icon icon icon
icon icon icon

ఎన్నికల కమిషన్‌ డమ్మీ: జగ్గారెడ్డి

ఎన్నికల కమిషన్‌ డమ్మీగా మారిందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. రాజస్థాన్‌లో ప్రధాని మోదీ విద్వేషపూరిత ప్రసంగం మీద ఎన్నికల కమిషన్‌ నోటీసు ఎందుకు ఇవ్వలేదని ఆక్షేపించారు.

Updated : 01 May 2024 07:38 IST

రాజస్థాన్‌లో మోదీ వ్యాఖ్యలకు నోటీసు ఇవ్వకపోవడంపై ఆక్షేపణ

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: ఎన్నికల కమిషన్‌ డమ్మీగా మారిందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. రాజస్థాన్‌లో ప్రధాని మోదీ విద్వేషపూరిత ప్రసంగం మీద ఎన్నికల కమిషన్‌ నోటీసు ఎందుకు ఇవ్వలేదని ఆక్షేపించారు. ఆయన మంగళవారం గాంధీభవన్‌లో పీసీసీ ప్రధాన కార్యదర్శులు లోకేష్‌ యాదవ్‌, బొల్లు కిషన్‌లతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉన్నప్పుడు టీఎన్‌.శేషన్‌ లాంటి అధికారులు ఎన్నికల కమిషన్‌లో ఉండి, నిష్పక్షపాతంగా వ్యవహరించారన్నారు. ప్రస్తుతం భాజపా ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌ను ఇంటి నౌకరుగా భావిస్తోందని.. ఇది పద్ధతి కాదని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంపూర్ణ మద్దతు కాంగ్రెస్‌కు ఉందని అందుకే ఓటమి భయంతో అమిత్‌షా ఫేక్‌ వీడియో వ్యవహారంలో దిల్లీ పోలీసులను గాంధీభవన్‌కు పంపి ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేశారన్నారు. ఒక్క మహిళైనా తన మంగళసూత్రం కాంగ్రెస్‌ వాళ్లు గుంజుకుపోయారని ఫిర్యాదు చేసినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానన్నారు.

 కాంగ్రెస్‌లో పలువురి చేరిక

ఆదిలాబాద్‌కు చెందిన మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్‌ ఖాన్‌, గండ్ర సుజాత, సంజీవరెడ్డి మంగళవారం గాంధీభవన్‌లో జగ్గారెడ్డి, కోదండరెడ్డిల సమక్షంలో తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు రాకపోవడంతో వారు పార్టీకి రాజీనామాలు చేశారు. పార్టీ వారిని ఆరేళ్లపాటు సస్పెండ్‌ చేసింది. కాంగ్రెస్‌ను వీడిన వారు ఆసక్తి చూపిస్తే తిరిగి చేర్చుకోవాలని అధిష్ఠానం ఆదేశించిన నేపథ్యంలో వారు తిరిగి సొంతగూటికి చేశారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి ఆధ్వర్యంలో వనపర్తికి చెందిన భారాస నేత శాంతయ్య, అనుచరులతో కలిసి గాంధీభవన్‌లో కాంగ్రెస్‌లో చేరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img