icon icon icon
icon icon icon

గడప గడపకూ భారాస

ఇటీవల శాసనసభ ఎన్నికల్లో ఓటమిని పక్కనబెట్టి.. ఈ లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా భారాస పూర్తి స్థాయిలో సమాయత్తమవుతోంది.

Updated : 01 May 2024 05:40 IST

లోక్‌సభలో తెలంగాణ గొంతుకకు అవకాశమివ్వాలని విన్నపం
 క్షేత్రస్థాయిలో గులాబీ దళం ప్రచారం

ఈనాడు-హైదరాబాద్‌: ఇటీవల శాసనసభ ఎన్నికల్లో ఓటమిని పక్కనబెట్టి.. ఈ లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా భారాస పూర్తి స్థాయిలో సమాయత్తమవుతోంది. ఎన్నికల ప్రచారానికి గడువు మరో 11 రోజులే ఉండడంతో.. ప్రజాక్షేత్రంలో ఈ అంకాన్ని బలంగా నిర్వహించేందుకు పక్కా ప్రణాళిక రూపొందించింది. గడప గడపకూ పార్టీ శ్రేణులు వెళ్లాలన్నది లక్ష్యం. కాంగ్రెస్‌ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని, భారాస ప్రభుత్వ పథకాలను అమలు చేయడం లేదని ప్రధానంగా ఓటర్ల ముందు ప్రస్తావించేలా.. పార్టీ నాయకులు, కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. పోలింగ్‌కు గడువు సమీపిస్తుండడంతో.. వేర్వేరు స్థాయుల్లో ప్రచారాన్ని ఉద్ధృతంగా కొనసాగించాలని అధిష్ఠానం నిర్ణయించింది.

గ్రామ స్థాయి నాయకులతోనూ కేసీఆర్‌ భేటీ

మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ గెలుపు అవకాశాలు అధికంగా ఉంటాయని పార్టీ భావిస్తుందో.. ఆయా నియోజకవర్గాలపై భారాస ఎక్కువగా దృష్టి కేంద్రీకరించింది. అధినేత కేసీఆర్‌ రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. ప్రతి రోజు ఉదయం.. సాయంత్రం రోడ్‌షోలు, కార్నర్‌ మీటింగ్‌ల అనంతరం మండల, గ్రామ స్థాయి నాయకులతోనూ కేసీఆర్‌ సమావేశమవుతున్నారు. ఓటర్లకు చేరువ కావడానికి ఏం చేయాలనే దానిపై మార్గనిర్దేశం చేస్తున్నారు. మరోవైపు కేటీఆర్‌, హరీశ్‌రావులు కూడా వేర్వేరుగా ప్రచారాలను కొనసాగిస్తున్నారు.

బూత్‌ స్థాయిలో ప్రణాళికలు సిద్ధం

మొదటిదశలో లోక్‌సభ నియోజకవర్గ స్థాయిలో ఇప్పటికే పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలతో కేసీఆర్‌ సమావేశాలు పూర్తయ్యాయి. రెండోదశలో అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో  సుమారు 2-3 వేల మంది ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కేటీఆర్‌, హరీశ్‌రావు సమావేశాలను నిర్వహించి, వారిని కార్యోన్ముఖులను చేశారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జులుగా పార్టీ ఎమ్మెల్యేలకు, శాసనసభ్యులు లేని చోట ఎమ్మెల్సీలు లేదా మాజీ ఎమ్మెల్యేలకు భారాస సమన్వయ బాధ్యతలు అప్పగించింది. మూడోదశలో ప్రస్తుతం వారు మండల స్థాయి నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు కొనసాగిస్తున్నారు. వాటితో పాటు గ్రామాల్లో పర్యటిస్తూ స్థానిక ముఖ్య నాయకులను కలుస్తూ మద్దతు కూడగడుతున్నారు. కుల, యువజన, కార్మిక, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులతోనూ భేటీ అవుతున్నారు. వచ్చే పది రోజుల్లో ప్రచారాన్ని మరింత ఉద్ధృతం చేసి, బూత్‌ స్థాయిలోనూ ఓటర్లను కలవడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు.  ప్రజలను ఓటు అభ్యర్థించే క్రమంలో గత పదేళ్ల భారాస పాలనలో సంక్షేమ, అభివృద్ధి పనులను గుర్తు చేయడంతో పాటు.. ప్రస్తుతం ఆయా కార్యక్రమాలు అమలవుతున్నాయా అనే కోణంలో ప్రచారానికి ప్రాధాన్యమిస్తున్నారు. కరపత్రాలను కూడా ముద్రించి ఓటర్లకు పంచుతున్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం గత పదేళ్లలో తెలంగాణకు ఏమీ చేయలేదని చెబుతూ.. లోక్‌సభలో తెలంగాణ పక్షాన కొట్లాడే గొంతుకకు అవకాశమివ్వాలని కోరుతున్నారు.

అసంతృప్తులకు బుజ్జగింపులు

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కొందరు భారాస అభ్యర్థులు, మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తుత ఎంపీ ఎన్నికల్లో చురుగ్గా పాల్గొనడం లేదు. ఈ ప్రభావం పార్టీ ఎన్నికల ప్రచారంపై పడకుండా అధిష్ఠానం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. ఎక్కడైనా ఎమ్మెల్యే, దిగువ స్థాయి ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు వేరే పార్టీల్లో చేరిన చోట్ల.. స్థానికంగా చురుగ్గా ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులను ప్రోత్సహిస్తున్నారు. ఇదే సమయంలో పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్న నేతలను బుజ్జగిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img