icon icon icon
icon icon icon

ఆ ‘ఎక్స్‌’ ఖాతాతో సంబంధం లేదు

రిజర్వేషన్లపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వ్యాఖ్యలపై ఫేక్‌ వీడియో వైరల్‌ అయిన సంఘటనకు, తనకు సంబంధం లేదని దిల్లీ పోలీసులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమాధానమిచ్చారు.

Published : 02 May 2024 02:52 IST

దిల్లీ పోలీసులకు సీఎం రేవంత్‌ తరఫున సమాధానమిచ్చిన న్యాయవాది
15 రోజుల గడువు కోరిన మిగతా నాయకులు

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: రిజర్వేషన్లపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వ్యాఖ్యలపై ఫేక్‌ వీడియో వైరల్‌ అయిన సంఘటనకు, తనకు సంబంధం లేదని దిల్లీ పోలీసులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమాధానమిచ్చారు. ఈ మేరకు ఆయన తరఫున న్యాయవాది సౌమ్య గుప్తా బుధవారం దిల్లీ పోలీసులను కలిసి లేఖను అందజేశారు. రిజర్వేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, మే 1న విచారణకు హాజరు కావాలని దిల్లీ పోలీసులు రేవంత్‌కు నోటీసులిచ్చిన మీదట ఆమె వెళ్లి దిల్లీ పోలీసులను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘ఆ వీడియో షేర్‌ చేసిన ‘ఎక్స్‌’ ఖాతాతో రేవంత్‌కు సంబంధం లేదు. ఆ ఎకౌంట్‌ ఆయనది కాదు. ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ (ఐఎన్‌సీ) తెలంగాణ ‘ఎక్స్‌’ ఖాతాను రేవంత్‌రెడ్డి నిర్వహించడం లేదు. ఆయనకు కేవలం సీఎంవో తెలంగాణ, ఆయన వ్యక్తిగత ఖాతాలను మాత్రమే ‘ఎక్స్‌’లో వినియోగిస్తున్నారు. ఇవే విషయాలను దిల్లీ పోలీసులకు వివరించా’’ అని సౌమ్య గుప్తా తెలిపారు. ఈ విషయంపై సీనియర్‌ నాయకులు కోదండరెడ్డి, జి.నిరంజన్‌లతో కలిసి పీసీసీ న్యాయ సలహాదారు, అధికార ప్రతినిధి రామచంద్రారెడ్డి బుధవారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘ఈ కేసులో నోటీసులు అందుకున్న పీసీసీ సోషల్‌ మీడియా ఛైర్మన్‌ మన్నె సతీష్‌, కో ఆర్డినేటర్‌ నవీన్‌, పీసీసీ కార్యదర్శి శివకుమార్‌, అధికార ప్రతినిధి అస్మా తస్లీంలు దిల్లీ పోలీసులకు సమాధానం ఇవ్వడానికి 15 రోజులు గడువు కోరినట్లు తెలిపారు. మరో అభియోగంలో బుధవారం దిల్లీ పోలీసులు సికింద్రాబాద్‌లో ఉంటున్న కాంగ్రెస్‌ కార్యకర్త గీత ఇంటికి వెళ్లి 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చారు. ఆమె సెల్‌ ఫోన్‌ సీజ్‌ చేశారు. మహిళా పోలీసులు కాకుండా మగ పోలీసులు వెళ్లి భయభ్రాంతులకు గురి చేయడమేంటి’’ అని ప్రశ్నించారు. కోదండరెడ్డి మాట్లాడుతూ.. దేశంలో రెండు విడతలుగా జరిగిన ఎన్నికల్లో కమలానికి తక్కువ సీట్లు వస్తాయని భాజపా సర్వేల్లో తేలిందని చెప్పారు. అందుకే మోదీ, అమిత్‌షాలు పరుష పదజాలం ఉపయోగిస్తూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. నిరంజన్‌ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో దిల్లీ పోలీసులు రాష్ట్రానికి వస్తుంటే తెలంగాణ పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img