icon icon icon
icon icon icon

రాష్ట్రంలో ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌

తెలంగాణలో ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ పేరిట అక్రమ వసూళ్లు చేసి, దిల్లీకి పెద్ద వాటాను నల్లధనం రూపంలో తరలిస్తున్నారని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు.

Updated : 01 May 2024 05:36 IST

తెలంగాణలో వసూళ్లు.. దిల్లీకి పెద్ద వాటా!
కాంగ్రెస్‌, భారాస.. రెండూ అవినీతి రాకెట్‌లో సభ్యులే
రాజ్యాంగాన్ని ఆది నుంచీ అవమానించింది కాంగ్రెస్సే
అందుకే అసలు ప్రతిని తొలుతే దాచేశారు
 ప్రజల ఓటు బలంతోనే రామమందిర నిర్మాణం
 రుణమాఫీ, వరికి బోనస్‌ హామీలేమయ్యాయి?
 కేంద్రం పనులను అడ్డుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం
 భాజపా సభలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ

ఈనాడు- హైదరాబాద్‌, కామారెడ్డి; న్యూస్‌టుడే- అల్లాదుర్గం, జోగిపేట, సంగారెడ్డి అర్బన్‌: తెలంగాణలో ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ పేరిట అక్రమ వసూళ్లు చేసి, దిల్లీకి పెద్ద వాటాను నల్లధనం రూపంలో తరలిస్తున్నారని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. ఈ ట్యాక్స్‌ వచ్చే ఐదేళ్లలో తెలంగాణను పూర్తిగా ధ్వంసం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌, భారాస పార్టీలు ఒక్కటేనని, అవినీతి రాకెట్‌ సభ్యులని విమర్శించారు. మెదక్‌ జిల్లా అల్లాదుర్గంలో మంగళవారం భాజపా నిర్వహించిన విశాల్‌ జనసభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. కాంగ్రెస్‌, భారాసలపై నిప్పులు చెరిగారు. ‘తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే రైతులకు వంద రోజుల్లో రుణమాఫీ చేస్తామని, వరికి క్వింటాలుకు రూ.500 బోనస్‌ ఇస్తామని చెప్పింది. ఇప్పటి వరకు అవి అమలు కాలేదు. వాటి గురించి సమాధానం చెప్పకుండా కాంగ్రెస్‌ నాయకులు నోళ్లకు తాళాలు వేసుకున్నారు’ అని దుయ్యబట్టారు. దేశంలో రాజ్యాంగం పుట్టుకే కాంగ్రెస్‌కి ఇష్టం లేదని, అందుకే నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌, రాహుల్‌గాంధీ రాజ్యాంగాన్ని అడుగడుగునా అవమానించారని తెలిపారు. ఎన్డీయే మూడో దఫా పరిపాలనలో రాజ్యాంగం ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని, గల్లీగల్లీలో కాంగ్రెస్‌ పాపాల్ని అందరికీ వెల్లడిస్తామని పేర్కొన్నారు. రాజ్యాంగం ద్వారా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కల్పించిన రిజర్వేషన్లను.. తాను బతికున్నంత వరకు ముస్లింలకు ఇవ్వనీయబోనని ప్రధాని స్పష్టం చేశారు.

ట్రిపుల్‌ ఆర్‌తో ఖ్యాతి.. డబుల్‌ ఆర్‌తో అప్రతిష్ఠ

తెలుగు సినీ పరిశ్రమ దేశానికి ‘ట్రిపుల్‌ ఆర్‌’ ఇచ్చింది. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీ ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ను ఇచ్చింది. ఆ సినిమా దేశ ప్రతిష్ఠను పెంచితే.. ఈ ట్యాక్స్‌ దేశం సిగ్గుపడేలా చేస్తోంది. తెలంగాణలో అన్ని వైపులా ఈ చర్చ నడుస్తోంది. గుత్తేదారులు, ఇతరులు ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ను వెనుక దర్వాజా నుంచి ఇస్తున్నారు. ఈ ట్యాక్స్‌లో పెద్ద వాటా దిల్లీకి వెళ్తోంది. ఈ ఆర్‌ఆర్‌ ఎవరో అందరూ అర్థం చేసుకుని ఉంటారు. దీన్ని ప్రజలు అడ్డుకోవాలి. మొన్నటి వరకు రాష్ట్రాన్ని భారాస ధ్వంసం చేయగా.. ఇప్పుడు ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ మరింత నష్టం చేస్తోంది. ఈ పన్నును అడ్డుకునేందుకు తెలంగాణ నుంచి భాజపా అభ్యర్థులందరినీ గెలిపించి దిల్లీ పంపించాలి. అప్పుడే అవినీతిపరులు భయపడతారు.

అవినీతిని పరస్పరం సమర్థించుకుంటున్నారు..

రాష్ట్రంలో భారాస, కాంగ్రెస్‌ రెండూ ఒక్కటే. భారాస.. కాళేశ్వరం ప్రాజెక్టు కుంభకోణానికి పాల్పడినపుడు కాంగ్రెస్‌ ప్రతిపక్షంలో ఉంది. సర్కారు ఏర్పాటైన తరువాత విచారణ చేస్తామని చెప్పి కాళేశ్వరం దస్త్రాన్ని తొక్కిపెట్టింది. భారాస సర్కారు ఉన్నపుడు ఓటుకు నోటు కేసును ముందుకు వెళ్లనీయలేదు. కాంగ్రెస్‌, భారాస రెండూ అవినీతి రాకెట్‌ సభ్యులే. దిల్లీ లిక్కర్‌ స్కాంలో భారాస వాళ్లు ఉన్నారు. దిల్లీలో ఉన్నవారు కాంగ్రెస్‌తో కలిసి కూటమిలో ఉన్నారు. స్కాం విచారణ ప్రారంభం కాగానే రాకెట్‌ సభ్యులు ఒకరిని ఒకరు సమర్థించుకుంటున్నారు.

మహిళలను కాంగ్రెస్‌ ఓటుబ్యాంకుగా చూస్తోంది.

గతంలో ప్రపంచం ముందుకు వెళ్తుంటే.. భారత్‌లో కాంగ్రెస్‌ అవినీతి అన్ని రంగాల్లోకి పాకింది. ఈ సంక్లిష్ట పరిస్థితి నుంచి దేశాన్ని ఎన్డీయే చాలా కష్టంగా బయటకు తీసుకువచ్చింది. కానీ కాంగ్రెస్‌ మరోసారి దేశాన్ని పాత దుర్దినాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఆ పార్టీ హయాంలో మహిళలకు అన్నీ కష్టాలే. ఆడపిల్ల పుట్టిన తరువాత చదువుకోవడం కష్టమైన పనిగా ఉండేది. పాఠశాలల్లో మరుగుదొడ్లు లేకపోవడంతో చదువు మధ్యలోనే మానేసేవారు. బేటీ బచావో.. బేటీ పఢావో పథకం తెచ్చి బడుల్లో బాలికలకు టాయిలెట్లు నిర్మించాం. ఇప్పుడు వారు చదువులో ముందుకు వెళ్తున్నారు. పీఎంఏవై కింద నిర్మిస్తున్న ఇళ్లు మహిళల పేరిట ఇస్తున్నాం. కాంగ్రెస్‌ మహిళలను కేవలం ఓటుబ్యాంకుగా మాత్రమే చూస్తోంది.

ఇక్కడ శోభాయాత్రలకు సర్కారు ఆటంకాలు

ప్రభుత్వం బలంగా, నిర్ణయాత్మకంగా మారితే దేశభక్తితో పనిచేస్తుంది. అయోధ్యలో భవ్యరామమందిరం దీనికి ఉదాహరణ. ఇది 500 ఏళ్ల కల. ఈ దేవాలయాన్ని.. స్వాతంత్రం వచ్చిన వెంటనే నిర్మించాల్సింది. కానీ దిల్లీలో బలమైన సర్కారు ఏర్పాటయ్యాకే అది సాకారమైంది. రామమందిరాన్ని మోదీ నిర్మించలేదు.. మీ ఓటు ఇచ్చిన సంపూర్ణమైన శక్తితో ఆలయ నిర్మాణం పూర్తయింది. కాంగ్రెస్‌ తనకు ఓటు బ్యాంకు కానివారి కోసం ఏమీ చేయదు. తెలంగాణలోనూ మనకు అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడి కాంగ్రెస్‌ ప్రభుత్వం.. తన ఓటు బ్యాంకు నిరాశకు గురికావద్దన్న దురుద్దేశంతో రామనవమి సందర్భంగా హైదరాబాద్‌లో శోభాయాత్రలకు అవరోధాలు, అడ్డంకులు సృష్టించింది.

ఓటుబ్యాంకు రాజకీయాల ప్రయోగశాలగా ఉమ్మడి ఏపీ..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌.. 2004, 2009లలో కాంగ్రెస్‌కు రికార్డు సంఖ్యలో ఎంపీ, ఎమ్మెల్యేలను ఇచ్చింది. అయినా ఆ పార్టీ ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ కులగణన చేపట్టకుండా వారి రిజర్వేషన్లను అడ్డుకుంది. ఉమ్మడి ఏపీని ఓటుబ్యాంకు రాజకీయాలకు ప్రయోగశాలగా మార్చింది. బీసీ రిజర్వేషన్లు తీసుకుని ముస్లింలకు ఇచ్చింది. తెలంగాణలో లింగాయత్‌లు, మరాఠా సమాజంలోని 24 కులాలను ఓబీసీల్లో కలపడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదు. కానీ ముస్లింలను మాత్రం రాత్రికి రాత్రి బీసీలుగా గుర్తిస్తారు. బంజారాల ఆకాంక్షలపై భారాస, కాంగ్రెస్‌ నీళ్లు పోశాయి. రిజర్వేషన్లపై అబద్ధాలు చెప్పే కాంగ్రెస్‌ వారికి మాదిగ సమాజంపై ఆక్రోశం ఎందుకు? వారి కోసం మీరు ఏం చేశారు? కానీ నేను ఎస్సీ వర్గీకరణ హక్కు కోసం పోరాటం చేస్తానని మాటిచ్చా.

రాజ్యాంగం పుట్టుక నుంచీ కాంగ్రెస్‌కు ద్వేషమే

బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఇచ్చిన రాజ్యాంగప్రతిని చూస్తే, దానిపై ప్రతి కాగితంలో రామాయణం, మహాభారతం చిత్రాలు, మన సంస్కృతి, సంప్రదాయాలన్నీ ప్రతిబింబించేలా ఉంటాయి. భారత మహోన్నతమైన సంస్కృతిని, సంప్రదాయాలను రాజ్యాంగంతో జోడించే అద్భుతమైన ప్రయత్నం జరిగింది. కానీ కాంగ్రెస్‌ మాత్రం రాజ్యాంగ మొదటిప్రతిని బీరువాలో దాచేసింది. రాజ్యాంగాన్ని అగౌరవపరుస్తూ.. దేశ సంస్కృతి, సంప్రదాయాల అనుసంధానాన్ని తొలగించింది. ఎక్కడి నుంచి రాజ్యాంగం ముందుకు వెళ్లాలో దాన్ని తొలగించి, తొలిరోజునే రాజ్యాంగాన్ని ద్వేషించడం మొదలుపెట్టింది. యువరాజు ముత్తాత.. దేశ తొలిప్రధాని రాజ్యాంగం పట్ల అలా తొలిపాపం చేశారు. తరువాత యువరాజు నాయనమ్మ రాజ్యాంగాన్ని ముక్కలు చేసి దేశంలో ఎమర్జెన్సీ విధించారు. ఇక మూడో పాపం.. యువరాజు తండ్రి ప్రధానిగా ఉన్నపుడు జరిగింది. దేశ మీడియా, పత్రికలను భయపెట్టే భయంకరమైన చట్టాన్ని ఆయన తీసుకువచ్చారు. దీనిపై మీడియా, ప్రతిపక్షాలు, భాజపా ఆందోళన చేపట్టడంతో వెనక్కు తగ్గారు. మంత్రిమండలికి రాజ్యాంగం రక్షణ కల్పిస్తుంది. మన్మోహన్‌సింగ్‌ మంత్రివర్గం ఒక నిర్ణయం తీసుకుంటే.. ఈ యువరాజు పత్రికా సమావేశంలో ఆ నిర్ణయాన్ని అందరిముందు చింపేశారు. ఇలాంటి వ్యక్తులా రాజ్యాంగం గురించి మాట్లాడేది? తమ పార్టీ రాజ్యాంగాన్నీ కాంగ్రెస్‌ చెత్తడబ్బాలో పడేసింది. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సీతారాం కేసరిని రాత్రికి రాత్రి బాత్‌రూంలో బంధించి, ఫుట్‌పాత్‌పై పడేసి కాంగ్రెస్‌ను రాచకుటుంబం కబ్జా చేసింది.

మతప్రాతిపదికన రిజర్వేషన్లకు కుట్ర..

మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వకూడదని అంబేడ్కర్‌ చేసిన ప్రతిపాదనపై రాజ్యాంగసభ నిర్ణయం తీసుకుని రాజ్యాంగంలో పొందుపరిచింది. రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఉండాలని నిర్దేశించింది. కానీ యువరాజు,  ఆయన అనుయాయులు.. రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నారు. తమ ఓటుబ్యాంకును బలోపేతం చేసుకునేందుకు దళితులు, ఆదివాసీలు, ఓబీసీల హక్కులు లాక్కుని మతం ఆధారిత రిజర్వేషన్లు ఇచ్చేందుకు ఆటలాడుతున్నారు. మోదీకి, మా ప్రభుత్వానికి రాజ్యాంగమే ధర్మగ్రంథం. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 60 ఏళ్లు అయినపుడు దేశంలో గుజరాత్‌ సీఎంగా నేనొక్కడినే ఉత్సవం చేశాను. గుజరాత్‌ సురేంద్రనగర్‌లో ఏనుగుపై రాజ్యాంగాన్ని ఊరేగించి పెద్ద ప్రదర్శన నిర్వహించాను. రాజ్యాంగానికి ప్రతిబింబమైన పార్లమెంటులోకి 2014లో అడుగుపెట్టే ముందు.. తలవంచి నమస్కారం చేశాను. ఇదీ మోదీకి రాజ్యాంగం పట్ల ఉన్న గౌరవం.

కేంద్ర ప్రభుత్వ పనులకు రాష్ట్ర సర్కారు అడ్డంకులు

భాజపా సర్కారు తెలంగాణ అభివృద్ధికి రూ. లక్షల కోట్లు ఇచ్చింది. నాలుగు వందేభారత్‌ రైళ్లు నడుస్తున్నాయి. జహీరాబాద్‌ సహా 40 రైల్వే స్టేషన్లను అమృత్‌ కింద అభివృద్ధి చేస్తున్నాం. ఎల్లారెడ్డి - బోధన్‌ - భైంసా, సంగారెడ్డి - నాందేడ్‌ - అకోలా జాతీయ రహదారులు పూర్తయ్యాయి. అందోలు- నారాయణఖేడ్‌ - జుక్కల్‌ అనుసంధానత మరింత మెరుగవుతుంది. కానీ ఇక్కడి కాంగ్రెస్‌ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పనులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది. సమ్మక్క, సారక్క గిరిజన వర్సిటీకి భూమి ఇవ్వలేదు. మనోహరాబాద్‌, సిద్దిపేట, సిరిసిల్ల, కొత్తపల్లి రైల్వేలైను పనుల్ని సర్కారు నిలిపివేసింది. రాజకీయాల కోసం తెలంగాణ అభివృద్ధిని కాంగ్రెస్‌ అడ్డుకుంటోంది. అందుకే ఆ పార్టీ నుంచి పార్లమెంటుకు ఒక్కరిని కూడా గెలిపించకూడదు’ అని పిలుపునిచ్చారు. ఈ సభలో ఎంపీ      కె.లక్ష్మణ్‌, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి, జహీరాబాద్‌, మెదక్‌ లోక్‌సభ అభ్యర్థులు బీబీ పాటిల్‌, రఘునందన్‌రావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


‘ఫేక్‌ వీడియో ఉదంతంలో డబుల్‌ ఆర్‌ పేరు’

‘‘దేశంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రజాస్వామ్య భావనను తుత్తునియలు చేస్తోంది. ఫేక్‌ వీడియోలతో ప్రజలను తప్పుదోవ పట్టించి, ఘర్షణ వాతావరణం సృష్టిస్తోంది. ఇప్పుడు ఈ ఉదంతంలో డబుల్‌ ఆర్‌ పేరు వినిపిస్తోంది. ఇలాంటి ప్రయత్నాలు దేశప్రజలు ఎవరైనా చేస్తారా? అత్యుత్తమమైన రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి ఇలా చేయొచ్చా?’’

 ప్రధాని మోదీ


కాంగ్రెస్‌ వస్తే వారసత్వ పన్ను

ప్రజలను దోచుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ వారసత్వపన్ను తీసుకువస్తుంది. జీవితాంతం కష్టపడి సంపాదించి, దాచుకున్న సంపదను.. చనిపోయిన తరువాత వారసులకు ఇవ్వరు. సగానికి కన్నా ఎక్కువ అంటే 55 శాతం వసూలు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ యోచిస్తోంది.


కాంగ్రెస్‌ గుర్తు పంజా..

‘‘కాంగ్రెస్‌ చేతి గుర్తు పంజా. అబద్ధాల నినాదాలు.. అసత్యపు హామీలు, ఓటుబ్యాంకు రాజకీయాలు, మాఫియా-నేరగాళ్లకు కొమ్ము కాయడం, కుటుంబవాదం, అవినీతి.. ఇవన్నీ కలిపి ఆ పంజా ఏర్పడుతుంది. దీని గురించి తెలంగాణ ప్రజలు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. అర్థం చేసుకుంటున్నారు.’’

ప్రధాని నరేంద్ర మోదీ


తెలంగాణలో భాజపా చరిత్ర సృష్టిస్తుంది

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో భాజపా చరిత్ర సృష్టిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. విశాల్‌జనసభలో ఆయన మాట్లాడుతూ.. 17 స్థానాల్లో కాషాయ జెండా ఎగురవేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఏ వాడకెళ్లినా, ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు మోదీకే ఓటేస్తామంటున్నారని పేర్కొన్నారు. మోదీ ప్రధాని కావాలని, భాజపాకు ఓటేస్తామని గ్రామాల్లో తీర్మానాలు చేస్తున్నారన్నారు. రైతులు, యువత, మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గ్రామాల్లో తీర్మానాలు చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో భాజపా బలపడుతుంటే కాంగ్రెస్‌, భారాసల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. అందువల్లే ఆ పార్టీల నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. భారాసకు చెందిన ఓ నాయకుడు హైదరాబాద్‌ యూటీ అవుతుందని, మరో నేత కేంద్రంలో హంగ్‌ వస్తుందని, కాంగ్రెస్‌కు చెందిన ఓ నేత రిజర్వేషన్లు ఎత్తేస్తారని.. తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ పార్టీ అవలంబిస్తున్న విధానాల వల్లే బీసీలకు అన్యాయం జరుగుతోందన్నారు. ముస్లిం రిజర్వేషన్ల కారణంగా బీసీలకు వచ్చే రిజర్వేషన్లలో కోత పడుతోందన్నారు. జీహెచ్‌ఎంసీలో 150 స్థానాలుంటే 31కి పైగా స్థానాల్లో ముస్లింలు (నాన్‌ బీసీ)లు గెలిచారన్నారు. ఈ పరిస్థితిని గమనిస్తే భారాస, కాంగ్రెస్‌లు తోడుదొంగలని అర్థమవుతోందని ఆరోపించారు. ఆ రెండు పార్టీలు ఒకే నాణానికి బొమ్మ, బొరుసులాంటివని, భాజపా ప్రభంజనాన్ని అడ్డుకునేందుకు ఒక్కటవుతున్నాయని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img