేవేందర్‌రెడ్డి, ఆయన సోదరుడు బాచిరెడ్డిలు సోమవారం దీపా దాస్‌మున్షీ నివాసానికి వచ్చి కాంగ్రెస్‌లో చేరారు. ఆమె వారికి కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

భవిష్యత్తులో మాదిగలకు మంచి అవకాశాలు: సీఎం

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: భవిష్యత్తులో మాదిగలకు మంచి రాజకీయ అవకాశాలు కల్పిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం హైదరాబాద్‌లోని రేవంత్‌రెడ్డి నివాసంలో ఆయనతోపాటు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీలను మాదిగ, మాదిగ ఉపకులాల దండోరా నాయకుడు, మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్‌, తెలంగాణ మాదిగ దండోరా నాయకులు సతీష్‌ మాదిగ, ప్రజాసంఘాల జేఏసీ ఛైర్మన్‌ గజ్జెల కాంతం, మాదిగ హక్కుల దండోరా నాయకులు కనకరాజు, ఎస్సీ-57 ఉపకులాల వేదిక నాయకుడు రాజలింగం తదితరులు కలిశారు. లోక్‌సభ సీట్ల కేటాయింపులో మాదిగలకు అన్యాయం జరిగిందని.. వారి గురించి సీఎం మనస్సులో ఏముందో ప్రకటించాలని కోరారు. దీనిపై రేవంత్‌రెడ్డి స్పందిస్తూ.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్‌, ప్రియాంకా గాంధీల దృష్టికి తీసుకెళ్తానని.. త్వరలోనే మంచి వార్త వింటారని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img