icon icon icon
icon icon icon

తప్పుడు ప్రచారంలో గోబెల్‌.. కేసీఆర్‌

కేసీఆర్‌ను చూస్తే గోబెల్‌ మళ్లీ పుట్టాడనిపిస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం ఎక్స్‌లో విమర్శించారు. మొన్న సూర్యాపేటలో, నిన్న మహబూబ్‌నగర్‌లో, తాజాగా ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ)కి సంబంధించి తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి కేసీఆర్‌ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారని సీఎం ఆరోపించారు.

Updated : 01 May 2024 05:29 IST

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శ

ఈనాడు, హైదరాబాద్‌: కేసీఆర్‌ను చూస్తే గోబెల్‌ మళ్లీ పుట్టాడనిపిస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం ఎక్స్‌లో విమర్శించారు. మొన్న సూర్యాపేటలో, నిన్న మహబూబ్‌నగర్‌లో, తాజాగా ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ)కి సంబంధించి తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి కేసీఆర్‌ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారని సీఎం ఆరోపించారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న 2023 మే నెలలో కూడా ఓయూ చీఫ్‌ వార్డెన్‌ వేసవి సెలవులకు సంబంధించి, నెల రోజులపాటు హాస్టళ్లు, మెస్‌లు మూసివేయడానికి నోటీసు జారీ చేశారని ఆయన వివరించారు. దాని ప్రకారం 12-05-2023 నుంచి 05-06-2023 వరకు వర్సిటీకి సెలవులిచ్చారని ఆయన తెలిపారు. అందులో కూడా విద్యుత్‌, నీటి కొరతల గురించి ప్రస్తావించారని వివరించారు. కాంగ్రెస్‌ వచ్చాకే యూనివర్సిటీని మూసేస్తున్నట్టు దివాలాకోరు ప్రచారం చేయడం కేసీఆర్‌ దిగజారుడుతనానికి పరాకాష్ఠ అని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

ఓయూలో తాగునీరు, కరెంటు సమస్య ఉన్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం: ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: ఉస్మానియా యూనివర్సిటీలో తాగునీరు, కరెంటు సమస్య ఉన్నట్లు నిరూపిస్తే తాను దేనికైనా సిద్ధమని..నిరూపించకపోతే సీఎం రేవంత్‌రెడ్డికి క్షమాపణలు చెప్పాలని మాజీ సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ సవాల్‌ చేశారు. ఆయన మంగళవారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కరెంటు, నీటి సమస్య అంశాన్ని కారణంగా చూపుతూ 15 రోజులు హాస్టళ్లను మూసివేస్తున్నట్లు ఛీఫ్‌ వార్డెన్‌ సర్క్యులర్‌ జారీ చేశారని, ఇది ప్రతి సంవత్సరం జరుగుతుందని ఆయన తెలిపారు. 2023లో భారాస ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాగే జారీ చేశారని, దీనిపై కేసీఆర్‌, భారాస విద్యార్థి నాయకులు రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. దీనిపై సీఎం, డిప్యూటీ సీఎంలు స్పందించి విచారణకు ఆదేశించారని, ఛీఫ్‌ వార్డెన్‌కు షోకాజ్‌ నోటీసు ఇచ్చారని పేర్కొన్నారు. విద్యార్థులు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న కారణంగా హాస్టళ్లు, మెస్‌లు యథావిధిగా కొనసాగించాలని ప్రభుత్వం ఆదేశించిందని వెంకట్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img