icon icon icon
icon icon icon

తప్పుడు ప్రచారాలపై డేగ కన్ను

తమ గురించి తాము చెప్పుకోవడం ప్రచారం. ఎదుటివారు అనని మాటలు అన్నట్లు చెప్పడం దుష్ప్రచారం. ఒకప్పుడు ఇలాంటివి ఎవరూ నమ్మేవారు కాదు.

Published : 01 May 2024 03:07 IST

సోషల్‌ మీడియాలో పోస్టులను గమనిస్తున్న పోలీసులు

ఈనాడు, హైదరాబాద్‌: తమ గురించి తాము చెప్పుకోవడం ప్రచారం. ఎదుటివారు అనని మాటలు అన్నట్లు చెప్పడం దుష్ప్రచారం. ఒకప్పుడు ఇలాంటివి ఎవరూ నమ్మేవారు కాదు. కానీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత నమ్మించడం సులభమైంది. సామాజిక మాధ్యమాల మాటున జరుగుతున్న ఇలాంటి తప్పుడు ప్రచారాల వల్ల అనర్థాలు తలెత్తుతున్నాయని గ్రహించిన తెలంగాణ పోలీసుశాఖ, వాటిని పసిగట్టేందుకు గతంలోనే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రతి జిల్లా కేంద్రంలోనూ సామాజిక మాధ్యమాల పర్యవేక్షణ కేంద్రాలను నెలకొల్పింది. కొంత కాలంగా స్తబ్దుగా ఉన్న ఈ కేంద్రాలను తాజా పరిణామాల నేపథ్యంలో ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు. సోషల్‌ మీడియాలో పోస్టులను నిశితంగా గమనించాలని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఎన్నికలప్పుడు ఒకరిమీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటుంటారు. అసలు ఇలాంటి పోస్టులు తయారు చేసేందుకు పార్టీలు, నాయకులు పెద్ద వ్యవస్థలనే ఏర్పాటు చేసుకుంటున్నారు.

2023లో 1,38,783 అనుమానాస్పద పోస్టులు

మామూలు సమయాల్లో కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు అనేక మంది పోస్టులు పెడుతుంటారు. ఉదాహరణకు రాష్ట్రంలో వందల సంఖ్యలో మహిళలు, యువతులు కనిపించకుండా పోతున్నారని సామాజిక మాధ్యమాల్లో జరిగిన ప్రచారం తదనంతరం రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధానికి, ప్రజల్లో భయాందోళనలకు కారణమైంది. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ పోస్టులు పెట్టిన హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు యువకులను అరెస్టు చేశారు. మత సంబంధమైన వ్యాఖ్యలకు సంబంధించి గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అరెస్టై జైల్లో ఉన్నప్పుడు, ఆయన బంధువు మతం మారినట్లు వీడియో తయారు చేసి సోషల్‌ మీడియాలో ప్రసారం చేశారు. అది మత ఉద్రిక్తతలకు దారితీసింది. దాంతో హైదరాబాద్‌ పోలీసులు బహిరంగంగా ప్రకటన ఇచ్చారు. తప్పుడు సమాచారం ప్రసారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆ తరహా ఉదంతాలు కోకొల్లలు. శాంతిభద్రతలకు భంగకరంగా ఉన్న పోస్టులను గుర్తించి, తగిన చర్యలు తీసుకునేలా తొలుత హైదరాబాద్‌లో ప్రత్యేకంగా పర్యవేక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత జిల్లా కేంద్రాల్లోనూ నెలకొల్పారు. 2022 నుంచి అవి పనిచేస్తుండగా ఆ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 1,16,431 అనుమానాస్పద పోస్టుల్ని గమనించారు. వాటిని తొలగించడమో, బాధ్యుల్ని గుర్తించి హెచ్చరించడమో, వారిపై కేసులు పెట్టడమో చేశారు. 2023లో 1,38,783 పోస్టులదీ ఇదే పరిస్థితి. అయితే గత కొంతకాలంగా జిల్లాల్లోని ఈ కేంద్రాలు కొంత స్తబ్దుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు మళ్లీ వాటిని అప్రమత్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img