icon icon icon
icon icon icon

ప్రతి ఓటరును కలిసేలా కమల వ్యూహం

లోక్‌సభ ఎన్నికలలో ప్రతి ఓటరును కలిసే పక్కా ప్రణాళికకు ప్రాధాన్యం ఇస్తూ భాజపా కార్యాచరణను అమలు చేస్తోంది. నేరుగా కుటుంబం వద్దకు పార్టీ బాధ్యులు చేరుకునేలా కార్యక్రమాలను చేపట్టింది.

Published : 01 May 2024 03:11 IST

బూత్‌, పన్నా కమిటీలతో ప్రచారానికి పదును
బహుముఖ ఎన్నికల కార్యాచరణపై భాజపా నజర్‌

ఈనాడు, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికలలో ప్రతి ఓటరును కలిసే పక్కా ప్రణాళికకు ప్రాధాన్యం ఇస్తూ భాజపా కార్యాచరణను అమలు చేస్తోంది. నేరుగా కుటుంబం వద్దకు పార్టీ బాధ్యులు చేరుకునేలా కార్యక్రమాలను చేపట్టింది. బూత్‌ కమిటీలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ వస్తున్న పార్టీ తాజాగా పన్నా ప్రముఖ్‌ కమిటీలతో ఆ ప్రణాళికకు మరింత పదును పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 33 వేలకు పైగా బూత్‌ కమిటీలు ఉండగా వాటి పరిధిలో పన్నా కమిటీలను ఏర్పాటు చేసింది. 10 నుంచి 12 కుటుంబాలకు చేరువ కావాలన్నది లక్ష్యం. ఓటరు జాబితా ఆధారంగా వాటిని నెలకొల్పింది. సగటున ప్రతి 30 మంది ఓటర్లకు ఒకరు బాధ్యత తీసుకుంటున్నారు. క్షేత్ర స్థాయిలో అత్యంత కీలకంగా ఉండేలా వాటికి కార్యక్రమాలను నిర్దేశించారు. భాజపా గురించి, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి వివరించడం.. పోలింగ్‌లోపు కనీసం రెండు మూడు సార్లు తమ పరిధిలోని కుటుంబాలను కలవడం అనేది కీలక అంశంగా ఉంది. ఓటర్లు విధిగా పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓటు వేసేలా చూడాల్సి ఉంటుంది. బూత్‌ కమిటీలను భాజపా.. కళ్లు, చెవులుగా భావిస్తోంది. వాటికి ఛైర్మన్‌ ఇతర బాధ్యులను నియమించి వారికి పక్కాగా పార్టీ బాధ్యతలను అప్పగించింది. బాధ్యులతో భాజపా అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రత్యేకంగా సమావేశమై దిశానిర్దేశం చేశారు. ప్రతి బూత్‌కు స్థానిక ముఖ్యనేత కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి సహా రాష్ట్రంలోని భాజపా నాయకులు అందరూ కూడా తమతమ బూత్‌లకు కోఆర్డినేటర్‌లుగా ఉన్నారు. తమ పరిధిలో నిర్దేశించిన కార్యక్రమాల అమలుకు వారు సహకారం అందిస్తున్నారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల జాబితాలను పోలింగ్‌ కేంద్రాల వారీగా బూత్‌ కమిటీలకు అందచేశారు. పన్నా ప్రభారీలు (ఓటరు జాబితా పేజీ ఇన్‌ఛార్జి) ఆ బూత్‌ కమిటీ బాధ్యులు లబ్ధిదారులను కలసి భాజపా ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరిస్తున్నారు. ఇంతవరకు వారు పొందిన ప్రయోజనాన్ని తెలియజేస్తున్నారు. జిల్లా, రాష్ట్ర పార్టీకి అవసరమైన క్షేత్ర స్థాయి సమాచారాన్ని అందిస్తున్నారు.

పార్టీకి ఓటు... ఓటింగ్‌ శాతం పెంచడం

క్షేత్రస్థాయిలోని పన్నా, బూత్‌ కమిటీల వారు తమ పరిధిలోని ఓటరు ఓటింగ్‌కు వచ్చారా? లేదా? అనేది పూర్తిస్థాయిలో పర్యవేక్షించనున్నారు. పోలింగ్‌శాతం పెరగడం కీలకమైన అంశంగా భాజపా అగ్రనేతలు భావిస్తున్నారు. ప్రధానంగా పార్టీ ఓటర్లు అని భావించిన వారంతా విధిగా ఓటేసేలా చూడాలని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే అగ్రనేతల ప్రచారం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నిర్వహిస్తున్న సభలు, కార్యక్రమాలకు ప్రతి బూత్‌ నుంచి జనసమీకరణ, సభ్యుల హాజరు ఉండాలని ఆయా కమిటీల వారికి నేతలు నిర్దేశించారు. ‘భాజపా సూక్ష్మ ప్రణాళిక గుజరాత్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాల్లో సత్ఫలితాలు ఇచ్చింది. అందుకే తెలంగాణలోనూ పక్కాగా బూత్‌, పన్నా కమిటీల కార్యాచరణ అమలు చేయాలని జాతీయ పార్టీ నిర్దేశించింది. ఆ దిశగా ముందుకు వెళ్తున్నాం’ అని ఆ పార్టీ ముఖ్యనేతలు స్పష్టం చేస్తున్నారు.

ఐదువేల స్ట్రీట్‌ కార్నర్‌ సమావేశాలు

రాష్ట్రంలో బుధవారం నుంచి ఎనిమిదో తేదీలోపు 5,000 స్ట్రీట్‌ కార్నర్‌ సమావేశాలు నిర్వహించనున్నారు. మాట్లాడేందుకు 30 మంది నేతల్ని ఎంపిక చేశారు. వారు మాట్లాడాల్సిన అంశాలను రాష్ట్ర పార్టీ అందజేసింది. పార్టీకి ఓటు వేయాల్సిన అవసరం, ఇంకోసారి మోదీ ప్రధాని కావాల్సిన ఆవశ్యకత, భాజపా ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వారు వివరించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img