icon icon icon
icon icon icon

దిల్లీకి బెదురుతామా?

‘‘రిజర్వేషన్ల రద్దుకు భాజపా కుట్ర చేస్తోందని విమర్శిస్తే.. గాంధీభవన్‌కు అమిత్‌షా దిల్లీ పోలీసులను పంపించారు. దిల్లీ నుంచి బెదిరిస్తే బెదురుతామా? చంచల్‌గూడ, చర్లపల్లికి జైలుకే వెళ్లాం.

Published : 01 May 2024 03:17 IST

కేసులకు ఎన్నడూ భయపడలేదు
గుజరాత్‌ వాళ్లకు తెలంగాణ పౌరుషం చూపించాలి
ఎన్నికల ఫైనల్స్‌లో తెలంగాణ వర్సెస్‌ గుజరాత్‌
 రాష్ట్రానికి మోదీ ఇచ్చింది ‘గాడిద గుడ్డే’!
 మెట్రో రైలు, మూసీ ప్రక్షాళనకు నిధులిచ్చాకే ఓట్లు అడగండి
 చేవెళ్ల, కరీంనగర్‌, వరంగల్‌ నియోజకవర్గాల్లో నిర్వహించిన సభలు, రోడ్‌షోల్లో సీఎం రేవంత్‌రెడ్డి

ఈనాడు-హైదరాబాద్‌, కరీంనగర్‌, ఈనాడు డిజిటల్‌-జయశంకర్‌ భూపాలపల్లి, న్యూస్‌టుడే యంత్రాంగం: ‘‘రిజర్వేషన్ల రద్దుకు భాజపా కుట్ర చేస్తోందని విమర్శిస్తే.. గాంధీభవన్‌కు అమిత్‌షా దిల్లీ పోలీసులను పంపించారు. దిల్లీ నుంచి బెదిరిస్తే బెదురుతామా? చంచల్‌గూడ, చర్లపల్లికి జైలుకే వెళ్లాం. పోలీసులతో భయపెట్టి.. మోదీ, అమిత్‌షా ఏం చేస్తారు? ఈసారి లోక్‌సభ ఎన్నికల ఫైనల్స్‌లో తెలంగాణ, గుజరాత్‌ జట్లు తలబడుతున్నాయి. గుజరాత్‌ నుంచి వచ్చే మోదీ, అమిత్‌షాలకు తెలంగాణ పౌరుషాన్ని కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు చూపించాలి. గుజరాత్‌ జట్టును ఓడించి.. కేంద్ర ప్రభుత్వంలో అధికారం చేపడదాం. రాహుల్‌ గాంధీని ప్రధాని చేద్దాం’’ అని ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్‌రెడ్డి మంగళవారం పలు సభల్లో పాల్గొన్నారు. హైదరాబాద్‌లో చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని బాలాపూర్‌, ఎన్టీఆర్‌నగర్‌ రాజీవ్‌ చౌరస్తాల్లో జరిగిన రోడ్‌షోలు, కార్నర్‌ మీటింగ్‌లకు హాజరయ్యారు. కరీంనగర్‌ నియోజకవర్గం పరిధిలోని జమ్మికుంట, వరంగల్‌ నియోజకవర్గం పరిధిలోని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండల్లో జరిగిన జనజాతర బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఆయాచోట్ల ప్రసంగించారు.

‘‘తెలంగాణ పౌరుషం ఎవరికీ తలవంచదు. త్యాగాలు, పోరాటాలతో తెలంగాణ సాధించుకున్నాం. భాజపాకు సవాల్‌ విసురుతున్నా.. గుజరాత్‌ పెత్తనమా, తెలంగాణ పౌరుషమా తేల్చుకుందాం. నిజాం నవాబులను ఎదుర్కొన్నాం. రజాకార్లను తరిమిన చరిత్ర తెలంగాణ గడ్డది. కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలపై కేసీఆర్‌ పెట్టిన అక్రమ కేసులు ఎదుర్కొని.. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి.. ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నాం. గతంలో పదేళ్లపాటు కేసీఆర్‌ నన్ను వేధించారు. విజిలెన్స్‌, ఇతర నిఘాలు పెట్టి జైలుకు పంపించారు. అమిత్‌షాను కేసీఆర్‌ ఆవహించినట్లున్నారు. భాజపా అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తారని రెండు, మూడు టీవీల్లో నేను మాట్లాడితే.. దిల్లీ నుంచి గాంధీభవన్‌కు పోలీసులను పంపించారు. నన్ను అరెస్టు చేయాలని ఆదేశించారు. నేను ఎన్నడూ కేసులకు భయపడలేదు. దిల్లీ పోలీసులకు భయపడను.

రిజర్వేషన్ల రద్దుకు కుట్ర..

మోదీ మనపై సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేస్తున్నారు. ఎన్నికల్లో గెలవగానే రిజర్వేషన్లను రద్దు చేయాలని భాజపా కుట్ర చేస్తోంది. గతంలో అమలు చేసిన ట్రిపుల్‌ తలాక్‌, ఆర్టికల్‌ 370 రద్దు, వ్యవసాయ చట్టాల మాదిరిగా.. ఈసారి 400 ఎంపీ సీట్లు గెలిచి ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను తొలగించాలని చూస్తోంది. రాష్ట్రంలో బీసీ జనాభా లెక్కించాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఆదేశించాను. జనాభా ప్రాతిపదికన వారికి రిజర్వేషన్లు, నిధులు ఇస్తాం. భాజపాకు అధికారం ఇస్తే ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతుంది. అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే భాజపాను ఓడించాలి. రాజకీయాల కోసం రాముడినీ ఆ పార్టీ వదలడం లేదు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠకు ముందే ఇంటింటికీ అక్షింతల పంపిణీ పేరుతో రాజకీయం చేసింది. ఓట్ల కోసం మేము హిందుత్వాన్ని వాడుకోవడం లేదు.

వారిది చీకటి ఒప్పందం..

కవిత బెయిల్‌ కోసం భాజపాతో కేసీఆర్‌ చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎన్నికల్లో భాజపా అభ్యర్థులకు సహకరించేలా కొన్నిచోట్ల బలహీనమైన అభ్యర్థులను నిలబెట్టారు. అరూరి రమేశ్‌ను ఆయనే భాజపాలోకి పంపించారు. చేవెళ్లలో కాసాని జ్ఞానేశ్వర్‌కు మద్దతుగా సబితా ఇంద్రారెడ్డి ప్రచారం చేస్తున్నా.. ఓట్లు మాత్రం భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి వేయాలని చెబుతున్నారు. కేంద్రంలో హంగ్‌ వస్తుందని, భారాసకు 12 సీట్లు వస్తే చక్రం తిప్పుతానని, నామా నాగేశ్వరరావు కేంద్ర మంత్రి అవుతారని, కాంగ్రెస్‌కు నలభై సీట్లే వస్తాయని కేసీఆర్‌ అంటున్నారు. ఎన్డీయేతో ఉన్న అనుబంధంతోనే ఆయన అలా మాట్లాడుతున్నారు. పదేళ్లపాటు మోదీతో కేసీఆర్‌ బాగానే ఉన్నారు. గజ్వేల్‌లో మిషన్‌ భగీరథ ప్రారంభ సభలో ‘మీ ప్రేమ ఉంటే చాలు.. నిధులు వద్దు’ అని మోదీతో కేసీఆర్‌ అన్నది నిజం కాదా? ఎట్టి పరిస్థితుల్లోనూ కేసీఆర్‌ను ఇండియా కూటమిలోకి రానివ్వం. ఆ గోడపై వాలిన కాకి కాంగ్రెస్‌ గోడపై వాలితే కాల్చేస్తాం. కారు షెడ్డుకు పోయిందని కేటీఆర్‌ అంటున్నారు. కార్ఖానాకు పోయిన కారు బాగుపడుతుందని వాళ్లనుకుంటున్నారు. దాన్ని జుమ్మేరాత్‌ బజారులో తూకానికి వేసి అమ్మాల్సిందే.! అందుకనే కేసీఆర్‌ కారును పక్కనబెట్టి బస్సులో తిరుగుతున్నారు. తెలంగాణ ఏర్పాటుకు తోడ్పాటు అందించేందుకు సిద్దిపేట జిల్లా చింతమడక నుంచి కరీంనగర్‌కు వచ్చిన కేసీఆర్‌ను ప్రజలు ఆదరించారు. ఆయన కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌లలో ఎంపీగా గెలిచినా చేసిందేమీ లేదు. కేసీఆర్‌ పదేళ్లు అధికారంలో ఉన్నా జయశంకర్‌ స్వగ్రామమైన అక్కంపేటను రెవెన్యూ గ్రామంగా చేయలేదు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే చేశాం. రామప్ప దేవాలయంలో ఉన్న శివుడి సాక్షిగా చెబుతున్నా. పంద్రాగస్టులోపు రుణమాఫీ చేస్తాం.

విశ్వేశ్వర్‌రెడ్డి.. ప్రజాజీవితానికి పనికిరారు

చేవెళ్ల భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ప్రజాజీవితానికి పనికిరారు. ప్రజాసేవనూ వ్యాపార దృష్టితోనే చూస్తున్నారు. భాజపా కార్యకర్తలు తన ఇంటికొస్తే అపాయింట్‌మెంట్‌ ఉందా అని అడుగుతారా? సాయం కోరి వచ్చినవారికి మీ ఆసుపత్రిలో ఫీజులు తగ్గిస్తే వారు కృతజ్ఞతతో పనిచేస్తారు. మీ వద్ద ఉన్న రూ.వేల కోట్లతో ఉత్తర్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌, బిహార్‌లలో రాజ్యసభ సీటు కావాలని మోదీని అడగండి’’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

రాహుల్‌ను ప్రధాని చేయాలి..

సోనియా గాంధీ నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని, రాష్ట్రాభివృద్ధి కోసం రాహుల్‌ గాంధీని ప్రధాని చేయాలని మంత్రి సీతక్క కోరారు. ఇందిరమ్మ రాజ్యం రావాలంటే కాంగ్రెస్‌ గెలవాలని కొండా సురేఖ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు మరింత బలం చేకూర్చేలా పార్టీ అభ్యర్థులను గెలిపించాలని శ్రీధర్‌బాబు కోరారు. చేవెళ్ల నియోజకవర్గం పరిధిలోని ఆర్కేపురంలో నిర్వహించిన సభలో కాంగ్రెస్‌ కార్యకర్తలు బహూకరించిన విల్లును రేవంత్‌రెడ్డి ఎక్కుపెట్టారు. కిరీటం ధరించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనపై ‘నల్గొండ గద్దర్‌’ నర్సిరెడ్డి రాసిన ‘ప్రజల పాలనొచ్చెనే తెలంగాణలోన’ పాట సీడీని జమ్మికుంటలో ఆవిష్కరించారు.


మోదీ.. ఉద్దెర చుట్టం

తెలంగాణకు ఎలాంటి నిధులివ్వని ప్రధాని మోదీ మనకు ఉద్దెర చుట్టం. గడిచిన పదేళ్లలో రాష్ట్రానికి నిధులేమీ ఇవ్వలేదు. పన్నుల రూపేణా రాష్ట్రం నుంచి కేంద్రానికి రూపాయి ఇస్తే.. మనకు 43 పైసలు తిరిగిస్తున్నారు. తెలంగాణకు మెట్రోరైల్‌ ఇవ్వడం లేదు. గుజరాత్‌కు బుల్లెట్‌ ట్రైన్‌ తీసుకెళ్లారు. అక్కడ గిఫ్ట్‌ సిటీ కట్టుకున్నారు. మూసీ ప్రక్షాళనకు నిధుల కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రధానిని కలిశారు. అణాపైసా ఇవ్వలేదు. నేను స్వయంగా వెళ్లి అభ్యర్థించినా స్పందించలేదు. పునర్విభజన చట్టంలో పొందుపర్చిన బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ ఇవ్వలేదు. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు. వరంగల్‌ ఎయిర్‌పోర్టును మోదీ, అమిత్‌షాలు అడ్డుకున్నారు. ఓఆర్‌ఆర్‌ చుట్టూ రావాల్సిన ఐటీఐఆర్‌ను రద్దు చేయడం ద్వారా రూ.వేల కోట్ల పెట్టుబడులు, లక్షల ఉద్యోగాలను మోదీ రద్దు చేశారు. లెక్క ప్రకారం తెలంగాణకు 72 లక్షల ఉద్యోగాలు రావాలి. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లే రాలేదు. తెలంగాణ గురించి పార్లమెంటులో ప్రధాని మోదీ అవమానకరంగా మాట్లాడారు. ఆ సమయంలో బండి సంజయ్‌ ఎందుకు మౌనంగా ఉన్నారు? నిజామాబాద్‌లో గెలిచిన అర్వింద్‌, కరీంనగర్‌లో గెలిచిన సంజయ్‌ తెలంగాణకు తెచ్చిందేమీ లేదు. ఆంధ్రప్రదేశ్‌కు మోదీ రెండు పాచిపోయిన లడ్లు ఇచ్చారు. కర్ణాటకు చెంబెడు నీళ్లు ఇచ్చారు. గడిచిన పదేళ్లలో తెలంగాణకు గాడిద గుడ్డే ఇచ్చారు. ఏడేడు విమానాలు వేసుకుని వచ్చి నన్ను తిట్టారు. కేసీఆర్‌ స్క్రిప్టునే ఆయనే చదివేశారు. పదేళ్లలో ఏం చేశారో చెప్పలేదు. ఓట్లేస్తే ఏం చేస్తారో చెప్పండి. హైదరాబాద్‌ చుట్టూ విస్తరించనున్న మెట్రో రైలుకు, మూసీ ప్రక్షాళనకు రూ.20-30 వేల కోట్ల నిధులు ఇచ్చాకే ఓట్లు అడగండి.

 సీఎం రేవంత్‌రెడ్డి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img