icon icon icon
icon icon icon

భాజపా అంటే భారాస, కాంగ్రెస్‌లకు భయం

గతంలో భారాస ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడి భార్యాభర్తల సంభాషణలు సైతం వింటే.. ప్రస్తుతం కాంగ్రెస్‌ ఫేక్‌ వీడియోలు సృష్టించి తప్పుడు ప్రచారం చేస్తోందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ మండిపడ్డారు.

Updated : 01 May 2024 05:33 IST

బండి సంజయ్‌

వేములవాడ, న్యూస్‌టుడే: గతంలో భారాస ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడి భార్యాభర్తల సంభాషణలు సైతం వింటే.. ప్రస్తుతం కాంగ్రెస్‌ ఫేక్‌ వీడియోలు సృష్టించి తప్పుడు ప్రచారం చేస్తోందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆయన మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అనని మాటలను అన్నట్లుగా కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారం చేస్తుందంటే భాజపా అంటే ఆ పార్టీకి ఏస్థాయిలో భయముందో అర్థమవుతుందన్నారు. గతంలో భయంతోనే భారాస భాజపా కార్యకర్తలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిందని, ఇప్పుడున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం భారాస కంటే రెండింతలు భయపడుతోందని అన్నారు. తెలంగాణలో అత్యధిక స్థానాలు భాజపా గెలవబోతున్నట్లు అన్ని సర్వేలు చెప్పడంతో కాంగ్రెస్‌కు భయం పట్టుకొని రిజర్వేషన్ల విషయంలో అబద్ధాలు ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. అంబేడ్కర్‌ పెట్టిన భిక్షతోనే తాను ప్రధాని అయ్యానని మోదీ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. దేశంలో రాజ్యాంగానికి వ్యతిరేకంగా పని చేసిందే కాంగ్రెస్‌ పార్టీ అని ఆరోపించారు. రాజ్యాంగానికి భిన్నంగా వ్యవహరిస్తే అడ్డుకునే పార్టీ భాజపాయేనని పేర్కొన్నారు. ప్రజలు ఆరు గ్యారంటీలను ప్రశ్నిస్తుండటంతో వారి దృష్టిని మళ్లించడానికి కాంగ్రెస్‌ రిజర్వేషన్ల విషయంలో ప్రజలను అయోమయానికి గురి చేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు.

రిజర్వేషన్లను పక్కాగా అమలు చేసింది భాజపాయేనని స్పష్టం చేశారు. కరీంనగర్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థి ఎవరో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలకే తెలియదని ఎద్దేవా చేశారు. ఆయనకు భారీగా డబ్బులు ఉండటంతో సొమ్ము ఇచ్చి టికెట్‌ తెచ్చుకున్నారని, డబ్బుతో గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. భారాస అభ్యర్థి ఈ ప్రాంతానికి ఏమీ చేయకున్నా అన్నీ తానే చేశానని చెప్పుకొంటున్నారని విమర్శించారు. ఈ ప్రాంతానికి చెందిన మంత్రి భాష, వ్యవహార శైలి చూసి అందరూ నవ్వుకుంటున్నారని, గతంలో ఇక్కడ ఆయనకు డిపాజిట్‌ రాలేదని పరోక్షంగా పొన్నం ప్రభాకర్‌ను ఉద్దేశించి విమర్శించారు. ఓ ఎమ్మెల్యే సోదరుడు ఓ సామాజికవర్గాన్ని తక్కువచేసి మాట్లాడుతున్నారని, ఆ ఎమ్మెల్యేను కాంగ్రెస్‌ పార్టీ సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. రాజకీయాల్లో పోరాటాలు చేయాలే తప్పా ఎవరినీ కించపరిచేలా మాట్లాడటం సరికాదన్నారు. సమావేశంలో భాజపా జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్‌రెడ్డి, వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల పార్టీ ఇన్‌ఛార్జులు చెన్నమనేని వికాస్‌రావు, రాణి రుద్రమరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రం మహేశ్‌, అల్లాడి రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img