icon icon icon
icon icon icon

కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

భారాస సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. బుధవారం భారాస ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి, లేఖను అధినేత కేసీఆర్‌కు పంపారు.

Published : 02 May 2024 02:52 IST

దీపా దాస్‌మున్షీ సమక్షంలో చేరిక

హైదరాబాద్‌, నిర్మల్‌, న్యూస్‌టుడే: భారాస సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. బుధవారం భారాస ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి, లేఖను అధినేత కేసీఆర్‌కు పంపారు. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే ఆయన గాంధీభవన్‌కు చేరుకున్నారు. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కొద్ది రోజుల క్రితం ఆయన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కె.జానారెడ్డి, ఆ తర్వాత ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిలతో భేటీ అయ్యారు. అప్పటి నుంచి ఆయన కాంగ్రెస్‌లో చేరతారంటూ ప్రచారం జోరందుకుంది. అయితే ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నేతలు వ్యతిరేకించడంతో ఆగిపోయారు. నాలుగైదు రోజుల క్రితం వివిధ కారణాలతో పార్టీని వీడిన వారిని, ఇతర పార్టీల నుంచి వచ్చే వారిని చేర్చుకోవాలని ఏఐసీసీ ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం త్రిసభ్య కమిటీని సైతం ఏర్పాటు చేసింది. దీంతో ఇంద్రకరణ్‌రెడ్డి చేరికకు మార్గం సుగమమైంది. తెదేపాతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన నిర్మల్‌ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యే, ఆదిలాబాద్‌ నుంచి రెండుసార్లు ఎంపీగా గెలుపొందారు. 2014లో నిర్మల్‌ కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించినా రాకపోవడంతో బహుజన సమాజ్‌ పార్టీ నుంచి పోటీచేసి విజయం సాధించారు. రాష్ట్రంలో భారాస అధికారంలోకి రావడంతో ఆ పార్టీలో చేరి మంత్రి పదవి దక్కించుకున్నారు. 2018 ఎన్నికల్లో భారాస అభ్యర్థిగా పోటీ చేసి   ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టారు. 2023లో మరోసారి బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. ఇంద్రకరణ్‌రెడ్డితోపాటు సంచార జాతుల కులాలకు చెందిన ముఖ్య నాయకుడు డా.వెన్నెల అశోక్‌ కూడా కాంగ్రెస్‌లో చేరారు. ఏఐసీసీ కార్యదర్శి విష్ణునాథ్‌, ఖైరతాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img