icon icon icon
icon icon icon

గెలవకున్నా.. గెలుపోటములను శాసిస్తారు!

ఎన్నికల్లో స్వతంత్రులు, ఇతర గుర్తింపు పొందని పార్టీల అభ్యర్థులు ప్రధాన పార్టీల అభ్యర్థులకు దడ పుట్టిస్తున్నారు. పలు స్థానాల్లో ఫలితాలపై ప్రభావం చూపిస్తున్నారు.

Published : 01 May 2024 09:21 IST

 ప్రధాన అభ్యర్థులకు దడ పుట్టిస్తున్న స్వతంత్రులు
గత ఎన్నికల్లో విజేతల మెజార్టీ కంటే.. పలు స్థానాల్లో వీరికే ఎక్కువ ఓట్లు

ఈనాడు, హైదరాబాద్‌: ఎన్నికల్లో స్వతంత్రులు, ఇతర గుర్తింపు పొందని పార్టీల అభ్యర్థులు ప్రధాన పార్టీల అభ్యర్థులకు దడ పుట్టిస్తున్నారు. పలు స్థానాల్లో ఫలితాలపై ప్రభావం చూపిస్తున్నారు. రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో ఆరు లోక్‌సభ నియోజకవర్గాల్లో గెలుపోటముల మధ్య తేడా చాలా స్వల్పంగా ఉంది. ఆయా నియోజకవర్గాల్లో ఎక్కువ మంది స్వతంత్రులు బరిలో నిలవడం ప్రధాన పార్టీల అభ్యర్థుల ఓట్లపై ప్రభావం చూపిందన్న విశ్లేషణలు ఉన్నాయి. ప్రధాన రాజకీయ పార్టీల వ్యతిరేక ఓట్లను స్వతంత్ర అభ్యర్థులు పొందడంతో ఫలితాలు, లేదంటే మెజారిటీలు తారుమారవుతున్నాయన్న భావన ఉంది. గత పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా తెరాస (ప్రస్తుత భారాస) 41.71 శాతం ఓట్లు సాధించగా.. కాంగ్రెస్‌ 29.78 శాతం, భాజపా 19.65 శాతం, ఎంఐఎం 2.8 శాతం ఓట్లు పొందాయి. స్వతంత్రులు 3.17 శాతం ఓట్లు కైవసం చేసుకున్నారు. గుర్తింపు పొందని, ఇతర పార్టీలు కలిపి 1.7 శాతం ఓట్లు సాధించాయి. ఆ ఎన్నికల్లో మొత్తం 1.84 కోట్ల ఓట్లు పోలైతే, ఇందులో స్వతంత్ర అభ్యర్థులు సాధించిన ఓట్లు 5.86 లక్షలు ఉన్నాయి.

ఇవీ ఘటనలు...

  •  నిజామాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గంలో గత ఎన్నికల్లో విజేత అయిన భాజపా అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌కు 45.20 శాతం ఓట్లు రాగా.. రెండో స్థానంలో నిలిచిన తెరాస అభ్యర్థి కల్వకుంట్ల కవితకు 38.53 శాతం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ అభ్యర్థికి 6.51 శాతం ఓట్లు దక్కాయి. ఆ ఎన్నికలో ఇక్కడ ఎక్కువ మంది స్వతంత్ర, చిన్న పార్టీల తరఫున అభ్యర్థులు పోటీలో నిలవగా.. వారందరికీ కలిపి దాదాపు 9 శాతం ఓట్లు లభించాయి. విజేతకు లభించిన మెజారిటీ ఓట్ల కంటే వీరందరికీ పడిన ఓట్లు ఎక్కువ శాతం ఉండడం గమనార్హం. దీంతో వీరు ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపు ఓటములపై ప్రభావం చూపించారన్న భావన వ్యక్తమైంది.
  •  జహీరాబాద్‌ నియోజకవర్గంలో తెరాస అభ్యర్థి బీబీ పాటిల్‌ (41.57%), కాంగ్రెస్‌ అభ్యర్థి మదన్‌మోహన్‌రావు (40.97%)కు వచ్చిన ఓట్ల మధ్య తేడా 0.6 శాతమే. ఆ ఎన్నికలో స్వతంత్రులు, ఇతర గుర్తింపు లేని పార్టీల అభ్యర్థులు 3.5 శాతం ఓట్లు సాధించారు.
  •  మల్కాజిగిరి స్థానంలోనూ ఇదే పరిస్థితి. అప్పట్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి 38.61 శాతం ఓట్లు సాధిస్తే, ప్రస్తుత ఎమ్మెల్యే, అప్పటి తెరాస అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డి 37.91 శాతం ఓట్లు సాధించారు. ఇద్దరి మధ్య ఓట్ల వ్యత్యాసం 0.7 శాతమే. ఇక్కడ స్వతంత్ర, ఇతర చిన్న పార్టీల అభ్యర్థులు 2.6 శాతానికిపైగా ఓట్లు సాధించారు.
  •  చేవెళ్ల నియోజకవర్గంలో జి.రంజిత్‌రెడ్డి 40.59 శాతం ఓట్లు సాధించగా.. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి 39.49 శాతం ఓట్లు పొందారు. ఇద్దరి మధ్య ఓట్ల తేడా 1.1 శాతమే. ఇక్కడ స్వతంత్రులు, ఇతర గుర్తింపులేని పార్టీల అభ్యర్థులు ఈ తేడా కన్నా మూడింతల ఎక్కువ ఓట్లు సాధించడం గమనార్హం.
  •  నల్గొండలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి 44.73 శాతం ఓట్లు లభిస్తే, ప్రత్యర్థి తెరాస అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డికి 42.54 శాతం ఓట్లు వచ్చాయి. వీరి మధ్య ఓట్ల వ్యత్యాసం 2.19 శాతం కాగా.. ఇక్కడా స్వతంత్రులు, ఇతర గుర్తింపు లేని పార్టీల అభ్యర్థులు దాదాపు 6 శాతం ఓట్లు రాబట్టారు.
  •  భువనగిరిలో నాటి కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తెరాస అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌ మధ్య ఓట్ల తేడా 0.43 శాతం కాగా.. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులు సాధించిన ఓట్లు 4 శాతానికి పైగా ఉన్నాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img