icon icon icon
icon icon icon

‘ఇంటి నుంచి ఓటు’ 3న ప్రారంభం

‘ఇంటి నుంచి ఓటు’ ప్రక్రియ ఈ నెల 3వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ తెలిపారు.

Published : 02 May 2024 02:53 IST

ఎన్నికల విధుల్లో 3 లక్షల మంది సిబ్బంది
35,809 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు
పంట నష్టపరిహారం చెల్లింపునకు ఈసీ అనుమతి
రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌

ఈనాడు, హైదరాబాద్‌: ‘ఇంటి నుంచి ఓటు’ ప్రక్రియ ఈ నెల 3వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ తెలిపారు. అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతులకు పరిహారం చెల్లించేందుకు అనుమతి ఇవ్వాలన్న ప్రభుత్వ లేఖకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. హైదరాబాద్‌ బీఆర్కే భవన్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో 35,809 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. అత్యధికంగా మల్కాజిగిరి నియోజకవర్గంలో 3,226; అతి తక్కువగా మహబూబాబాద్‌లో 1,689 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో మొత్తం 525 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయుల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నుంచి 68 మంది, రిజిస్టర్డ్‌ అన్‌ రికగ్నైజ్డ్‌ పార్టీల నుంచి 172 మంది, స్వతంత్రులు 285 మంది పోటీ చేస్తున్నారు. ఇంటి నుంచి ఓటువేసేందుకు 23,248 మందిని అర్హులుగా గుర్తించాం. ఈ ప్రక్రియను శుక్రవారం ప్రారంభించి సోమవారానికి పూర్తిచేస్తాం. ఎన్నికల విధుల్లో పాల్గొనే 2,45,586 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఓటరు సమాచార పత్రాల పంపిణీ హైదరాబాద్‌లో 46% పూర్తయింది.

అదనపు బ్యాలెట్‌ యూనిట్లు..

అభ్యర్థుల సంఖ్య పెరగడంతో అదనంగా 35 వేల బ్యాలెట్‌ యూనిట్లు తెప్పించాం. 15 మంది అభ్యర్థుల కన్నా ఎక్కువ ఉంటే రెండో బ్యాలెట్‌ యూనిట్‌ ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలో 7 స్థానాల్లో మూడు, 9 నియోజకవర్గాల్లో రెండు బ్యాలెట్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాం. ఆదిలాబాద్‌ స్థానంలో ఒకే ఒక్క బ్యాలెట్‌ యూనిట్‌ను వినియోగించనున్నాం. రాష్ట్రానికి 155 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను కేటాయించారు. ఇక్కడి పరిస్థితుల అంచనాల మేరకు అదనపు బలగాలు కావాలని కోరాం. రాష్ట్రంలో ఉన్న 60 వేల మంది పోలీసులతో పాటు.. 20 వేల మంది ఇతర రాష్ట్రాల నుంచి వస్తారు. వివిధ స్థాయుల్లో సుమారు 3 లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. పోలింగ్‌ సందర్భంగా క్యూలో ఎంతమంది ఉన్నారు.. ఎంత సమయం పడుతుందన్నది తెలుసుకునే ‘క్యూ యాప్‌’నకు మరింత విస్తృతంగా ప్రచారం కల్పిస్తాం. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో 2,53,781 మంది ఓటర్లు నమోదయ్యారు. 262 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశాం’’ అని వికాస్‌రాజ్‌ వివరించారు. విలేకరుల సమావేశంలో ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు లోకేశ్‌ కుమార్‌, సర్ఫరాజ్‌ అహ్మద్‌, సత్యవాణి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img