icon icon icon
icon icon icon

హామీల అమలుపై కేసీఆర్‌ మాట్లాడటం విడ్డూరం: భట్టి

పదేళ్లు అధికారంలో ఉండి వాగ్దానాల అమల్లో విఫలమైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఇచ్చిన హామీలను అతితక్కువ కాలంలోనే అమలు చేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు.

Published : 01 May 2024 03:07 IST

కూసుమంచి, న్యూస్‌టుడే: పదేళ్లు అధికారంలో ఉండి వాగ్దానాల అమల్లో విఫలమైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఇచ్చిన హామీలను అతితక్కువ కాలంలోనే అమలు చేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఖమ్మం పార్లమెంటు కాంగ్రెస్‌ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా కూసుమంచి కూడలిలో మంగళవారం నిర్వహించిన సభలో భట్టి మాట్లాడారు. ‘హామీలు అమలు చేయడంతోపాటు ఏడాది కాలంగా పెండింగ్‌లో ఉన్న వసతిగృహ విద్యార్థుల మెస్‌ఛార్జీలు, మధ్యాహ్న భోజన వర్కర్ల వేతనాలు చెల్లించాం. 65 లక్షల మంది రైతులకు రైతుబంధు అందించాం. పంట నష్టపరిహారం  రూ.15 వేల చొప్పున చెల్లించేందుకు సిద్ధం చేశాం. ఉద్యోగుల వేతనాలు, పింఛన్లు ఒకటో తేదీనే ఇస్తున్నాం. త్వరలోనే రైతు రుణమాఫీ చేయనున్నాం. ఇంత చేస్తున్నా హామీలను అమలుపర్చడం లేదని కేసీఆర్‌ ఆరోపించడం సిగ్గుచేటు’ అని విమర్శించారు. రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి మాట్లాడుతూ.. భారాస అబద్ధాలను ప్రచారం చేస్తోందని విమర్శించారు. ఖమ్మం అంటేనే కాంగ్రెస్‌ జిల్లా అని... తాను, ముగ్గురు మంత్రులకు తోడు ఎంపీగా రఘురాంరెడ్డిని గెలిపించుకుంటే మరింత మేలు చేకూరుతుందన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ప్రజాసంక్షేమ పాలన కోసం కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుందామని పిలుపునిచ్చారు. మత, ప్రాంత విద్వేషాలను రెచ్చగొట్టే భాజపాతో అంటకాగుతున్న భారాసకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. అభ్యర్థి రఘురాంరెడ్డి,  మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, నాయకులు మద్దినేని స్వర్ణకుమారి, హఫీజుద్దీన్‌, పోట్ల నాగేశ్వరరావు, రాయల నాగేశ్వరరావు, మట్టే గుర్వయ్య, రామసహాయం మాధవీరెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img