icon icon icon
icon icon icon

కాంగ్రెస్‌, భాజపా మిలాఖత్‌ కాకపోతే.. సీఎం రేవంత్‌పై విచారణ జరపండి

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ వసూలు చేస్తున్నారని ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడిన మాటలు నిజమైతే.. వెంటనే సీఎంపై విచారణ జరిపించాలని భారాస అధినేత కేసీఆర్‌ డిమాండ్‌ చేశారు.

Published : 01 May 2024 03:13 IST

ప్రధాని మోదీ చేసిన ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ వ్యాఖ్యలపై కేసీఆర్‌
ఈడీ, ఐటీలను రంగంలోకి దించాలన్న భారాస అధినేత
కొత్తగూడెంలో రోడ్‌షో

ఈటీవీ, ఖమ్మం: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ వసూలు చేస్తున్నారని ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడిన మాటలు నిజమైతే.. వెంటనే సీఎంపై విచారణ జరిపించాలని భారాస అధినేత కేసీఆర్‌ డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌, భాజపా మిలాఖత్‌ కాకపోతే.. ఈడీ, ఐటీలను రంగంలోకి దించి దొంగలను పట్టుకోవాలని అన్నారు. అది మోదీకి చేతకాదని, పైకి నాటకాలు ఆడతారని.. ముమ్మాటికీ వారిద్దరూ ఒకటేనని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్‌లో ఏపార్టీకి ఓటేసినా గోదావరిలో వేసినట్టేనని.. తెలంగాణ ప్రజలకు లాభం జరగదని చెప్పారు. భారాస మహబూబాబాద్‌, ఖమ్మం అభ్యర్థులు మాలోత్‌ కవిత, నామా నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ మంగళవారం రాత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నిర్వహించిన రోడ్‌షోలో కేసీఆర్‌ ప్రసంగించారు.

కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలి

‘‘శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపింది. అడ్డగోలు హామీలు ఇచ్చింది. ప్రజలను దారుణంగా మోసగించింది. మేము రైతుబంధు రూ.10వేలు ఇస్తే వాళ్లు రూ.15 వేలు ఇస్తామన్నారు. మరి రైతుబంధు అందరికీ వచ్చిందా? కల్యాణలక్ష్మి పథకం కింద భారాస ప్రభుత్వంలో రూ.లక్ష ఇస్తే వారు అదనంగా తులం బంగారం అందజేస్తామన్నారు. ఎవరికైనా తులం బంగారం వచ్చిందా..? అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించి ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పారు. ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. అందుకే కాంగ్రెస్‌ పార్టీకి లోక్‌సభ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి. తెలంగాణ సమస్యలు తీరాలన్నా, నదుల నీళ్లు రాష్ట్రానికి దక్కాలన్నా, కేంద్రం నిధులు రావాలన్నా.. రాష్ట్ర అస్తిత్వం, ఆత్మగౌరవం నిలబడాలన్నా భారాసతోనే సాధ్యం.

జిల్లాలు తీసేస్తామంటున్నారు...

ప్రజలకు పరిపాలనా సౌలభ్యం కోసం నాడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేశాం. ఆ క్రమంలో కొత్తగూడెం జిల్లా ఏర్పడింది. బ్రహ్మాండమైన కలెక్టరేట్‌ నిర్మించాం. వైద్య కళాశాల, ఇంజినీరింగ్‌ కళాశాల నెలకొల్పాం. పట్టణాన్ని అభివృద్ధి చేశాం. ఏజెన్సీ ప్రాంతాలకు జిల్లా కేంద్రం దూరంగా ఉండకూడదన్న ఉద్దేశంతో జిల్లాను ఏర్పాటు చేశాం. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొత్తగూడెం జిల్లా తీసేస్తామని స్పష్టంగా చెబుతున్నారు. మరి ఈ జిల్లా ఉండాలా తీసేయాలా? ఈ జిల్లా ఉండాలన్నా, ఇక్కడ ప్రజలకు లాభం జరగాలన్నా భారాస అభ్యర్థులు నామా నాగేశ్వరరావు, మాలోత్‌ కవితను గెలిపించాలి.

సింగరేణిపై చోటే భాయ్‌, బడే భాయ్‌ కుట్ర

భారాస హయాంలోనే సింగరేణిని లాభాల బాటలో నడిపించాం. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కార్మికులకు ప్రత్యేక బోనస్‌, ఇంక్రిమెంట్‌ ఇచ్చాం. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం సింగరేణిని ముంచే కార్యక్రమం చేస్తోంది. చోటే భాయ్‌ రేవంత్‌రెడ్డి, బడే భాయ్‌ మోదీ కలిసి సింగరేణిని ముంచే కుట్ర చేస్తున్నారు. నేను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అదాని ఆస్ట్రేలియా నుంచి తెచ్చిన బొగ్గును కొనుగోలు చేయాలని మోదీ పంచాయితీ పెట్టారు. మాకు సింగరేణి బొగ్గు ఉంది. ఆస్ట్రేలియా బొగ్గు ఎందుకని, ఎట్టి పరిస్థితుల్లో టన్ను కూడా కొనమని చెప్పాం. సింగరేణిని కాపాడుకున్నాం.

భాజపా ఒక్క హామీ నెరవేర్చలే

భాజపా ప్రభుత్వం పదేళ్ల కిందట గద్దెనెక్కింది. దశాబ్ద కాలంలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. మోదీ ప్రభుత్వం వంటి దరిద్ర పరిపాలన మళ్లీ చూడబోం. మతాల మధ్య పంచాయితీలు పెట్టి ఉద్వేగాలు రెచ్చగొట్టి ఓట్లు దండుకోవడం తప్ప ఒక్క మంచి పనీ చేయలేదు. పైగా ఇప్పుడు గోదావరి నదిని ఎత్తుకుపోయి తమిళనాడు, కర్ణాటకకు నీళ్లిస్తానని మోదీ అంటున్నారు. తెలంగాణకు ఒకే ఒక్క ఆధారం గోదావరి. ఆ నది పోతే తెలంగాణ బతుకేం కావాలి? సీఎం ఎందుకు మాట్లాడటం లేదు? దీని వెనుక ఉన్న మతలబు ఏంటో తేలాలి. గతంలో మోదీ రైతుల బావులకు మీటర్లు పెట్టాలంటే.. నా తల తెగిపడ్డా మీటర్లు పెట్టేది లేదని చెప్పా. ఇప్పుడు భారాసకు కాకుండా కాంగ్రెస్‌, భాజపాలకు ఓటేస్తే మోటార్లకు మీటర్లు రావటం ఖాయం. తస్మాత్‌ జాగ్రత్త. మీటర్లు పెట్టొద్దంటే పేగులు తెగేదాక కొట్లాడే భారాస ఎంపీ అభ్యర్థులను గెలిపించండి’’ అని కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు.

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ముగిసిన బస్సు యాత్ర

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రెండ్రోజుల కేసీఆర్‌ బస్సు యాత్ర మంగళవారం ముగిసింది. ఆరు నియోజకవర్గాల మీదుగా యాత్ర సాగింది. రెండు చోట్ల కేసీఆర్‌ రోడ్‌షోలు నిర్వహించారు. మంగళవారం సాయంత్రం ఖమ్మం నుంచి బస్సు యాత్ర మొదలైంది. వైరా, తల్లాడ మీదుగా కొత్తగూడెం చేరుకుంది. తల్లాడ వద్ద మాజీ ఎమ్మెల్యే సండ్ర ఆధ్వర్యంలో భారాస శ్రేణులు కేసీఆర్‌ బస్సు యాత్రకు స్వాగతం పలికారు. బస్సులో నుంచే కేసీఆర్‌ అభివాదం చేశారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, వనమా వెంకటేశ్వరరావు, మెచ్చా నాగేశ్వరరావు, బానోత్‌ హరిప్రియ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్‌ బస్సు యాత్ర బుధవారం మహబూబాబాద్‌ జిల్లాలో సాగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img