icon icon icon
icon icon icon

ప్రచారానికి పదకొండు రోజులే..!

రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసింది.

Published : 01 May 2024 03:14 IST

వేగం పెంచిన కాంగ్రెస్‌
జాతీయస్థాయి నాయకులతో భారీ సభలకు సన్నాహాలు
పార్టీ శ్రేణులు, నేతలకు దిశానిర్దేశం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసింది. బుధవారం నుంచి ఇంకా 11 రోజులే (మే నెల 11 వరకు) ప్రచారానికి గడువు ఉంది. ఈ లోగా పెద్దఎత్తున ప్రచారం చేయాలని పార్టీ నిర్ణయించింది. మే మొదటివారంలో కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్‌, ప్రియాంకాగాంధీలతో రాష్ట్రంలో భారీ సభల ఏర్పాటుకు పార్టీ నేతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మే 4, 5 తేదీల్లో రాహుల్‌గాంధీ సభలుంటాయని సమాచారం. అలాగే పల్లెల్లో ప్రజల దృష్టిని ఆకర్షించేలా ప్రచారంపైనా దృష్టిపెట్టాలని పార్టీ శ్రేణులు, నేతలకు కాంగ్రెస్‌ దిశానిర్దేశం చేసింది. ఇప్పటికీ కొన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లో గ్రామాలకు ప్రచారం చేరలేదని సమాచారం. ఏ నియోజకవర్గంలో ప్రచారం ఎలా సాగుతుందనే విషయమై పార్టీ వార్‌రూంల ద్వారా అధిష్ఠానానికి ఎప్పటికప్పుడు సమాచారం వెళుతోంది. ఇక ప్రచారానికి తక్కువ సమయమే ఉందని మంత్రులు, లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, అభ్యర్థులతో పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ, ఏఐసీసీ కార్యదర్శి విష్ణునాథ్‌లు జూమ్‌ ద్వారా ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. భవిష్యత్‌ కార్యాచరణపై వారు నేతలతో చర్చించారు. ప్రణాళికాబద్ధంగా ప్రచారంలో ముందుకెళ్లాలని అభ్యర్థులకు సీఎం సూచనలిచ్చారు. ప్రతి మండల, గ్రామ, పోలింగ్‌ బూత్‌ స్థాయిల్లో ఓటర్లను పార్టీ శ్రేణులు కలసి ఓటు అడిగేలా పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాలని సీఎం స్పష్టంచేశారని అభ్యర్థులు తెలిపారు.

కష్టపడేవారికి గుర్తింపు..

ఈ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కష్టపడిన వారికి మంచి భవిష్యత్‌ ఉంటుందని పీసీసీ అధ్యక్షుడు పార్టీ శ్రేణులకు, కిందిస్థాయి కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఎన్నికల తరవాత త్వరలో సంక్షేమ పథకాల అమలుకు గ్రామస్థాయిలో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ఎన్నికల్లో బాగా కష్టపడి, పార్టీకి ఓట్లు రాబట్టడానికి కృషిచేసే ముఖ్యమైన కార్యకర్తలను ప్రతి పోలింగ్‌ బూత్‌ పరిధిలో గుర్తించి వారికి ఇందిరమ్మ కమిటీల్లో చోటు కల్పించాలని పార్టీ నిర్ణయించింది. ఈ విషయం కార్యకర్తలకు వివరించాలని నేతలకు నిర్దేశించింది. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ తగ్గకుండా ప్రతి నియోజకవర్గంలో మరిన్ని ఎక్కువగా ఓట్లు వచ్చేలా చూసుకోవాల్సిన బాధ్యత జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులు, లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌ఛార్జులకు పార్టీ అప్పగించింది. ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిందేనని, ఏ ఒక్కరికీ మినహాయింపు ఉండదని రేవంత్‌రెడ్డి హెచ్చరించినట్లు తెలుస్తోంది. గత 120 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసిన పథకాలు, పేదలకు చేకూరుతున్న లబ్ధిని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని పార్టీ నిర్ణయించింది. వచ్చే ఆగస్టు 15లోగా రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేసి తీరుతామన్న అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నేతలందరికీ సీఎం సూచించారు. పార్టీలో అక్కడక్కడా నేతలు, కార్యకర్తల మధ్య సమన్వయానికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే దీపా దాస్‌మున్షీ, ఏఐసీసీ కార్యదర్శుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలకు పార్టీ ఆదేశాలిచ్చింది. కొన్నిచోట్ల ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి ఎప్పటినుంచో కాంగ్రెస్‌లో ఉన్నవారు సహకరించకపోతే అందరికీ నచ్చజెప్పాలని  అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌ఛార్జి నేతలకు సూచనలిచ్చారు. ప్రచారంలో, పార్టీ విజయానికి ఎవరికి కేటాయించిన బాధ్యతలను వారు కచ్చితంగా నిర్వహించాల్సిందేనని పీసీసీ స్పష్టం చేసింది. ఎన్నికల కోడ్‌ ముగిసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోయే పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలని సీఎం సూచించినట్లు నేతలు వివరించారు. రాబోయే 11 రోజుల పాటు నిర్వహించే ప్రచార ప్రణాళిక అమలును గాంధీభవన్‌ నుంచి పర్యవేక్షించాలని పార్టీ  నిర్ణయించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img